calender_icon.png 23 August, 2025 | 8:42 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

రైతాంగాన్ని నిండా ముంచుతున్న కాంగ్రెస్ ప్రభుత్వం

23-08-2025 12:50:58 AM

బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు, మాజీ ఎంపీపీ ఏనుగు సుదర్శన్ రెడ్డి

ఘట్ కేసర్, ఆగస్టు 22 : ప్రతిపక్షంలో ఉన్నపుడు ప్రజల కష్టాలను తొలగించడానికి తాము మాత్రమే ఏకైక దిక్కు అన్నట్టు అబద్ధపు ప్రచారాలు సాగించిన కాంగ్రెస్ నేతలు అధికారంలోకి వచ్చిన వెంటనే తమ అసలు రూపం జిత్తులమారి నక్క పనితీరు బయటపెట్టారని బిజెపి రాష్ట్ర కార్యవర్గ సభ్యులు, మాజీ ఎంపీపీ ఏనుగు సుదర్శన్ రెడ్డి విమర్శించారు.శుక్రవారం మేడ్చల్ నియోజకవర్గ పరిధిలోని రైతుల సమస్యలపై విలేకరుల సమావేశం నిర్వహించారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఒకవైపు రాష్ట్ర ప్రభుత్వ సవతి తల్లి వివక్షత మరొకవైపు స్థానిక ఎమ్మెల్యే మల్లారెడ్డి అసమర్థత వల్ల ఈప్రాంత రైతాంగం పూర్తిగా నష్టపోతుందని ఆవేదన వ్యక్తం చేశారు. అసెంబ్లీ ఎన్నికల ప్రధాన హామీ రైతు రుణ మాఫీ అమలు చేయలేక అనేక పరిమితులు పెట్టి మేడ్చల్ నియోజకవర్గ పరిధిలో 50% రైతులు రుణ మాఫీ కాక ఇప్పటికీ ఎదురుచూస్తున్నారని పేర్కొన్నారు.

ఒక్క ఘట్ కేసర్ రైతు సహకార సంఘం పరిధిలో 1189 మంది రైతుల రూ. 8కోట్ల 88లక్షలకు పైగా రుణాన్ని అడిట్ పేరుతో ఎగనామం పెట్టిన దుర్మార్గపు ప్రభుత్వం అని విమర్శించారు. ఇట్టి అంశంపై సంస్థ ఎండి పూర్తి వివరణతో కూడిన లేఖ రాసినప్పటికీ ఇప్పటికీ రుణ మాఫీ కాకపోవడం దుర్మార్గం ఉన్నారు.అరచేతిలో వైకుంఠం చూపించిన రేవంత్ సర్కారు రైతు భరోసా పథకానికి కూడా తూట్లు పొడుస్తూ అనేక మంది రైతులకు పంట పెట్టుబడి సాయాన్ని ఎగవేస్తుందన్నారు.

ఇన్ని రకాల ప్రభుత్వ అడ్డంకులకు తోడు ప్రకృతి ప్రకోపాన్ని కూడా లెక్కచేయక మొండి ధైర్యంతో ముందుకు వెళ్ళి పంట పండించిన రైతన్న పంట కొనుగోళ్లపై కూడా ప్రతిసారి నిర్లక్ష్యాన్ని నేనే స్వయంగా ప్రశ్నించడం జరిగిందన్నారు. ఈవిధంగా మేడ్చల్ నియోజకవర్గం ముఖ్యంగా ఘట్కేసర్ రైతాంగానికి సంబందించిన రుణమాఫీ పై కుంటి సాకులు మాని రుణ మాఫీని చిత్తశుద్ధితో అమలు చేయాలని ఆయన డిమాండ్ చేశారు.