25-10-2025 05:06:02 PM
నీళ్లు, నిధులు, నియామకాలు అనే మూడు అంశాలపై తెలంగాణ రాష్ట్రం సాధించుకున్నాము.
రాష్ట్రవ్యాప్తంగా నేటివరకు ప్రజా ప్రభుత్వం ఏర్పడిన నాటి నుండి ప్రభుత్వ రంగంలో 75 వేల ఉద్యోగాలు నియామకాలు..
తెలంగాణ రాష్ట్రంలో అతిపెద్ద మెగా జాబ్ మేళా..
రాష్ట్ర నీటిపారుదల, పౌరసరఫరాల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి..
హుజూర్ నగర్ (విజయక్రాంతి): నీళ్లు, నిధులు, నియామకాలు అనే మూడు అంశాలపై తెలంగాణ రాష్ట్రం వచ్చిందని మూడు అంశాలను దృష్టిలో ఉంచుకుని ప్రజా ప్రభుత్వం ఉద్యోగాల కల్పనకు అత్యంత ప్రాధాన్యత ఇచ్చిందని రాష్ట్ర నీటిపారుదల, పౌరసరఫరాల శాఖ మంత్రి నలమాద ఉత్తమ్ కుమార్ రెడ్డి(Minister Uttam Kumar Reddy) అన్నారు. శనివారం సూర్యాపేట జిల్లా హుజూర్ నగర్ పట్టణంలోని పెరల్ ఇన్ఫినిటీ ఇంటర్నేషనల్ స్కూల్ లో ఏర్పాటు చేసిన మెగా జాబ్ మేళాను ప్రారంభించి మాట్లాడారు. హుజూర్ నగర్ లో నిర్వహించిన మెగా జాబ్ మేళా ఇప్పటివరకు ఎక్కడ నిర్వహించలేదని తెలంగాణలోనే ఇది అతి పెద్ద జాబ్ మేళా అన్నారు. ఈ జాబ్ మేళా ద్వారా హుజూర్ నగర్, కోదాడ నియోజకవర్గాలతో పాటుగా ఉమ్మడి నల్గొండ జిల్లా నిరుద్యోగులకు ఎంతో మందికి ఉద్యోగ అవకాశాలు వచ్చాయన్నారు.
వివిధ కంపెనీలు అక్కడికక్కడే ఉద్యోగాలలో నియమిస్తూ ఆఫర్ లెటర్లు నిరుద్యోగ అభ్యర్థులకు మంత్రి ఉత్తమ్ అందజేశారు. ప్రజా ప్రభుత్వం ఏర్పడిన నాటినుండి రాష్ట్రవ్యాప్తంగా నేటివరకు ప్రభుత్వ రంగంలో 75 వేల ఉద్యోగాలు కల్పించామన్నారు. ప్రైవేట్ సెక్టార్ లో సైతం భారీ ఎత్తున ఉద్యోగాలు ఇచ్చేందుకు ఈ జాబ్ మేళాను నిర్వహించినట్లు తెలిపారు. అనంతరం జిల్లా కలెక్టర్ తేజస్ నంద్ లాల్ పవర్ మాట్లాడుతూ... రెండు రోజులపాటు నిర్వహించే మెగా జాబ్ మేళాలో సుమారు 275 కంపెనీలు పాల్గొని గ్రామీణ నిరుద్యోగ యువతకు ఉద్యోగ అవకాశాలు కల్పిస్తున్నాయన్నారు. డిజిటల్ ఎంప్లాయ్మెంట్ ఎక్స్చంజ్ ఆఫ్ తెలంగాణ, సింగరేణి కాలరీస్ సహకారంతో ఈ జాబ్ మేళా ఏర్పాటు చేశామని,ఐటి, సర్వీస్ సెక్టార్, మ్యానుఫ్యాక్చరింగ్, ఆటోమొబైల్, ఫార్మా, సిమెంట్ తదితర కంపెనీలన్నీ హుజూర్ నగర్ కు వచ్చి గ్రామీణ నిరుద్యోగ యువతకు ఉద్యోగ అవకాశాలు కల్పిస్తున్నాయని తెలిపారు.
శుక్రవారం నాటికి జాబ్ మేళాకు 40,000 మంది రిజిస్ట్రేషన్ చేసుకున్నారని వారిని దృష్టిలో ఉంచుకొని మంత్రి ఉత్తమ్ ఆదేశాల మేరకు రెండు రోజులపాటు జాబ్ మేళా నిర్వహించాలని నిర్ణయించడం జరిగిందన్నారు. మంత్రి ఉత్తమ్ ఆదేశాల మేరకు అభ్యర్థులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా పూర్తిస్థాయి ఏర్పాట్లు చేశామని, భోజన వసతి, సౌకర్యాలు కల్పించామన్నారు. అభ్యర్థులందరూ జాబ్ మేళాలో పాల్గొని ఉద్యోగాలు పొందాలని అన్నారు. సూర్యాపేట జిల్లా ఎస్పీ కొత్తపల్లి నరసింహ ఆధ్వర్యంలో జాబ్ మేళా ప్రాంగణంలో ఎలాంటి ఆవాంఛనీయ సంఘటనలు చోటు చేసుకోకుండా పోలీసులు పూర్తి బందోబస్తును నిర్వహించారు. ఈ కార్యక్రమంలో మిర్యాలగూడ ఎమ్మెల్యే బత్తుల లక్ష్మారెడ్డి, నకిరేకల్ ఎమ్మెల్యే వేముల వీరేశం, ఎమ్మెల్సీ శంకర్ నాయక్, డీఐజీ చౌహన్, ఖమ్మం పోలీస్ కమిషనర్ సునీల్ దత్, నల్లగొండ, సూర్యాపేట, ఎస్పీలు శరత్ చంద్ర పవర్, నరసింహ, అదనపు కలెక్టర్ సీతారామరావు, సీఐ చరమంద రాజు, సర్వోత్తమ్ రెడ్డి, కోతి సంపత్ రెడ్డి, ఈడ్పుగంటి సుబ్బారావు, తన్నీరు మల్లికార్జున్, వల్లపుదాసు కృష్ణ గౌడ్, షేక్ సైదా, అజిజ్ పాష, బొడ్డు గోవిందరావు, అనీఫ్, ముస్తఫా, కోడి ఉపేందర్, జక్కుల మల్లయ్య పాల్గొన్నారు.