07-11-2025 12:00:00 AM
-అక్రమాల నియంత్రణకు సర్కారు చర్యలు
-తప్పించుకునేందుకు క్రషర్ యాజమానుల ఎత్తుగడ
-ధరలు పెంచి జనంపై వేసే యోచన
మేడ్చల్, నవంబర్ 6(విజయ క్రాంతి): గనులలో జరుగుతున్న అక్రమాలను నియంత్రించడానికి ప్రభుత్వం చర్యలకు ఉపక్రమించగా, క్రషర్ యజమానులు కొత్త ఎత్తుగడలు వేశారు. అక్రమాలు నియంత్రిస్తే ప్రజలపైనే భారం పడుతుందని ప్రచారం చేయడమే గాక, ధరలు అమాంతం పెంచేశారు. అక్రమాలకు పాల్పడి ప్రజలకు తక్కువ ధరకు కంకర, రోబో సాండ్ సరఫరా చేసామని, ప్రభుత్వం విధించిన కొత్త నిబంధనల వల్ల ధరలు పెంచక తప్పదని వినియోగదారులతో అంటున్నారు.
ధరల పెరుగుదలకు ప్రభుత్వమే కారణమని దుష్ప్రచారం చేస్తున్నారు. మేడ్చల్ జిల్లాలో మొన్నటి వరకు రోబోసాండ్ టన్నుకు రూ.450 కి విక్రయించగా, ప్రస్తుతం రూ.580 కి పెంచారు. 20 ఎంఎం కంకర రూ.450 నుంచి రూ.600, 10 ఎంఎం కంకర రూ.400 నుంచి రూ.580,40 ఎంఎం కంకర రూ.580 కి పెంచారు. టన్నుకు రూ.130 నుంచి రూ.150 వరకు పెంచడంతో వినియోగదారులపై తీవ్రంగా భారం పడుతోంది. గతంలో క్వారీల నుంచి తరలించే కంకరకు టన్ను చొప్పున రాయల్టీ చెల్లించేవారు. ప్రభుత్వం ఈ విధానాన్ని మార్పు చేసింది. కొత్త నిబంధనలతో ఇటీవల జీవో జారీ చేసింది.
ఇకనుంచి క్రషర్ల వాడిన విద్యుత్ యూనిట్ల ఆధారంగా రాయల్టీ వసూలు చేస్తారు. ఒక క్రషర్ కు ఒక నెలలో లక్ష రూపాయల కరెంటు బిల్లు వస్తే 25% అంటే రూ. 25 వేల వరకు రాయల్టీ చెల్లించాలి. ఈ నిబంధన ఉల్లంఘిస్తే రెట్టింపు జరిమానా విధిస్తారు. ఇంతకుముందు టన్ను కంకరకు రూ.150, ఇసుకకు రూ.40 వసూలు చేసేవారు. ఇష్టానుసారంగా తవ్వకాలు జరిపి పెద్ద మొత్తంలో కంకర తరలిస్తూ నామమాత్రంగా రాయల్టీ చెల్లించేవారు. అధికారుల సైతం లోపాయికారి ఒప్పందంతో అక్రమాలను నియంత్రించలేదు.
వే బ్రిడ్జి తప్పనిసరి...
జిల్లాలో 16 క్రషర్లు పనిచేస్తున్నాయి. ఇందులో కొన్నింటికే వే బ్రిడ్జిలు ఉన్నాయి. నిబంధనల ప్రకారం కాంటా తప్పనిసరి ఉండాలి. కంకర తీసుకెళ్లే సమయంలో తూకం వేసి అందుకు అనుగుణంగా రాయల్టీ చెల్లించాలి. వినియోగదారులకు టన్నుల చొప్పున విక్రయిస్తారు. అయితే తూకం బయట వేస్తున్నారు. కొత్త నిబంధనల ప్రకారం క్రషర్ వద్ద తప్పనిసరిగా వే బ్రిడ్జ్ ఉండాలి. ఇది జిల్లా గనుల శాఖకు అనుసంధానమై ఉంటుంది. కంకర ఎంత కాంటావేశారు? ఎంత తరలిస్తున్నారు? అదనంగా ఏమైనా దాటిస్తున్నారా? అనేది అధికారులు నిరంతరం పరిశీలిస్తారు. అంతేగాక తప్పనిసరిగా సీసీ కెమెరాలు ఏర్పాటు చేయాలి. సీసీ కెమెరాలలో నిరంతరం పరిశీలిస్తారు. సీసీ కెమెరా, వే బ్రిడ్జిలు నెల రోజుల్లో ఏర్పాటు చేయాలని ప్రభుత్వం స్పష్టమైన ఆదేశాలు జారీ చేసింది.
క్రషర్ యజమానులకు మింగుడు పడని నిబంధనలు
అక్రమాలతో ధనార్జనకు అలవాటుపడిన క్రషర్ యజమానులకు ప్రభుత్వం జారీ చేసిన కొత్త నిబంధనలు మింగుడు పడడం లేదు. ఇప్పటివరకు క్రషర్ యజమానులు అనేక అక్రమాలకు పాల్పడ్డారు. కేటాయించిన విస్తీర్ణంలో కాకుండా చుట్టుపక్కల కూడా పెద్ద ఎత్తున తవ్వకాలు చేపట్టారు. కొన్నిచోట్ల చాలా లోతుగా ఇష్టానుసారంగా తవ్వకాలు చేశారు. అంతేగాక అక్రమ పేలుళ్లు కూడా జరిపారు. వెలికి తీసిన కంకర కు లెక్క పత్రం ఏమీ లేదు. పరిమితికి మించి టిప్పర్లలో రవాణా చేశారు.
రవాణా సమయంలో నిబంధనలు ఉల్లంఘించారు. ఓవర్ లోడ్ వల్ల రోడ్లు ద్వంశమయ్యాయి. రోడ్లమీద కంకర పడడం వల్ల వాహనదారులు ఇబ్బందులు ఎదుర్కొన్నారు. క్రషర్ యజమానులు కేవలం ధనార్జన పైనే దృష్టి పెట్టారు. కొన్నిచోట్ల దౌర్జన్యాలకు పాల్పడ్డారు. క్రషర్ వద్దకు ఎవరిని రానీయకుండా సెక్యూరిటీ ఏర్పాటు చేసుకున్నారు. మేడ్చల్ జిల్లాలో రాజకీయ నాయకులకు, వారి బంధువులకు క్రషర్లు ఉన్నాయి. వీరు ఎవరు కూడా నిబంధనలు పాటించలేదు. ఇకనైనా క్రషర్ యజమానులు కొత్త నిబంధనలు పాటించేలా అధికారులు చర్యలు తీసుకోవాలని ప్రజలు కోరుతున్నారు.