24-11-2025 01:42:02 AM
గ్రంథాలయంలో ఎన్‌సైక్లోపీడియా బ్రిటానికా వంటి అంతర్జాతీయ ప్రమాణాలు కలిగిన గ్రంథాలతో పాటు వందేళ్ల నాటి అరుదైన ఉగ్రంథాలూ అందుబాటులో ఉన్నాయి. సాంస్కృతిక, సాహిత్య కళారూపాలైన యక్షగానాలు, నాటకాలు, పద్య కావ్యాలు తరగని గనుల్లా ఆయన గ్రంథాలయంలో కొలువుదీరాయి. ఒక్క తెలుగు మాత్రమే కాకుండా సంస్కృతం, హిందీ, కన్నడ, మరాఠీ భాషా గ్రంథాలు వేలల్లో ఉన్నాయి. అవిలేను కేవలం పుస్తకాలను భద్రపరచడమే కాదు. ఎవరైనా ఫలానా అంశంపై పరిశోధన చేసేందుకు పుస్తకాలు కావాలంటే, ఆయన వారిని ప్రోత్సహిస్తారు.
ఒక మనిషి తన జీవితకాలంలో లక్షన్నర పుస్తకాలను సేకరించడమంటే సామాన్యమైన విషయం కాదు. అది ఒక మహాయజ్ఞం. తన వ్యక్తిగత అవసరాలను, ఆఖరికి సొంత ఇంటి కలను కూడా పక్కనపెట్టి చేతిలో ప్రతి రూపాయినీ పుస్తకాల సేకరణ కోసమే వెచ్చించిన అరుదైన అక్షర తపస్వి శీల అవిలేను.
యాదాద్రి భువనగిరి జిల్లా అడ్డగూడూరు మండలం చిర్రగూడూరులో పుట్టి, ఉద్యోగ రీత్యా సూర్యాపేటలో స్థిరపడిన ఈ ఉపాధ్యాయుడు గడచిన మూడు దశాబ్దాలుగా పుస్తక సేకరణే ఊపిరిగా జీవిస్తున్నారు. కవులు, రచయితలు వ్యక్తిగతంగా తనకు పంపించే పుస్తకాలను స్వీకరించడమే కాకుండా, తన జీతభత్యాలను వెచ్చించి వేలాది గ్రంథాలను కొనుగోలు చేశారు. చరిత్ర, సాహిత్యం, కళలు కాలగర్భంలో కలిసిపోకుండా ఉండాలనే సంకల్పంతో ముందుకు సాగుతున్నారు. ఈ క్రమంలో ఆయన పాత ఇనుప సామగ్రి (స్క్రాప్) దుకాణాలకు సైతం వెళ్లారు.
అక్కడ చిత్తుకాగితాలుగా మారబోతున్న అపురూపమైన గ్రంథాలను ఓపికగా ఏరి తన చెంతకు తెచ్చుకున్నారు. వాటిని సేకరించేందుకు ఆయన పడిన శ్రమ వర్ణనాతీతం. ఒక తరం మేధావులు సేకరించిన విజ్ఞాన సంపద, వారి తదనంతరం చెత్తలపాలవుతుంటే చూడలేక, కొన్నిసార్లు వ్యాపారులు అడిగినంత డబ్బు చెల్లించి మరీ పుస్తకాలను ఇంటికి మోసుకొచ్చేవారు. ఇలా సేకరించిన పుస్తకాల కోసం ఆయన ఏకంగా ఒక ఇంటినే కొనుగోలు చేశారు. ఆ ఇంటిని గ్రంథాలయంగా మార్చారు.
చిన్ననాటి నుంచే పుస్తకాలంటే ప్రేమ
చిన్ననాడు తిరుమలగిరి గ్రంథాలయ పరిచయంతో పుస్తకాలపై ప్రేమ పెంచుకున్న అవిలేను ఇప్పుడు ‘పిల్లలమర్రి వీరభద్ర కళాపీఠం’ పేరుతో ఒక బృహత్తర గ్రంథాలయాన్ని నిర్వహిస్తున్నారు. గ్రంథాలయంలో ఎన్‌సైక్లోపీడియా బ్రిటానికా వంటి అంతర్జాతీయ ప్రమాణాలు కలిగిన గ్రంథాలతో పాటు వందేళ్ల నాటి అరుదైన ఉగ్రంథాలూ అందుబాటులో ఉన్నాయి.
