12-12-2025 01:24:14 AM
తొలి టీ20 గెలిచి జోష్ మీదున్న భారత్‌కు ముల్లాన్‌పూర్‌లో షాక్...సిరీస్‌లో బౌన్స్‌బ్యాక్ అవుతూ సౌతాఫ్రికా రెండో టీ20 గెలిచి లెక్క సరిచేసింది. బ్యాటింగ్‌లో క్వింటన్ డికాక్ సూపర్ షోతో భారీస్కోరు చేసిన సఫారీలు తర్వాత బౌలర్ల సమిష్టి ప్రదర్శనతో టీమిండియాను కట్టడి చేశారు. భారత కీలక బ్యాటర్లందరూ ఫ్లాప్ అయ్యారు. ఫలితంగా తొలి మ్యాచ్ ఓటమికి రివేంజ్ తీర్చుకుంటూ సౌతాఫ్రికా సిరీస్‌ను సమం చేసింది.
ముల్లాన్‌పూర్, డిసెంబర్ 11: పిచ్ పరిస్థితి, మంచు ప్రభావాన్ని దృష్టిలో ఉంచుకున్న భారత్ టాస్ గెలవగానే ఫీల్డింగ్ ఎంచుకున్నాడు. ఊహించినట్టుగానే తుది జట్టులో ఎలాంటి మార్పులు చేయలేదు. దీంతో సంజూ శాంసన్‌కు మరోసారి నిరాశే మిగిలింది. గత మ్యాచ్ ప్రదర్శనతో సౌతాఫ్రికా ఎంత వరకూ పోటీనిస్తుందో అనుకుంటుండగా ఓపెనర్ క్వింటన్ డికాక్, మరో ఓపెనర్ హెండ్రిక్స్ కాన్ఫిడెంట్‌గానే ఇన్నింగ్స్ ప్రారంభించారు. తొలి వికెట్‌కు 38 పరుగులు జోడించారు. తర్వాత క్రీజులోకి వచ్చిన కెప్టెన్ మార్క్‌క్రమ్‌తో కలిసి డికాక్ తన సూపర్ బ్యాటింగ్‌తో రెచ్చిపోయాడు.
భారీ సిక్సర్లతో భారత బౌలర్లకు చుక్కలు చూపించాడు. హోంగ్రౌండ్‌లో అర్షదీప్ సింగ్ అట్టర్ ఫ్లాప్ అయ్యాడు. తనపై ఉన్న అంచనాలకు భిన్నంగా భారీగా పరుగులిచ్చేశాడు. ఒక ఓవర్లో అయితే ఏకంగా 7 వైడ్లు వేశాడు. అటు మరో పేసర్ బూమ్రా సైతం భారీగా పరుగులు ఇచ్చాడు. డికాక్, మార్క్‌క్రమ్ రెండో వికెట్‌కు 83 పరుగులు జోడించారు. మార్క్‌క్రమ్(29), బ్రెవిస్(14) త్వరగానే ఔటైనా డికాక్ జోరు కొనసాగించాడు.
కేవలం 46 బంతుల్లోనే 90 (5 ఫోర్లు, 7 సిక్సర్లు) పరుగులతో అదరగొట్టాడు. డికాక్ ఔటైన తర్వాత ఫెరీరా(16 బంతుల్లో 30), డేవిడ్ మిల్లర్(12 బంతుల్లో 20) మెరుపులు మెరిపించారు. దీంతో సౌతాఫ్రికా 20 ఓవర్లలో 213 పరుగులు చేసింది. భారత బౌలర్లలో అర్షీదీప్ , బూమ్రా ఫెయిలవగా.. వరుణ్ చక్రవర్తి 2 వికెట్లు తీశాడు.
214 పరుగుల భారీ లక్ష్యఛేదనలో భారత్‌కు తొలి ఓవర్లోనే షాక్ తగిలింది. పేలవ ఫామ్‌తో సతమతమవుతున్న గిల్ డకౌటయ్యాడు. అటు అభిషేక్ శర్మ(17) 2 సిక్సర్లతో దూకుడు కనబరిచినా ఎక్కువ సేపు క్రీజులో నిలవలేకపోయాడు.సూర్యకుమార్ యాదవ్(5) కూడా మరోసారి ఫ్లాప్ అయ్యాడు. పవర్ ప్లేలోనే భారత్ 3 కీలక వికెట్లు కోల్పోయింది. వన్‌డౌన్‌లో అక్షర్ పటేల్‌ను దింపగా అనుకున్నంత వేగంగా ఆడలేకపోయాడు.
21 పరుగులు చేసి ఔటయ్యాడు. ఒకవైపు వికెట్లు పడుతున్న హైదరాబాదీ క్రికెటర్ తిలక్‌వర్మ ధాటిగా ఆడాడు. సఫారీ బౌలర్లకు చుక్కలు చూపిస్తూ భారీ సిక్సర్లు బాదాడు. ఈ క్రమంలో హాఫ్ సెంచరీ పూర్తి చేసుకున్నాడు. హార్థిక్ పాండ్యా తన మ్యాజిక్ చూపించేలా కనిపించినా కీలక సమయంలో ఔటవడం కొంపముంచింది. పాండ్యా 20(23 బంతుల్లో) పరుగులకు వెనుదిరిగాడు.
ఫినిషర్‌గా అంచనాలు పెట్టుకున్న జితేశ్ శర్మ భారీ షాట్లతో అలరించినా అప్పటికే సాధించాల్సిన రన్‌రేట్ పెరిగిపోయింది. జితేశ్ శర్మ 27(17 బంతుల్లో 2 ఫోర్లు, 2 సిక్సర్లు) ఔటవగా.. శివమ్ దూబే(1) నిరాశపరిచాడు. మరొక ఎండ్ నుంచి సపోర్ట్ లేకపోవడంతో తిలక్ వర్మ హాఫ్ సెంచరీ వృథా అయింది. అతనికి మరొకరు సపోర్ట్ చేసి ఉంటే ఫలితం వేరేలా ఉండేది.
తిలక్ వర్మ 62(34 బంతుల్లో 2 ఫోర్లు, 5 సిక్సర్లు) ఆఖరి వికెట్‌గా ఔటయ్యాడు. దీంతో భారత్ ఇన్నింగ్స్‌కు 162 పరుగుల దగ్గర తెరపడింది. సఫారీ బౌలర్లలో బార్ట్‌మన్ 4 వికెట్లు తీయగా.. ఎంగిడి, యెన్సన్,సిమప్లా రెండేసి వికెట్లు పడగొట్టారు. ఈ విజయంతో ఐదు వన్డేల సిరీస్ ప్రస్తుతం 1 సమంగా ఉంది. సిరీస్‌లో మూడో మ్యాచ్ ఆదివారం ధర్మశాలలో జరుగుతుంది.
స్కోరుబోర్డు:
సౌతాఫ్రికా ఇన్నింగ్స్: 213/4 ( డికాక్ 90, ఫెరీరా 30, మిల్లర్ 29 నాటౌట్; వరుణ్ చక్రవర్తి 2/29 )
భారత్ ఇన్నింగ్స్ : 162 ఆలౌట్ ( తిలక్‌వర్మ 62, జితేశ్ శర్మ 27, అక్షర్ పటేల్ 21; బార్ట్‌మన్ 4/24, ఎంగిడి 2/26, యెన్సన్ 2/25)