13-10-2025 01:14:43 AM
న్యూఢిల్లీ, అక్టోబర్ 12: ‘న్యూఢిల్లీలోని అఫ్గన్ రాయబార కార్యాలయంలో ఇటీవల నిర్వహించిన మీడియా సమావేశానికి మహిళా జర్నలిస్టులకు అనుమతివ్వలేదన్న ఆరోపణల్లో వాస్తవం లేదు. మేం ఉద్దేశపూర్వకంగా మహిళా జర్నలిస్టులను రానీయ కుండా అడ్డుకోలేదు. సమావేశ నిర్వహణకు తక్కువ సమయం ఉన్న నేపథ్యంలో మేం పరిమిత సంఖ్యలో జర్నలిస్టులను ఆహ్వానిం చాం.
ఆ పొరపాటు కేవలం సాంకేతికత లోపమే తప్ప.. లింగ వివక్ష కాదు’ అని అఫ్గనిస్తాన్ విదేశాంగశాఖ మంత్రి అమీర్‌ఖాన్ ముత్తాఖీ స్పష్టం చేశారు. న్యూఢిల్లీలోని అఫ్గన్ రాయబార కార్యాలయంలో ఆదివా రం మహిళా జర్నలిస్టులతో నిర్వహించిన మీడియా సమావేశంలో ఈ మేరకు ఆయన స్పష్టతనిచ్చారు. ఇటీవల ముత్తాఖీ న్యూఢిల్లీ పర్యటన సందర్భంగా నిర్వహించిన ప్రెస్ కాన్ఫరెన్స్‌కు మహిళా జర్నలిస్టులను అనుమతించకపోవడంపై భారతదేశవ్యాప్తంగా విమర్శలు వెల్లువెత్తాయి.
ప్రతిపక్ష నేతలు, అనేక మీడియా సంస్థల ప్రతినిధులు, పాత్రికేయులు మండిపడ్డారు. ‘ది ఎడిటర్స్ గిల్డ్ ఆఫ్ ఇండియా’ వంటి సంస్థలు సైతం తీవ్రమైన అభ్యంతరం వ్యక్తం చేశాయి. దీనిపై భారత విదేశాంగ మంత్రిత్వ శాఖ సైతం స్పందించింది.
ఆ ప్రెస్ మీట్‌తో భారత్‌కు ఎలాంటి సంబంధం లేదని తేల్చి చెప్పింది. సమావేశం తాలిబన్ రాయబార కార్యాలయంలో జరిగిందని, ఆ ప్రాంగణంపై భారత్ ప్రమేయం లేదని స్పష్టం చేసింది. ఇదే క్రమంలో తాజాగా తాలిబన్ విదేశాంగశాఖ మంత్రి కూడా స్పందించడం గమనార్హం.