13-10-2025 01:16:15 AM
పాట్నా, అక్టోబర్ 12: బీహార్ అసెంబ్లీ ఎన్నికలకు ఎన్డీయే కూటమి సై..సై అంటూ బరిలోకి దిగుతున్నది. దీనిలో భాగంగా ఆదివారం బీజేపీ, జేడీయూ మధ్య సీట్ల సర్దుబాటు ఖరారైంది. రాష్ట్రవ్యాప్తంగా మొత్తం 243 అసెంబ్లీ స్థానాలు ఉండగా.. బీజేపీ, జేడీయూ చెరో 101 స్థానాల్లో పోటీ చేయాలనే నిర్ణయానికి వచ్చాయి. అలాగే కేంద్ర మంత్రి చిరాగ్ పాసవాన్ నేతృత్వంలోని లోక్ జన్‌శక్తి పార్టీ (రాంవిలాస్) 29వ స్థానాల్లో బరిలో దిగనున్నది.
కేంద్ర మంత్రి జీతన్ రామ్ మాంఝీ నేతృత్వంలోని హిందుస్థానీ అవామ్ మోర్చా (హెఏఎం)కు, కేంద్ర మాజీ మంత్రి ఉపేంద్ర కుశ్వాహా నేతృత్వంలోని రాష్ట్రీయ లోక్‌మోర్చా (ఆర్‌ఎల్‌ఎం)కు ఆరు చొప్పున సీట్లు కేటాయింపు జరిగింది. కూటమి పక్షాలన్నీ ఈ సీట్ల సర్దుబాటును స్వాగతించాయని కేంద్రమంత్రి, బీజేపీ సీనియర్ నేత ధర్మేంద్ర ప్రధాన్ ఆదివారం సోషల్‌మీడియా ద్వారా స్పష్టం చేశారు.
2020 ఎన్నికల్లో జేడీయూ 115 స్థానాల్లో బరిలోకి దిగగా, బీజేపీ 110 స్థానాల్లో పోటీ చేసింది. లోక్ జన్‌శక్తి (రాంవిలాస్) పార్టీ ఈ ఎన్నికల్లో ఒంటరిగానే 22 స్థానాల్లో పోటీ చేసింది. ఆ పార్టీ ఈసారి మరో ఏడు స్థానాల్లో అదనంగా పోటీ చేయనున్నది.
మరోవైపు.. ప్రతిపక్ష ‘ఇండియా’ కూటమి (మహా ఘట్బంధన్)లో సీట్ల సర్దుబాటుపై ఇంకా చర్చలు కొనసాగుతున్నాయి. ఆర్జేడీ 135 -140 స్థానాల్లో పోటీ చేయాలని భావిస్తున్నట్లు సమాచారం. కాంగ్రెస్ 70 స్థానాలు డిమాండ్ చేస్తుండగా, 50 -52 వరకు ఇవ్వగలమని ఆర్జేడీ చెప్తుందని తెలిసింది. కాగా, వచ్చే నెలలో 6, 11వ (రెండు విడత) తేదీల్లో ఆ రాష్ట్రంలో అసెంబ్లీ ఎన్నికలు జరుగనున్నాయి.