26-12-2025 02:13:07 AM
హైదరాబాద్, డిసెంబర్ 25 (విజయక్రాంతి) : సీఎం అంటే రాష్ట్రానికి ఆదర్శంగా ఉండాలని, కానీ రేవంత్ రెడ్డి మాట్లాడిన భాష మాత్రం అసహ్యంగా ఉందని మాజీ మంత్రి వీ.శ్రీనివాస్‌గౌడ్ అన్నారు. సర్పంచుల సన్మాన సభలో రేవంత్ రెడ్డి మాట్లాడే భాష ఇదేనా, వారికి సీఎం ఏం సందేశం ఇచ్చారని ప్రశ్నించారు. గురువారం తెలంగాణ భవన్‌లో నిర్వహించిన మీడియా స మావేశంలో ఆయన మాట్లాడారు. కేసీఆర్ తెలంగాణ తీసుకురాకుండా ఉంటే రేవంత్ రెడ్డి సీఎం అయ్యేవారా అని ప్రశ్నించారు. జైపాల్ రెడ్డి ఇంగ్లిషులో మాట్లాడితే పదాలకు అర్థం డిక్షినరీలో వెతుక్కునే వారని, రేవంత్ రెడ్డి మాట్లాడే బూతులు ఏ డిక్షనరీలో చూడాలని ఎద్దేవా చేశారు.
మేడిగడ్డ బ్యారేజీ పిల్లర్లను రిపేర్ ఎందుకు చేయలేదని, పాత కాంట్రాక్టు సంస్థకు ఎందుకు రిపేర్ పనులు ఇవ్వలేదని నిలదీశారు. గాంధీ కుటుంబంలో వారసులు రాజకీయాల్లోకి రాలేదా అని ప్రశ్నించారు. రెండు ఎంపీల స్థాయి నుంచి బీజేపీ దేశంలో అధికారంలో వచ్చిందని, నాలుగు వేల గ్రామాల్లో సర్పంచులున్న బీఆర్‌ఎస్ ఎట్లా ఖతమైద్దని ప్రశ్నించారు. కేసీఆర్ ఆంధ్రా, తెలంగాణ అనే తేడా లేకుండా పాలన చేశారని తెలిపారు. భూమి ఉన్నంత వరకు బీఆర్‌ఎస్ ఉంటుందని, కేసీఆర్ మూడవ సారి సీఎం అవుతారని ధీమా వ్యక్తం చేశారు. కాంగ్రెస్, బీజేపీ కలిసి పాలమూరు, రంగారెడ్డికి జాతీయ హోదా తీసు కురావాలని డిమాండ్ చేశారు.
సీఎం రేవంత్‌రెడ్డికి తొండల సోకు పట్టుకుంది : మాజీ ఎమ్మెల్యే మర్రి జనార్దన్ రెడ్డి
సీఎం రేవంత్ రెడ్డి ఆవేదన, ఆక్రోశం, బయటపడిందని, తలుపు పెట్టుకుని ఏడ్చి రేవంత్ రెడ్డి మీటింగ్‌కు వచ్చినట్లున్నారని మాజీ ఎమ్మెల్యే మర్రి జనార్ధన్‌రెడ్డి ఎద్దేవా చేశారు. రేవంత్ రెడ్డికి తొండల సోకు, లాగు ల సోకు పట్టుకుందన్నారు. పాలమూరు అంశాన్ని రేవంత్ రెడ్డి డైవర్ట్ చేసి బూతులు మాట్లాడారని తెలిపారు. కేసీఆర్‌ను తిట్టడానికి రేవంత్ రెడ్డికి ప్రజలు ఓట్లు వేశారా, ఇందిరమ్మ రాజ్యం అంటే ఇదేనా అని ప్రశ్నించారు. రేవంత్‌రెడ్డిని సీఎం పదవి నుంచి దింపిన తర్వాతనే పులిలా కేసీఆర్ అసెంబ్లీకి వస్తారని స్పష్టం చేశారు. తెలంగాణ ప్రజలకు సీఎం, మంత్రులు క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు.
ఒళ్లు దగ్గర పెట్టుకుని పనిచేయాలి : మాజీ ఎమ్మెల్యే పట్నం నరేందర్‌రెడ్డి
పాలమూరు ప్రాజెక్టును పూర్తి చేయలేక కేసీఆర్‌పై సీఎం రేవంత్‌రెడ్డి బూతులు మాట్లాడుతున్నారని మాజీ ఎమ్మెల్యే పట్నం నరేందర్‌రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. రేవంత్‌రెడ్డి ఒళ్లు దగ్గర పెట్టుకుని పనిచేయాలని హితవు పలికారు. కేసీఆర్ తిట్టి కాలం గడపాలని రేవంత్ రెడ్డి చూస్తున్నారని, రేవంత్ రెడ్డిని చూసి కొడంగల్ ప్రజలు సిగ్గుపడుతున్నారని తెలిపారు. కేసీఆర్ గురించి మాట్లాడితే తీవ్ర పరిణామాలు ఉంటాయని హెచ్చరించారు. కేసీఆర్ హయాంలో అభివృద్ధిలో పోటీ పడ్డామని, రేవంత్ రెడ్డి, మంత్రులు, ఎమ్మెల్యేలు భూ దందాల్లో, కమీషన్లలో పోటీ పడుతున్నారని ఆరోపించారు.