26-09-2025 12:29:09 AM
సద్దుల బతుకమ్మలోగా నోటఫికేషన్‌కు అవకాశం
కరీంనగర్, సెప్టెంబరు 25 (విజయ క్రాంతి): ఎట్టకేలకు స్థానిక సంస్థల ఎన్నికల నగారా మోగనుంది. ఈ నెలాఖరులోగా సద్దుల బతుకమ్మ కు ముందు రోజుస్థానిక ఎన్నికల నోటిఫికేషన్ విడుదలయ్యే అవకాశం ఉంది. ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో ఏ క్షణంలో ఆదేశాలు జారీ చేసినా స్థానిక ఎన్నికలను నిర్వహించేందుకు జిల్లా యంత్రాంగం సర్వం సిద్ధం చేసింది. అందులో భాగంగా ముందుగా ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికలు ఆ తర్వాత సర్పంచ్ ఎన్నికలు నిర్వహించనున్నారు.
బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు కల్పిస్తూ ప్రభుత్వం మరో మారు జీవో జారీ చేసి ఎన్నిక్షలకు వెళ్లనుంది. ఇప్పటికే జిల్లా కలెక్టర్ల సమక్షంలో డీపీవోలు, ఆర్డీవోలు, తహసిల్దార్లు సంబధిత అధికారులు రిజర్వేషన్ల ప్రక్రియ పూర్తి చేసినట్లు సమాచారం. ఎన్నికలు నిర్వహించేందుకు రిజర్వేషన్ల ప్రకటనే తరాయిగా మిగిలింది. ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో జిల్లాల వారీగా చూసుకుంటే కరీంనగర్ జిల్లాలో మొత్తం జడ్పీటీసీ స్థానాలు 15 ఉండగా 170 ఎంపీటీసీ స్థానాలు ఉన్నాయి. అలాగే జగిత్యాల జిల్లాలో 20 జడ్పీటీసీ స్థానాలు ఉండగా 216 ఎంపీటీసీ స్థానాలు ఉన్నాయి.
పెద్దపల్లి జిల్లాలో 14 జడ్పీటీసీ స్థానాలు ఉండగా 137 ఎంపీటీసీ స్థానాలు ఉన్నాయి. రాజన్న సిరిసిల్ల జిల్లాలో 12 జడ్పీటీసీ స్థానాలు ఉండగా 123 ఎంపీటీసీ స్థానాలు ఉన్నాయి. ఈ నెలాఖరులోగా ఎన్నికల నోటిఫికేషన్ విడుదలయ్యే అవకాశం ఉండటంతో స్థానిక ఎన్నికల కోసం ఎదురుచూస్తున్న ఆశావహులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. అన్ని రాజకీయ పార్టీలు కూడా స్థానిక ఎన్నికల కోసం పార్టీ శ్రేణులను సిద్ధం చేస్తున్నాయి. స్థానిక ఎన్నికల్లో పట్టు సాధించేందుకు ఇప్పటి నుంచే వ్యూహ రచనలు చేస్తున్నాయి. అధికార కాంగ్రెస్ పార్టీతోపాటు బీజేపీ, బీఆర్‌ఎస్ పార్టీలు స్థానిక ఎన్నికల్లో అత్యధిక స్థానాలు సాధించేందుకు కసరత్తుచేస్తున్నాయి.