09-05-2025 03:23:21 AM
హైదరాబాద్, మే 8 (విజయక్రాంతి): ఇన్నాళ్లు జాతీయస్థాయిలో కులగణనపై అంటీముట్టనట్టుగా వ్యవహరిస్తూ వచ్చిన బీజేపీ..ఎట్టకేలకు జనగణనతో పాటు కులగణన కూడా చేస్తామని ప్రకటించడం దేశవ్యాప్తంగా ఉన్న బీసీల్లో హర్షం వ్యక్తమైంది. ముఖ్యంగా తెలంగాణ బీజేపీకి ఇది ఊహించని వరంగా మారింది. రాష్ర్టంలో కులసర్వే నిర్వహించిన కాంగ్రెస్ పార్టీ..బీసీలకు 42శాతం రిజర్వేషన్ ఇవ్వడం తమ ఘనతగా చెప్పుకుంటూ వచ్చింది. అయితే బీసీ రిజర్వేషన్లలో ముస్లింలను చేర్చి అసలైన బీసీలకు తీవ్ర అన్యాయం చేశారని ఆరోపిస్తూ వచ్చిన బీజేపీ..
తాము నిర్వహించ బోయే కులగణనలో ముస్లింలను బీసీల్లో చేర్చబోమని స్పష్టం చేసింది. ఫలితంగా బీసీలకు బీజేపీ మరింత చేరువయ్యే అవకాశం ఏర్పడింది. బీసీవర్గాల్లో లోలోపల రాష్ర్టంలోని కాంగ్రెస్ పార్టీ తమకు తీరని అన్యా యం చేస్తున్నదనే భావన నెలకొన్న నేపథ్యంలోనే కేంద్రంలోని బీజేపీ సర్కారు తీసుకున్న కులగణన నిర్ణయం రాష్ర్టంలో ఆపార్టీకి సానుకూల అంశం కానుంది. ఇది కాంగ్రెస్ ప్రభుత్వానికి కాస్త ఇరకాటంగా మారనుందని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.
బీసీ ఓటు బ్యాంకు కోసం..
రాష్ర్టంలో బీసీ రిజర్వేషన్లను సాధించడం ద్వారా బీసీ ఓట్లకు తామే హక్కుదారులమని కాంగ్రెస్ భావిస్తూ వచ్చింది. అయితే ముస్లింలను బీసీల్లో చేరుస్తూ కాంగ్రెస్ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని దెబ్బకొట్టేలా కేంద్రం చేయబోతున్న కులగణన ఉండబోతోంది. ఈ కులగణన అంశాన్ని సానుకూలంగా మార్చుకునేందుకు రాష్ర్టంలోని బీజేపీ వర్గాలు ప్రయత్నిస్తున్నాయి. ఇకపై బీసీలకు మరింత చేరువై వారి ఓటు బ్యాంకును స్వాధీనం చేసుకోవాలని బీజేపీ నాయకులు ప్రయత్నిస్తున్నారు.
రాబోయే స్థానిక సంస్థల ఎన్నికలనే ఇందుకు వేదిక చేసుకోవాలని వారు ప్లాన్ చేస్తున్నారు. అందులో భాగంగా ఆదివారం బీజేపీ రాష్ర్ట కార్యాలయంలో పార్టీ రాష్ర్ట అధ్యక్షుడు కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి ఆధ్వర్యంలో బీజేపీ ముఖ్యనేతల సమావేశం జరిగింది. సమావేశానికి బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు, ఎంపీ ఆర్ కృష్ణయ్యను ఆహ్వానించారు. కులగణన విజయానికి గుర్తుగా బీసీ నేత అయిన కృష్ణయ్యను ఘనంగా సన్మానించారు. ఓబీసీ మోర్చా జాతీయ అధ్యక్షుడు, ఎంపీ డాక్టర్ కే లక్ష్మణ్, ఎంపీలు, ఎమ్మెల్యేలు సైతం సమావేశానికి హాజరయ్యారు.
స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీ కార్డు..
గ్రామస్థాయి నుంచి బీసీలను చేరువయ్యేందుకు బీసీ సంఘాలను కూడా కలుపు కొని ముందుకుపోవాలని బీజేపీ నేతలు ఈ సందర్భంగా చర్చించినట్లు సమాచారం. కేంద్రప్రభుత్వం తీసుకున్న బీసీ కులగణనను సద్వినియోగం చేసుకుని రాబోయే అసెంబ్లీ ఎన్నికలు నాటికి బీజేపీని అధికారంలోకి తీసుకురావడమే లక్ష్యంగా పార్టీ నేతలు ముందుకు పోతున్నట్లు తెలిపారు.