calender_icon.png 22 September, 2025 | 2:14 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

మృత్యుంజయుడీ బాలుడు

22-09-2025 12:42:36 AM

-నెలలు నిండకముందే పుట్టిన కవలలు

-వారం రోజులకే ఓ బాలుడి మృతి

-మూడు నెలలు మృత్యువుతో రెండో బాలుడి పోరాటం

-తీవ్ర ఇన్ఫెక్షన్లు, హెమోగ్లోబిన్ తక్కువ, పలు సమస్యలు

-సమగ్ర చికిత్సతో ప్రాణాలు కాపాడిన కామినేని వైద్యులు

హైదరాబాద్, సెప్టెంబర్ 21 (విజయక్రాంతి): ఆ దంపతులకు పెళ్లయిన చాలాకా లం వరకు పిల్లలు పుట్టలేదు. చివరకు ఐవీఎఫ్‌తో ప్రయత్నించారు. కడుపులో కవలలు ఉన్నారని ఆనందించారు. కానీ, ఆరోనెలలోనే ఆమెకు నొప్పులు వచ్చి, ఉమ్మనీరు పోతోంది. జయశంకర్ భూపాలపల్లి జిల్లాకు చెందిన ఆ దంపతులు ఆందోళనతో హైదరాబాద్ వచ్చి ఇక్కడ ప్రసవం చేయించుకు న్నారు.

అప్పటికీ వైద్యులు వారం పాటు ఆమెకు ప్రసవం చేయకుండా ఆపి.. తర్వాత చేశారు. పిల్లలిద్దరికీ తీవ్రమైన ఇన్ఫెక్షన్ ఉండడంతో పుట్టిన రెండోరోజు కామినేని ఆస్పత్రికి తీసుకొచ్చారు. మొదటి వారానికే తీవ్రమైన ఫంగల్ ఇన్ఫెక్షన్, కిడ్నీ సమస్యలతో ఒక బాబు మరణించాడు. రెండోబా బుకు కూడా అనేక సమస్యలున్నాయి. ఇతడు మాత్రం వాటన్నింటితో పోరాడి, గెలిచి, చివరకు మృత్యుంజయుడిగా నిలిచాడు.

ఇందుకు సంబంధించిన వివరాలను కామినేని ఆస్పత్రికి చెందిన కన్సల్టెంట్ పీడియాట్రీషియన్, నియోనాటాలజిస్ట్ డాక్టర్ ఆర్ వీ సౌజన్య తెలిపారు. ‘ఐవీఎఫ్ చేయించుకున్నవారికి పూర్తిగా అంటే 38 నుంచి -40వారాల పాటు పిల్లలు కడుపులో ఉండటం కష్టమే. కానీ కనీసం ఏడునెలలు నిండితే, అంటే 28 వారాలు గడిస్తే మంచిది. కానీ, ఈ కేసులో మాత్రం 23-, 24 వారాలకే ఆమెకు నొప్పులు రావడం, నీరు పోవడం మొదలైంది.

26వ వారానికి కవలలు పుట్టారు. ఇద్దరు మగపిల్లల్లో ఒకరు తీవ్రమైన ఫంగల్ ఇన్ఫెక్షన్, కిడ్నీ సమస్యలు రావడంతో మొదటి వారానికే మరణించాడు. మరో బాబు పుట్టాక ఏడవలేదు. దాంతో అతడికి ఊపిరితిత్తుల సమస్య వచ్చి.. రెండు నెలల పాటు వెంటిలేటర్ పెట్టాల్సి వచ్చింది. రక్తంలో బాగా ఇన్ఫెక్షన్లు ఉండటం, దానికితోడు ఎన్‌ఈసీ అనే కండిషన్ కారణంగా తాగిన పాలను పేగులు అరిగించుకోలేక.. పొట్ట ఉబ్బడం, వాంతు లు, హార్ట్ రేట్, ఆక్సిజన్ లెవెల్స్ తగ్గడం లాంటి సమస్యలు వచ్చాయి. హెమోగ్లోబిన్ లేకపోవడంతో 3 నెలల వ్యవధిలో దాదాపు 12 యూనిట్ల రక్తం ఎక్కించాల్సి వచ్చింది’ అని పేర్కొన్నారు. ‘బాబుకు ముందుగా యాంటీబయాటిక్స్, యాంటీఫంగల్ మం దులతో చికిత్సలు చేశాం.

పాలు తీసుకోలేకపోవడంతో టోటల్ పేరెంటల్ న్యూట్రిషన్ (టీపీఎన్) ద్వారా పోషకాలు అందించాం. ఒకటిన్నర నెలలు ఇలా ఇచ్చాక అప్పుడు క్రమంగా 30 వారాల వయసుకు బాబు 1.05 కిలోల బరువుకు వచ్చాడు. క్రమంగా చికిత్సలకు స్పందించడంతో రెండు నెలల తర్వాత వెంటిలేటర్ తీసేసి ఆక్సిజన్ మాత్రం అందించాం. 

బాబుకు హెమోగ్లోబిన్ తక్కువగా ఉండడంతో పదేపదే రక్తపరీక్షలు కూడా చేయలేదు. 36 వారాల వయసుకు వచ్చేసరికి బాబు 1.5 కిలోలకు చేరుకున్నాడు. అప్పుడు ఆక్సిజన్ కూడా తీసేసి ఎన్‌ఐసీయూ నుంచి వార్డుకు తరలించాం. 38 వారాలకు 1.7 కిలోల బరువు రావడంతో బాబును డిశ్చార్జి చేశాం. ’ అని డాక్టర్ ఆర్‌వీ సౌజన్య వివరించారు.