28-09-2025 01:27:29 AM
మలయాళ ఇండస్ట్రీలో చిన్న సినిమాగా విడుదలై బ్లాక్‌బస్టర్ అందుకున్న తాజాచిత్రం ‘లోక చాప్టర్ 1చంద్ర’. కల్యాణి ప్రియదర్శన్ ప్రధాన పాత్రలో నటించిన ఈ సినిమాలో నెస్లన్, చందు, సాయికుమార్ కీలక పాత్రల్లో కనిపించారు. మలయాళ స్టార్స్ దుల్కర్‌సల్మాన్, టొవినో థామస్ అతిథి పాత్రల్లో అలరించారు. డొమెనిక్ అరుణ్ తెరకెక్కించిన ఈ సినిమాకు హీరో దుల్కర్ సల్మాన్ నిర్మాత. ఆగస్టు నెలాఖరున విడుదలైన ఈ సినిమా దాదాపు రూ.270 కోట్లకుపైగా వసూళ్లతో రికార్డ్స్ సృష్టించింది.
ఇదే సినిమా తెలుగులో ‘కొత్త లోక’గా ప్రేక్షకుల ముందుకొచ్చింది. ఇక్కడా సత్తా చాటింది. ఇలా ఈ సినిమాకు ప్రేక్షకుల నుంచి మంచి స్పందన రావటంతో మేకర్స్ తాజాగా సీక్వెల్‌ను ప్రకటించారు. ‘లోక చాప్టర్2’గా రూపొందించను న్నట్టు తెలుపుతూ ఓ అనౌన్స్‌మెంట్ వీడియోను విడుదల చేశారు. ఈ వీడియో సీక్వెల్‌పై అంచనాలను పెంచేసింది. తొలిభాగంలో గెస్ట్ రోల్స్ చేసిన దుల్కర్, టొవినో ఈ సీక్వెల్‌లో ప్రధాన పాత్రల్లో నటించబోతున్నారు. సూపర్ హీరో కాన్సెప్ట్‌తో రూపొందిస్తున్న ఈ సినిమాను హాలీవుడ్ స్థాయిలో తీర్చిదిద్దేందుకు సన్నాహాలు చేస్తున్నారు. ఇందుకోసం దాదాపు రూ.150 కోట్లు ఖర్చు చేయనున్నారు. త్వరలో షూటింగ్ ప్రారంభించుకోనున్న ఈ సినిమా వచ్చే ఏడాది ప్రేక్షకుల ముందుకు వచ్చే అవకాశం ఉంది.