calender_icon.png 7 November, 2025 | 1:41 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

మత్తు వదలరా?

07-11-2025 12:00:00 AM

  1. అక్రమ కల్లు దందాలో అధికారులకు వాటాలు? 

చందాలతో అక్రమ భవన నిర్మాణం 

నెలవారీ మామూళ్లు మస్తుగానే మూడవ కల్లు డిపో లీలలెన్నో..? 

ఉచ్చు బిగిస్తున్న ఏసీబీ కలెక్టర్ సీరియస్

అక్రమార్కుల జాబితా సిద్ధం ఇక వేటే తరువాయి..

నిజామాబాద్, నవంబర్ 6 (విజయ క్రాంతి): నిజామాబాద్ జిల్లా ఎక్సైజ్ శాఖ అవినీతికి కేరాఫ్ అడ్రస్గా మారుతోంది. గతంలో ఏసీబీ దాడులు జరిగినా తీరు మారడం లేదు. అవినీతి అడ్డగోలుగా పెరిగిపోతోంది.  కొందరు అధికారుల అక్రమ వసూళ్లు, మామూళ్ల దందాపై అవినీతి నిరోధక శాఖ (ఏసీబీ) పూర్తిస్థాయిలో దృష్టి సారించింది. ఈ శాఖలో జరుగుతున్న అక్రమాలపై పక్కా ఆధారాలు సేకరించిన ఏసీబీ, అవినీతి అధికారుల జాబితాను సైతం సిద్ధం చేసినట్లు విశ్వసనీయ సమాచారం. అక్రమ భవన నిర్మాణం నుంచి, లైసెన్సులు లేని డిపోల వరకు ప్రతి అక్రమ వ్యవహారంపైనా ఏసీబీ ఆరా తీస్తుండటంతో ఎక్సైజ్ శాఖలో కలకలం రేగుతోంది.

‘చందాల‘ భవనం... నిధుల గోల్ మాల్? 

ఎక్సైజ్ శాఖలో అవినీతి ఏ స్థాయిలో  పాతుకుపోయిందనడానికి తాజాగా వెలుగు చూసిన ‘అక్రమ భవన నిర్మాణ‘ వ్యవహారమే పెద్ద ఉదాహరణ. ప్రభుత్వ నిధుల మంజూరు లేకుండా, ఉన్నతాధికారుల నుంచి ఎలాంటి అధికారిక అనుమతులు పొందకుండా ఎక్సైజ్ శాఖ భవనాన్ని ఎలా నిర్మించారన్న దానిపై ఏసీబీ ఆరా తీస్తోంది. ఈ భవన నిర్మాణం కోసం కల్లు బట్టీల నిర్వాహకులు, వైన్స్ దుకాణదారుల నుంచి బలవంతంగా ‘చందాల‘ రూపంలో పెద్ద మొత్తంలో నిధులు సేకరించారని ఏసీబీ రూడీ చేసుకుంది. అయితే, ఈ వసూళ్ల వెనుక పెద్ద స్కామ్ జరిగిందని అధికారులు అనుమానిస్తున్నారు.

కీలక ప్రశ్నల జాబితా సిద్ధం చేసుకున్నారని వినికిడి. అవేంటంటే..

భవన నిర్మాణం పేరుతో అసలు ఎంత సొమ్ము వసూలు చేశారు? 

నిర్మాణానికి వాస్తవంగా ఖర్చు పెట్టింది ఎంత? 

వసూలు చేసిన డబ్బులకు, ఖర్చుకు మధ్య ఉన్న వ్యత్యాసం ఎంత? 

మిగిలిన సొమ్ము ఎంత? ఆ సొమ్ము ఎవరీజేబుల్లోకి వెళ్లింది? 

ప్రశ్నల చుట్టూ ఏసీబీ దర్యాప్తు సాగుతోంది. భవన నిర్మాణం పేరుతో అధికారులు పెద్ద మొత్తంలో సొమ్ము కొట్టేశారనే ఆరోపణలపై లోతుగా విచారణ జరుపుతున్నారు.

నెల నెలా మామూళ్లు... అక్రమ వసూళ్ల పర్వం..

భవన నిర్మాణమే కాదు, ఎక్సైజ్ శాఖలో నెల నెలా మామూళ్ల దందా యథేచ్ఛగా సాగుతున్నట్టు ఏసీబీ నిర్ధారణకు వచ్చింది. ఎక్సైజ్ కాంట్రాక్టర్ల నుంచి అక్రమంగా డబ్బులు వసూలు చేస్తున్నారని సమాచారం అందుకున్న ఏసీబీ, దీనిపై పూర్తి వివరాలు సేకరించింది. కల్లు దుకాణాలు, ఎక్సైజ్ షాపులపై దాడులు చేయడం, అక్కడ అక్రమాలు బయటపడినా కేసులు నమోదు చేయకుండా ఉం డేందుకు భారీగా డబ్బులు వసూలు చేస్తున్నారని తేలింది. ఈ అక్రమ వసూళ్ల పర్వం నెల నెలా సాగుతోందని, కొందరు అధికారులు అవినీతిలో కూరుకుపోయారని ఏసీబీ గుర్తించింది.

