calender_icon.png 6 November, 2025 | 3:42 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ఆ జానపద కథే జటాధరకు మూలం

06-11-2025 01:18:14 AM

సుధీర్‌బాబు, సోనాక్షి సిన్హా ప్రధాన పాత్రల్లో నటిస్తున్న చిత్రం ‘జటాధర’. ఈ పాన్-ఇండియా ద్విభాషా చిత్రానికి వెంకట్ కళ్యాణ్, అభిషేక్ జైస్వాల్ దర్శకత్వం వహించారు. ఉమేశ్‌కుమార్ బన్సల్, శివిన్ నారంగ్, అరుణ అగర్వాల్, ప్రేరణ అరోరా, శిల్పా సింగ్‌హల్, నిఖిల్ నందా నిర్మించారు. ఈ చిత్రంలో శిల్పా శిరోధ్కర్ కీలక పాత్ర పోషించారు. నవంబర్ 7న హిందీ, తెలుగు భాషల్లో విడుదల కానున్న ఈ సినిమా విశేషాలను హీరో సుధీర్‌బాబు విలేకరులతో పంచుకున్నారు.

“చిన్నప్పుడు మనం జానపద, చందమామ కథలు వినుంటాం.. ‘బ్యాంకులో లేని సమయంలో ధనాన్ని భూమి లో పాతి ఒక బంధనం వేసి దానికి ఒక పిశాచి కాపలాగా ఉంటుంది’ అనే ఒక జానపద కథ ప్రచారంలో ఉండేది. దాన్ని ప్రజెంట్ టైమ్‌లోకి మార్చి చాలా ఆసక్తికరంగా మలిచారు. ఈ కథ విన్నప్పుడు కూడా నాకు ఆసక్తిగా అనిపించింది. యాక్షన్, ఫ్యామిలీ, మైథలాజి అన్ని ఎమోషన్స్ కుదిరిన సినిమా ఇది. ఇందులో నేను ఘోస్ట్ హంటర్‌గా కనిపిస్తా.

నా పాత్ర దెయ్యాలపై నమ్మకం ఉండదు. దేవున్ని, సైన్స్‌ను నమ్మే పాత్ర. ఈ సినిమా కోసం కొన్ని డాక్యుమెంటరీలు చూశా. కొన్ని పరికరాల గురించి తెలుసుకున్నా. ఈ క్రమంలో ఆత్మలు ఉంటాయని పూర్తిగా కాకపోయినా లైట్‌గా నమ్మాలి అనిపిస్తుంది (నవ్వుతూ). ‘బాఘీ’ తర్వాత బాలీవుడ్ నుంచి కొన్ని అవకాశాలు వచ్చాయి. నా ఫోకస్ తెలుగు సినిమాపైనే ఉంది. ఈ సినిమ తర్వాత రాహుల్ రవీంద్రన్‌తో ఒక సినిమా ఉంది.. కాన్సెప్ట్ పరంగా అది ఒక బాహుబలి లాంటి సినిమా. పుల్లెల గోపీచంద్ బయోపిక్ కూడా చేయాల్సి ఉంది” అని తెలిపారు.