15-10-2025 04:45:27 PM
నంగునూరు: హుస్నాబాద్ మండలంలోని జిల్లెలగడ్డ సోషల్ వెల్ఫేర్ రెసిడెన్షియల్ పాఠశాలలో గత వారం రోజుల క్రితం జరిగిన వివేక్ మృతిపై ఇంతవరకు ప్రభుత్వం ఎలాంటి చర్యలు తీసుకోలేదని నంగునూరు బిఆర్ఎస్వీ బుధవారం ఓ ప్రకటనలో తెలిపారు. దళిత బడుగు బలహీన వర్గాలకు కాంగ్రెస్ ప్రభుత్వంలో న్యాయం జరగడం లేదని, మంత్రి పొన్నం సొంత నియోజకవర్గంలోనే ఈ ఘటన జరిగినా ఎలాంటి చర్యలు తీసుకోకుండా ప్రభుత్వం నిమ్మకు నీరెత్తినట్టు వ్యవహరిస్తుందని మండిపడ్డారు.
గత బిఆర్ఎస్ హయంలో ఉత్తమ విద్యాలయాలుగా వెలుగొందిన సోషల్ వెల్ఫేర్ పాఠశాలలో నేడు స్మశానవాటికల్లా తయారవుతున్నాయని, పేదల విద్యాలయాలను కాంగ్రెస్ ప్రభుత్వం నిర్వీర్యం చేస్తుందని బిఆర్ఎస్వీ మండల కో ఆర్డినేటర్ తప్పేట పర్షరాములు, నియోజకవర్గ ప్రధాన కార్యదర్శి దాసరి రమేష్, నాయకులు దేవులపల్లి కృష్ణలు విమర్శించారు. చిన్నారి వివేక్ హత్య మిస్టరీని వెంటనే ఛేదించి నిందితులను అరెస్ట్ చేసి శిక్షించాలని, లేనిచో స్థానిక మంత్రి బాధ్యత వహిస్తూ తక్షణమే రాజీనామా చేయాలని వారు డిమాండ్ చేశారు.