13-07-2025 07:55:35 PM
దౌల్తాబాద్ (విజయక్రాంతి): తెలంగాణ ప్రభుత్వం టూరిజం, భాషా సాంస్కృతిక శాఖ సలహాదారుడుగా రాష్ట్ర ప్రభుత్వం దరువు అంజన్నను నియమించగా, శాలువతో సత్కరించి శుభాకాంక్షలు తెలపడం జరిగిందని సోషల్ రిఫార్మేషన్ ఫౌండేషన్ అధ్యక్షురాలు, సామాజిక ప్రజా సేవకురాలు మహమ్మద్ సుల్తాన ఉమర్ అన్నారు. ఆదివారం హైదారాబాద్ లో దరువు అంజన్నను కలిసి సోషల్ రిఫార్మేషన్ ఫౌండేషన్(Social Reform Foundation) ఆధ్వర్యంలో సన్మానం చేసి అభినందనలు తెలిపారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. తెలంగాణ ప్రభుత్వం టూరిజం, భాషా సాంస్కృతిక శాఖ సలహాదారుడిగా రాయపోల్ మండల కేంద్రానికి చెందిన ప్రముఖ తెలంగాణ ఉద్యమకారుడు, ఓయూ జేఏసీ చైర్మన్, కాంగ్రెస్ పార్టీ నాయకులు దరువు అంజన్నను రాష్ట్ర ప్రభుత్వం నియమించడం పట్ల హర్షం వ్యక్తం చేస్తున్నామన్నారు. అలాగే అంజన్నకు ప్రభుత్వం ఇచ్చిన బాధ్యతలు సక్రమంగా నెరవేర్చి పదవికి న్యాయం చేయాలని కోరుతున్నామన్నారు.
అనంతరం అంజన్న మాట్లాడుతూ.. రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన ప్రభుత్వ పథకాలను ప్రజలకు చేరవేస్తూ, పెడదారి పడుతున్న యువతను సన్మార్గంలో నడిచే విధంగా కార్యక్రమాలు చేపడుతూ, సమాజ అభివృద్ధికై తమ వంతుగా కృషి చేస్తామన్నారు. కాంగ్రెస్ ప్రజా ప్రభుత్వం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తమకు అప్పగించిన ఇట్టి మహత్తర బాధ్యతలు భుజాలపై వేసుకొని అమలుపరిచేలా కృషి చేస్తామని ఆయన పేర్కొన్నారు. అలాగే తను సంపాదించే సంపదలో కొంతభాగం సమాజం కోసం ఖర్చు చేస్తూ అనేక ప్రజా సేవా కార్యక్రమాలను చేపడుతూ, నాకు శుభాకాంక్షలు తెలిపిన సోషల్ రిఫార్మేషన్ ఫౌండేషన్ సభ్యులకు ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో ఎస్ఆర్ ఫౌండేషన్ ప్రధాన కార్యదర్శి, జర్నలిస్ట్ పుట్ట రాజు, కోశాధికారి మహమ్మద్ ఉమర్, జర్నలిస్ట్ మన్నే గణేష్ తదితరులు పాల్గొన్నారు.