calender_icon.png 28 September, 2025 | 2:36 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

కానిస్టేబుల్ గీతం కన్నీళ్లు తెప్పిస్తోంది

28-09-2025 01:26:01 AM

వరుణ్ సందేశ్, మధులిక వారణాసి, హీరోహీరోయిన్లుగా నటిస్తున్న చిత్రం ‘కానిస్టేబుల్’. ఆర్యన్ సుభాన్ ఎస్‌కే దర్శకత్వంలో జాగృతి మూవీ మేకర్స్ బ్యానర్‌పై బలగం జగదీశ్ నిర్మిస్తున్న ఈ సినిమా అక్టోబర్ 10న విడుదలకు సిద్ధమైంది. ఇందులో రామారావు రాసిన ఓ పాటను ప్రముఖ గీత రచయిత చంద్రబోస్ ఆలపించారు. ఈ ఎమోషనల్ సాంగ్ తాజాగా విడుదలైంది. హైదరాబాద్‌లో శనివారం ఏర్పాటుచేసిన ఈ గీతావిష్కరణ కార్యక్రమానికి ప్రముఖ నటుడు, దర్శక నిర్మాత ఆర్ నారాయణమూర్తి ముఖ్యఅతిథిగా విచ్చేశారు.

ఈ సందర్భంగా నారాయణమూర్తి మాట్లాడుతూ.. “సమాజంలో పోలీసులు పోషిస్త్తున్న పాత్ర అనిర్వచనీయం. చట్టాన్ని కాపాడుతూ నిజాయితీగా పనిచేసే పోలీసులు సమాజానికి స్ఫూర్తిదాయకంగా నిలుస్తుంటారు. అలాంటి నిజాయితీ కలిగిన ఓ కానిస్టేబుల్ ఇతివృత్తంతో ఈ చిత్రాన్ని రూపొందించడం అభినందనీయం. ఈ పాట మనసును ఎంతగానో హత్తుకుంటోంది. చంద్రబోస్ తన గాత్రంతో కన్నీళ్లు తెప్పించారు” అన్నారు. హీరో వరుణ్ సందేశ్ మాట్లాడుతూ.. “చక్కటి డ్రామా, ఎంటర్‌టైన్‌మెంట్, ఎమోషనల్, సస్పెన్స్ థ్రిల్లర్‌గా ప్రేక్షకులను అలరిస్తుందీ సినిమా. నా కెరీర్‌కు మరో మలుపు అవుతుంది” అని చెప్పారు.

దర్శకుడు ఆర్యన్ సుభాన్ మాట్లాడుతూ.. “ఈ పాటను చిత్రీకరిస్తున్నప్పుడు లొకేషన్‌లోని ప్రజలు నిజమైన సన్నివేశం అనుకుని కన్నీరు కార్చారు. సమాజానికి స్ఫూర్తిదాయకమైన ఇలాంటి చిత్రాలు రావాలని అందరూ కోరుకునేలా ఈ సినిమా ఉంటుంది” అన్నారు. చిత్ర నిర్మాత బలగం జగదీశ్ మాట్లాడుతూ.. “నైజాంలో ఏషియన్ ఫిలిం డిస్ట్రిబ్యూషన్ ద్వారా విడుదలవుతుంది. దాదాపు 500 థియేటర్ల పైచిలుకు థియేటర్లలో ఈ చిత్రాన్ని విడుదల చేయబోతున్నాం” అని తెలిపారు. ఈ కార్యక్రమంలో కెమెరామెన్ హజరత్, సంగీత దర్శకుడు సుభాష్ ఆనంద్, గీత రచయిత రామారావు, సహ నిర్మాత కుపేంద్ర పవార్, ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ మిట్టపల్లి జగ్గయ్య, నటీనటులు దువ్వాసి మోహన్, నిత్య, భవ్య, ఇందు తదితరులు పాల్గొన్నారు.