29-01-2026 12:31:42 AM
ఎన్నికల విధులను పక్కాగా నిర్వహించాలని అధికారులకు దిశా నిర్దేశం
నిజామాబాద్, జనవరి 28 (విజయ క్రాంతి) : ఎన్నికల సంఘం నిబంధనలు పాటిస్తూ నామినేషన్ల ప్రక్రియను పకడ్బందీగా చేపట్టాలని, ఎన్నికల విధుల పట్ల జాగరూకతతో వ్యవహరించాలని కలెక్టర్ ఇలా త్రిపాఠి సూచించారు. మున్సిపల్ ఎన్నికల నిర్వహణలో భాగంగా నామినేషన్ల స్వీకరణ కేంద్రాలను కలెక్టర్ బుధవారం సందర్శించారు. నిజామాబాద్ నగర పాలక సంస్థ పరిధిలోని కంటేశ్వర్ మున్సిపల్ జోన్ ఆఫీసు, టీటీడీ కల్యాణ మండపంలలో ఏర్పాటు చేసిన నామినేషన్ స్వీకరణ కేంద్రాలను తనిఖీ చేసిన కలెక్టర్, నామినేషన్ ఫారంలు, రిజిస్టర్లను పరిశీలించారు.
అదేవిధంగా కామారెడ్డి జిల్లా ఇంచార్జి కలెక్టర్ గా కొనసాగుతున్న నేపథ్యంలో బాన్సువాడ పట్టణంలోని మున్సిపల్ కార్యాలయంలో నిర్వహిస్తున్న నామినేషన్ల స్వీకరణ ప్రక్రియను సైతం క్షేత్రస్థాయిలో పరిశీలించారు. మొదటి రోజు ఆయా డివిజన్లు, వార్డు స్థానాలకు దాఖలైన నామినేషన్ల వివరాలు అడిగి తెలుసుకున్నారు.
నామినేషన్ల స్వీకరణ, స్క్రూటినీ, అప్పీళ్ల పరిష్కారం, గుర్తుల కేటాయింపు, పోటి చేసే అభ్యర్థుల ప్రకటన తదితర ప్రక్రియలు పకడ్బందీగా జరిగేలా చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. కలెక్టర్ వెంట బాన్సువాడ సబ్ కలెక్టర్ కిరణ్మయి, నగర పాలక సంస్థ కమిషనర్ దిలీప్ కుమార్, బాన్సువాడ మున్సిపల్ కమిషనర్ శ్రీహరిరాజు తదితరులు ఉన్నారు.