calender_icon.png 5 November, 2025 | 4:16 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

కారు ఢిల్లీకి చేరగానే కమలంగా మార్పు

05-11-2025 01:31:59 AM

-బీజేపీలో బీఆర్‌ఎస్ విలీనం కావడం ఖాయం

-ఈ మాట వాళ్ల ఆడబిడ్డ కవిత చెపుతున్నదే..

-రెండు పార్టీలు ఒక్కటి కాకపోతే కాళేశ్వరం కేసులో కేసీఆర్, కేటీఆర్, హరీశ్‌రావులను ఈ నెల 11 లోగా అరెస్ట్ చేయించాలి

-కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డికి సీఎం రేవంత్‌రెడ్డి సవాల్

-రహమత్ నగర్‌లో కార్నర్ మీటింగ్

హైదరాబాద్ సిటీ బ్యూరో, నవంబర్ 4 (విజయక్రాంతి): కారు ఢిల్లీకి చేరగానే కమలంగా మారుతోందని, బీజేపీలో బీఆర్‌ఎస్ విలీనం కావడం ఖాయమని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి అన్నారు. ఈ విషయం బీఆర్‌ఎస్ ఇంటి బిడ్డ కల్వకుంట్ల కవిత చెపుతున్నదే అని చెప్పారు. జూబ్లీహిల్స్ ఎన్నికలో భాగంగా మంగళవారం రహమత్ నగర్ డివిజన్‌లో కాంగ్రెస్ అభ్యర్థి నవీన్‌యాదవ్‌కు మద్దతుగా నిర్వహించిన కార్నర్ మీటింగ్‌లో సీఎం రేవంత్‌రెడ్డి మాట్లాడారు. “బీఆర్‌ఎస్, బీజేపీలది ఫెవికాల్ బంధం.

ఆ రెండు పార్టీలు ఒక్కటి కాకపోతే, వాటి మధ్య చీకటి ఒప్పందం లేకపోతే.. ఈ నెల 11 లోగా కాళేశ్వరం కేసులో సీబీఐతో ఎఫ్‌ఐఆర్ నమో దు చేయించి కేసీఆర్, కేటీఆర్, హరీశ్‌రావులను అరెస్ట్ చేయించాలి” అని కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డికి సవాల్ విసిరారు. పదేళ్లుగా బీఆర్‌ఎస్ అధికారంలో ఉన్నా జూబ్లీహిల్స్‌లో కనిపించని సమస్యలు ఇప్పుడు కనిపిస్తున్నాయా, పదేళ్లు మున్సిపల్ మంత్రిగా ఉండి కేటీఆర్ గాడిద పళ్లు తోమారా అని ఎద్దేవా చేశారు. పదేళ్లు బెంజ్ కారులో తిరిగిన వా ళ్లు, ఇప్పుడు ఆటోలో తిరుగుతూ నాటకాలు ఆడుతున్నారని విమర్శించారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఈ నియోజకవర్గంలో 14,197 కొత్త రేషన్ కార్డులు, 25,925 కుటుంబాలకు ఉచిత విద్యుత్ ఇచ్చిందని చెప్పారు. ఉప ఎన్నిక తర్వాత నియోజకవర్గంలో పేదలకు 4 వేల ఇండ్లు ఇప్పించే బాధ్యత తనదని హామీ ఇచ్చారు.

పేదల దేవుడు పీజేఆర్ ఆకస్మికంగా మరణిస్తే, ఆయన కుటుంబాన్ని ఏకగ్రీవంగా గెలిపించాలని టీడీపీ, బీజేపీ సైతం అభ్యర్థులను నిలబెట్టలేదు. కానీ కేసీఆర్ అభ్యర్థిని నిలబెట్టి మంచి సంప్రదా యాన్ని తుంగలో తొక్కారని మండిపడ్డారు. పీజేఆర్ సతీమణి కలిసేందుకు వెళ్తే మూడు గంటలు బయట నిలబెట్టిన దుర్మార్గుడు కేసీఆర్ అని విమర్శించారు. నాడు పీజేఆర్ కుటుంబాన్ని రోడ్డున పడేసినందుకు కేటీఆర్ ఇక్కడి రహమత్ నగర్ చౌరస్తాలో ముక్కు నేలకు రాసి క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. సొంత చెల్లికి ఆస్తిలో వాటా ఇవ్వాల్సి వస్తుందని ఇంటి నుంచి కేటీఆర్ పంపించాడని ఆరోపించారు. మహిళలకు మంత్రి పదవి ఇవ్వని బీఆర్‌ఎస్ నేతలు మహిళ గురించి మాట్లాడటం సిగ్గుచేటన్నారు. మహిళలకు, మైనారిటీలకు సము చిత స్థానం కల్పించిన ఏకైక పార్టీ కాంగ్రెస్ అని స్పష్టం చేశారు. 

మూడు నెలలైనా ఎందుకు కేసు పెట్టలేదు?

కాళేశ్వరం కేసీఆర్ కుటుంబానికి ఏటీఎంగా మారిందని బీజేపీ నేతలే చెప్పారని, సీబీఐకి అప్పగిస్తే 48 గంటల్లో తండ్రీకొడుకులను జైలుకు పంపుతామన్నారని, మూడు నెలలైనా ఎందుకు కేసు పెట్టలేదని సీఎం రేవంత్‌రెడ్డి ప్రశ్నించారు. ఫార్ములా ఈ రేస్ కేసులో కేటీఆర్‌ను అరెస్ట్ చేయడానికి గవర్నర్ ఎందుకు అనుమతి ఇవ్వడం లేదని, కారు ఢిల్లీకి చేరగానే కమలంగా మారుతోందని విమర్శించారు. ఈ చీకటి ఒప్పం దంతోనే జూబ్లీహిల్స్‌లో బీజేపీ, బీఆర్‌ఎస్‌కు పరోక్షంగా మద్దతిస్తోందని ఆరోపించారు. రాబోయే రోజుల్లో బీఆర్‌ఎస్ బీజేపీలో విలీనం కావడం ఖాయమని జోస్యం చెప్పా రు. ఈ మాట వాళ్ల ఆడబిడ్డ కవిత చెపుతున్నదే అని రేవంత్‌రెడ్డి అన్నారు.