మూడవ కల్లు డిపో... అక్రమాలకు అడ్డా.. 

తాజాగా నిజామాబాద్ నగరంలోని మూడవ కల్లు డిపో వ్యవహారం ఎక్సైజ్ అధికారుల అక్రమాలకు అద్దం పడుతోంది. ఈ డిపోపై ఏసీబీ ప్రత్యేకంగా కొన్ని విషయాలపై దృష్టి సారించినట్టు తెలిసింది. విజయక్రాంతికి అందిన సమాచారం ప్రకారం అవేంటంటే..

లైసెన్స్ లేకున్నా.. నవంబర్ 21న ఈ డిపోపై దాడి చేసినా, అసలు లైసెన్సే లేని ఆ డిపోపై అధికారులు ఎందుకు కేసు నమోదు చేయలేదని ఏసీబీ ఆరా తీస్తోంది.

గొడవ తర్వాతే కేసు.. 

డిపో డైరెక్టర్ల మధ్య గొడవ జరిగి, వారు కొట్టుకున్న తర్వాత గానీ కేసు నమోదు చేయకపోవడం వెనుక ఉన్న ఆంతర్యమేమిటని ఏసీబీ ప్రశ్నిస్తోంది.

పదేళ్ల అక్రమాలు.. ఈ డిపోలో పరిమితికి మించి, అనుమతులు లేకుండా పదేళ్లపాటు కల్లు బట్టీలు ఎలా నడిపారని అధికారులు విస్మయం వ్యక్తం చేస్తున్నారు. సభ్యత్వంలో గోల్ మాల్....ఈ డిపో సొసైటీలో గల్ఫ్ దేశాల్లో ఉండే వారికి, స్థానికేతరులకు (నాన్ లోకల్) సభ్యత్వం, లైసెన్సులు ఇచ్చారని ఏసీబీ నిర్ధారించుకుంది.

ఆడిట్ అనుమానాలు.. డిపో ఆడిట్ లెక్కల్లోనూ భారీగా అవినీతి జరిగినట్లు ఏసీబీ అనుమానిస్తోంది. అధికారుల అండ...పదేళ్లపాటు ఈ డిపో అక్రమంగా నడవడానికి కొందరు ఎక్సైజ్ అధికారుల పూర్తి మద్దతు ఉందని, వారికి నెల నెలా అక్రమంగా డబ్బు పంపకాలు జరిగాయని ఏసీబీ దర్యాప్తులో తేలినట్లు సమాచారం.

కలెక్టర్ సీరియస్.. అధికారులకు క్లాస్..

మూడవ కల్లు డిపోలో జరుగుతున్న అక్రమాలపై జిల్లా కలెక్టర్ వినయ్ కృష్ణారెడ్డి సైతం సీరియస్గా ఉన్నట్టు తెలుస్తోంది. ఈ డిపోకు ఈత చెట్లు ఎక్కడ ఉన్నాయి, రోజూ ఎంత కల్లు వస్తుంది అనే ప్రాథమిక విషయాలపై కూడా అధికారుల వద్ద సమా ధానం లేకపోవడంతో కలెక్టర్ ఆగ్రహం వ్యక్తం చేసినట్లు సమాచారం. ఈ వ్యవహారంపై ఆయన ఇప్పటికే ఎక్సైజ్ అధికారులకు తీవ్రంగా క్లాస్ తీసుకున్నారని, శాఖాపరమైన చర్యలకు సిద్ధమవుతున్నారని తెలుస్తోంది.

బిగుస్తున్న ఉచ్చు..

ఒకవైపు అక్రమ భవన నిర్మాణం, మరోవైపు నెలవారీ మామూళ్లు, ఇంకోవైపు మూడవ కల్లు డిపో వంటి అక్రమాలకు అండగా నిలవడం... ఇలా ఎక్సైజ్ శాఖ పూర్తిగా అవినీతిమయమైందన్న ఆరోపణలు బలంగా వినిపిస్తున్నాయి. ఏసీబీ ఇప్పటికే పక్కా ఆధారాలతో అవినీతి అధికారుల జాబితాను సిద్ధం చేయడంతో, త్వరలోనే చర్యలు తప్పవని స్పష్టమవుతోంది. కలెక్టర్ కూడా ఈ అక్రమాలపై ఆగ్రహంగా ఉండటంతో, ఎక్సైజ్ శాఖ ప్రక్షాళన దిశగా అడుగులు పడే అవకాశం కనిపిస్తోంది. ఈ అవినీతి కుంభకోణంలో ఎవరెవరు బయటకు వస్తారో, ఎలాంటి చర్యలు తీసుకుంటారో వేచి చూడాలి.