25-11-2025 12:22:01 AM
రామ్ పోతినేని హీరోగా, భాగ్యశ్రీ బోర్సే హీరోయిన్‌గా నటిస్తున్న చిత్రం ‘ఆంధ్ర కింగ్ తాలూకా’. కన్నడ సూపర్ స్టార్ ఉపేంద్ర ఆన్-స్క్రీన్ సూపర్ స్టార్ పాత్రను పోషిస్తున్నారు. మహేశ్‌బాబు పీ దర్శకత్వంలో మైత్రి మూవీ మేకర్స్ పతాకంపై రూపొందు తున్న ఈ సినిమా నవంబర్ 27న థియేటర్లలోకి వస్తోంది. ఈ సందర్భంగా డైరెక్టర్ మహేశ్‌బాబు విలేకరులతో చిత్ర విశేషాలను పంచుకున్నారు.
- ఈ సినిమాకు ‘ఆంధ్ర కింగ్ తాలూకా’ అనే టైటిల్ పెట్టడానికి ఓ కారణం ఉంది. దాని వెనుక చాలా అర్థం ఉంది. 2002 సమయంలో జరిగే సినిమా ఇది. ముందు ‘ఆంధ్ర కింగ్’ అని పెట్టాను. తర్వాత ఓ సన్నివేశం రాస్తున్నప్పుడు ‘ఎవరి తాలూకా..?’ అని డైలాగ్ వస్తుంది. హీరో తన ఐడెంటిటీగా ఫీల్ అవుతున్న ఆ ఎమోషన్‌ను బట్టి ఈ టైటిల్‌ను నిర్ణయించాం.
- ఓ ఇంటర్వ్యూలో ‘నేను బయటకంటే సినిమాలోనే రియల్ మనిషి’ అని ఉపేంద్ర చెప్పిన మాట నన్ను ఆలోచింపజేసింది. అప్పుడే ఈ సినిమాలో ఆయన చేసిన ‘సూర్య’ క్యారెక్టర్ ఇలా ఉంటుందనిపించింది. అందుకే ఈ పాత్ర కోసం ఆయన్నే సంప్రదించాం. ఉపేంద్ర గొప్ప మానవత్వం ఉన్న మనిషి. ఆయనకు హార్డ్ కోర్ ఫ్యాన్స్ ఉన్నారు.
- చాలా రోజుల క్రితం నేనొక సినిమాకు వెళ్లినప్పుడు ఓ ప్రేక్షకుడు ప్రతి డైలాగ్‌కూ కనెక్ట్ అవుతున్నాడు. నిజానికి ఆ సినిమా హీరోతో అతనికి వ్యక్తిగతంగా ఎలాంటి బంధం ఉండదు. దక్షిణాదిన హీరోలను మన జీవితంలో అంతర్భాగంగా చూస్తాం. అలా స్టార్, ఫ్యాన్ రిలేషన్‌లో చాలా ఎమోషన్స్ ఉంటాయి. అభిమానిని ఆధారంగా కొన్ని సినిమాల్లో వచ్చాయి కానీ ఇలాంటి కథ రాలేదు.