26-11-2025 12:36:25 AM
ఉన్నతాధికారి ఆదేశాలు పాటించకపోవడం క్రమశిక్షణారాహిత్యమే
ఆర్మీ అధికారి శామ్యూల్ కమలేశన్‌పై చర్యలు సమర్థనీయం: సుప్రీం కోర్టు
న్యూఢిల్లీ, నవంబర్ 25: భారత సైన్యం ఒక లౌకిక సంస్థ అని, సైన్యానికి సంబంధించిన క్రమశిక్షణ విషయంలో మాత్రం రాజీపడలేమని భారత అత్యున్నత న్యాయస్థానం సుప్రీం కోర్టు సంచలన వ్యాఖ్యలు చేసింది. గురుద్వారాలో తాను ప్రవేశించలేనని శామ్యూల్ కమలేశన్ అనే క్రిస్టియన్ ఆర్మీ అధికారి తన ఉన్నతాధికారికి చెప్పినందుకు గాను.. ఆయన్ను విధుల నుంచి తొలగిస్తూ ఆర్మీ తీసుకున్న చర్యను సమర్థించింది.
ఈ మేరకు గతంలో ఢిల్లీ హైకోర్టు ఇచ్చిన తీర్పును సమర్థించింది. భారత సైన్యం పరిధిలోని 3వ ఆశ్విక దళ రెజిమెంట్ లెఫ్టినెంట్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తున్న శామ్యూల్ కమలేశ్ గురుద్వారాకు వెళ్లాలని తన ఉన్నతాధికారి ఆదేశించారు. ఆ ఆదేశాన్ని శామ్యూల్ తిరస్కరించాడు. గురుద్వారాలోకి ప్రవేశించడాన్ని క్రైస్తవం అంగీకరించదని చెప్పాడు. దీంతో ఆర్మీ ఆయన్ను విధులను తొలగించింది.
దీంతో శామ్యూల్ ఢిల్లీ హైకోర్టులో సవాల్ చేశాడు. పిటిషన్‌పై హైకోర్టు స్పందిస్తూ.. ఆర్మీ ఆదేశాలను ఉల్లంఘించడం క్రమశిక్షణారాహిత్య మేనని, ఆర్మీ తీసుకున్న నిర్ణయం సరైనదని తేల్చిచెప్పింది. శామ్యూల్‌కు పింఛన్, గ్రాట్యుటీ లేకుండా ఆర్మీ నుంచి తొలగిస్తూ 2021లో ఆర్మీ తీసుకున్న నిర్ణయాన్ని సమర్థిస్తూ ఈ తీర్పు ఇచ్చింది. దీంతో శామ్యూల్ సుప్రీం కోర్టును ఆశ్రయించాడు.
మంగళవారం ఈ పిటిషన్‌పై సీజేఐ జస్టిస్ సూర్యకాంత్, జస్టిస్ జాయ్‌మాల్య బాగ్చితో కూడిన ధర్మాసనం విచారణ చేపట్టింది. ‘శామ్యూల్.. మీరు దేశానికి, ఆర్మీకి ఎలాంటి సందేశం ఇవ్వాలనుకుంటున్నారు ? ఒకసారి ఆర్మీ యూనిఫాం ధరించాక మీకు వ్యక్తిగత అభిప్రాయాలు, విశ్వాసాలకు తావు ఉండకూడదు. ఇది పూర్తిగా క్రమశిక్షణారాహిత్యం.
ఒక ఆర్మీ అధికారికి తన ఉన్నతాధికారుల ఆదేశాలను ధిక్కరించే దుందుడుకు స్వభావం సరికాదు. ఆర్మీ లౌకికత్వానికి సంబంధించింది’ అని స్పష్టం చేసింది. తర్వాత శామ్యూల్ తరఫు న్యాయవాది తన వాదనలు వినిపించగా ఆ వాదనలను ధర్మాసనం అంగీకరించలేదు. ఆర్మీ లౌకిక విధానాన్ని, సైనికుల మనోభావాలను గౌరవించడంలో శామ్యూల్ విఫలమయ్యాడని కోర్టు తేల్చి చెప్పింది.