calender_icon.png 20 December, 2025 | 10:25 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

చూపుల సింగారాలు

15-12-2025 12:51:25 AM

చూపులలో చక్కదనముంటుంది..- చూపరులను కట్టిపడవేస్తుంది

కాంతులను విరజిమ్ముతుంది.. హృదులను సంతసపరుస్తుంది

చూపులలో మాటలుంటాయి.. చెప్పకుండానే పలుకుతాయి

గుండెలలో నిండిన భావాలన్నీ ఒక క్షణంలో వ్యక్తమవుతాయి !


నిశ్శబ్దాన్ని చీల్చేచూపులు.. నవ్వులకన్నా మధురమవుతాయి

పలకరింపు లేకపోయినా మనసులమధ్య సేతువులవుతాయి

ఓ చూపు.. చిన్న గాలివానలా వస్తుంది

మనసులోని కణాలను తాకి వెలుగుల మేఘముగా మారుతుంది !


ఓ చూపు.. ముత్యపు బిందువై పడుతుంది

కళ్లలోనుంచి గుండెలలోకి జారుతుంది.. అమృతపు జలధారగా కురుస్తుంది

మాటలు తడబడినపుడు, చూపే భాషగామారుతుంది

సంగతులు తట్టనపుడు, చూపులే సందేశాలవుతాయి !


ఒక్కోచూపు కోపంలో కాంతులా దహిస్తుంది, ప్రేమలో 

చల్లని వానలాగ తడుపుతుంది..

విషాదంలో గాఢమవుతుంది.. ఆనందంలో మెరుపులా మెరుస్తుంది.

కంటిచూపులు కొన్నిసార్లు గాయపరుస్తాయి

కొన్నిసార్లు మాయమవుతాయి

కానీ ఒకసారి కలిసిన చూపులు.. జీవితమంతా జ్ఞాపకాలవుతాయి !


మొదట చూచిన చూపే కొత్త ప్రాణాన్నిస్తుంది

నవ్వుల వెనుక ఆ చూపులలోనే కథ మొదలవుతుంది

చూపులే సాక్షిగా ప్రేమపుట్టకొస్తుంది.. 

మౌనమే జవాబుగా మాట మూగబోతుంది..

కానీ ఆ చూపులలోనే జీవితం మొత్తం వెలిగిపోతుంది !

 గుండ్లపల్లి రాజేంద్రప్రసాద్