30-08-2025 09:32:16 PM
పటాన్ చెరు (విజయక్రాంతి): తెలుగు భాషపై మమకారాన్ని పెంచుకొని వ్యవహారిక భాష పట్ల అవగాహన కలిగి ఉండాలని ప్రభుత్వ డిగ్రీ కళాశాల ప్రిన్సిపల్ డాక్టర్ వడ్లూరి శ్రీనివాస్ తెలిపారు. పటాన్ చెరు పట్టణంలోని డాక్టర్ ఏపీజే అబ్దుల్ కలాం ప్రభుత్వ డిగ్రీ కళాశాల(Dr. APJ Abdul Kalam Government Degree College)లో శనివారం ప్రముఖ తెలుగు కవి వ్యవహారిక భాష ఉద్యమ పితామహుడు గిడుగు వెంకట రామమూర్తి గారి జయంతి సందర్భంగా తెలుగు భాషా దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ప్రిన్సిపల్ వడ్లూరి శ్రీనివాస్ మాట్లాడుతూ, ఆగస్టు 29న గిడుగు వెంకట రామమూర్తి జయంతి సందర్భంగా వారు తెలుగు భాషకు చేసిన సేవలను స్మరించుకోవడం మన బాధ్యత అన్నారు. గిడిగు రామమూర్తి బహు భాష శాస్త్రవేత్త, చరిత్రకారుడు, సంఘసంస్కర్త హేతువాది అని తెలిపారు. గిడుగు వాడుక భాష వాదాన్ని చేపట్టినందుకు ఉద్యమమే చేయవలసి వచ్చినదని గ్రాంధిక భాషలో ఉన్న తెలుగు వచనాన్ని ప్రజల వాడుక భాషలోకి తీసుకురావడానికి వారు చేసిన కృషి ప్రశంసనీయమని తెలిపారు.
తాను సొంతంగా సవర భాషను నేర్చుకొని అనేక పుస్తకాలను రచించారు. సొంత డబ్బులతో వారికి భాష నేర్పించడానికి సొంత బడులను కూడా ఏర్పాటు చేశారు. సవర భాషకు వ్యాకరణం తో పాటు పదకోశం కూడా గిడుగు వారు రచించారు. కళాశాల వైస్ ప్రిన్సిపల్ డాక్టర్ ప్రవీణ మాట్లాడుతూ తెలుగు భాష ప్రాధాన్యత, గ్రాంధిక భాష వ్యవహారిక భాష మధ్య వ్యత్యాసాన్ని సవివరంగా వివరించారు. ఈ కార్యక్రమాన్ని తెలుగు విభాగ అధిపతి డాక్టర్ బేబీ రమణి ఆధ్వర్యంలో నిర్వహించారు. అధ్యాపకులు మంజుశ్రీ, వెంకటేశం, టి సురేష్ కుమార్, ఆర్ శివ దీప్తి, బి కరుణాకుమారి, ఎం విజయలక్ష్మి, షరీఫ్ మియా, ఇతర అధ్యాపక బృందం, విద్యార్థులు పాల్గొన్నారు. విద్యార్థులకు నిర్వహించిన ఉపన్యాస పోటీల్లో గెలుపొందిన వారికి కళాశాల ప్రిన్సిపల్ బహుమతులను అందజేశారు.