calender_icon.png 19 December, 2025 | 4:46 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

వెనక్కి తగ్గేది లేదు.. క్షమాపణ చెప్పను

18-12-2025 01:13:01 AM

  1. ఆపరేషన్ సిందూర్‌లో మొదటిరోజే భారత్ ఓడిపోయింది

నా వ్యాఖ్యలు సమర్థనీయమే

మహారాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి పృథ్వీరాజ్ చవాన్ 

వ్యాఖ్యలపై పార్లమెంట్ సమావేశాల్లో రాజకీయ దుమారం

ముంబై, డిసెంబర్ 17:  ఆపరేషన్ సింధూర్ మొదటి రోజే భారత్ ఓడిపోయిందంటూ తాను చేసిన వ్యాఖ్యలపై ఏమాత్రం వెనక్కి తగ్గేది లేదని కాంగ్రెస్ సీనియర్ నేత, మహారాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి పృథ్వీరాజ చవాన్ స్పష్టం చేశారు. ’నేను ఎలాంటి తప్పు మాట్లాడలేదు.

దీనిపై క్షమాపణ చెప్పే ప్రసక్తే లేదు’ అని ఆయన బుధవారం పేర్కొన్నారు. పూణేలో జరిగిన ఒక కార్యక్రమంలో ’ఆపరేషన్ సింధూర్ ప్రారంభంలో పాక్ బలగాలు.. భారత విమానాలను కూల్చివేశాయని, తద్వారా భారత వైమానికి దళం వెనక్కి తగ్గిందంటూ పృథ్వీరాజ్ చవాన్ చేసిన వ్యాఖ్యలు రాజకీయ దుమారం రేపుతున్నాయి. పార్లమెంట్ సమావేశాల్లో ఈ అంశం అధికార బీజేపీకి ఆయుధంగా మారింది.

కాంగ్రెస్ భారత్‌ను అవమానిస్తోంది

చవాన్ వ్యాఖ్యలపై బీజేపీ తీవ్రస్థాయిలో మండిపడుతోంది. కాంగ్రెస్ ఎప్పుడూ పాకిస్థాన్‌కు  అనుకూలంగా ఉంటూ, దేశాన్ని అవమానిస్తోందని బీజేపీ ఎంపీ బ్రిజ్ లాల్ ధ్వజమెత్తారు. రాహుల్ గాంధీ విదేశాల్లో దేశ ప్రతిష్టను దిగజార్చితే, చవాన్ ఇక్కడ సైన్యం నైతికతను దెబ్బతీస్తున్నారని ఆయన ఆరోపించారు. దేశ ప్రజలు కాంగ్రెస్‌కు తగిన గుణపాఠం చెబుతారని ఆయన హెచ్చరించారు. కాంగ్రెస్ ఎంపీ ప్రమోద్ తివారీ దీనిపై స్పందిస్తూ..

భారత సైన్యం తిరుగులేని శక్తి అని కొనియాడారు. కానీ గతంలో ఇందిరా గాంధీ నాయకత్వంలో సాధించిన విజయాలను గుర్తు చేస్తూ, ఆయన ప్రధాని మోదీపై పరోక్ష విమర్శలు చేశారు. గత ఏప్రిల్‌లో పహల్గామ్ ఉగ్రదాడికి ప్రతీకారంగా భారత్ ఆపరేషన్ సింధూర్ సైనిక చర్య ద్వారా పాకిస్థాన్, పీఓకేలోని సుమారు తొమ్మిది ఉగ్రవాద స్థావరాలను మట్టుబెట్టింది.

పాకిస్తాన్ వందలాది డ్రోన్లు, క్షిపణులతో ఎదురుదాడికి ప్రయత్నించినప్పటికీ, భారత క్షిపణి రక్షణ వ్యవస్థ వాటిని విజయవంతంగా అడ్డుకుంది. ఈ పోరులో పాక్ నాలుగు ఫైటర్ జెట్లను కోల్పోయిందని, వారి సైనిక మౌలిక సదుపాయాలు పూర్తిగా ధ్వంసమయ్యాయని భారత సైన్యం అధికారికంగా వెల్లడించింది. ఇదే సమయంలో భారత్ విమనాలను ముఖ్యంగా రాఫెల్ యుద్ధవిమానాన్ని కూల్చి వేశామని చేసిన పాక్ వాదనలను భారత సైన్యం కొట్టి పారేసింది.