సాంస్కృతిక, సాహిత్య కళారూపాలైన యక్షగానాలు, నాటకాలు, పద్య కావ్యాలు తరగని గనుల్లా ఆయన గ్రంథాలయంలో కొలువుదీరాయి. ఒక్క తెలుగు మాత్రమే కాకుండా సంస్కృతం, హిందీ, కన్నడ, మరాఠీ భాషా గ్రంథాలు వేలల్లో ఉన్నాయి. అవిలేను కేవలం పుస్తకాలను భద్రపరచడమే కాదు. ఎవరైనా ఫలానా అంశంపై పరిశోధన చేసేందుకు పుస్తకాలు కావాలంటే, ఆయన వారిని ప్రోత్సహిస్తారు.
వారికి కావాల్సిన గ్రంథాలను సమకూరుస్తారు. అంతేకాదు.. నిరుద్యోగులకూ తన వంతు సాయంగా పుస్తకాలు అందజేస్తారు. తలలుపండిన రచయితల వద్ద కూడా దొరకని పుస్తకాలు సైతం అవిలేను గ్రంథాలయంలో లభ్యమవుతుండటం విశేషం. అవిలేను సంకల్పం కేవలం పుస్తక సేకరణకే పరిమితం కాలేదు. నేటి విద్యార్థుల్లో పుస్తక పఠనాసక్తి తగ్గిపోతుందన్న ఆవేదనతో ‘చదవండి - చదివించండి’ అనే నినాదాన్ని భుజానికెత్తుకున్నారు.
ప్రభుత్వ పాఠశాలల్లో చదువుతున్న విద్యార్థులకు విజ్ఞానాన్ని చేరువ చేయాలనే గొప్ప లక్ష్యంతో ప్రతి పాఠశాలకు విద్యార్థుల స్థాయికి తగిన 100 పుస్తకాలను ఉచితంగా అందించే కార్యక్రమాన్ని కొనసాగిస్తున్నారు.
అలా ఇప్పటికే ఆయన సూర్యాపేట, నల్లగొండ, యాదాద్రి జిల్లాల్లోని అనేక పాఠశాలలకు పుస్తకాలు అందజేశారు. విద్యార్థుల్లో సృజనాత్మకతను వెలికితీసేందుకు కవి సమ్మేళనాలు, పుస్తక పరిచయ సభలు నిర్వహిస్తూ ఆదర్శ ఉపాధ్యాయుడిగా నిలుస్తున్నారు. ప్రభుత్వ పాఠశాలలు, కళాశాలల ప్రధానోపాధ్యాయులు, ఉపాధ్యాయులు, అధ్యాపకులు ఎవరైనా తనను సంప్రదిస్తే పుస్తకాలు అందించేందుకు సిద్ధంగా ఉంటున్నారు.
ప్రచార ఆర్భాటాలకు దూరం
నేటితరం, భవిష్యత్తు తరం కోసం ఇంతగా పరితపిస్తున్న అవిలేను ప్రచార ఆర్భాటాలకు దూరంగా ఉంటారు. నిరాడంబర జీవన శైలిని అవలంబిస్తున్నారు. ఆయన కృషిని తెలంగాణ గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ గుర్తించారు. ఆస్ట్రేలియాకు చెందిన అష్టావధాని తటవర్తి కల్యాణ చక్రవర్తి పలు ప్రాచీన దేవాలయాల పేరిట జరిపిన ఆన్‌లైన్ అష్టావధానాల్లో సూర్యాపేట సమీపంలోని పిల్లలమర్రి క్షేత్రం వేదికగా నిర్వహించిన అష్టావధానం నిర్వహణలో అవిలేను కీలక పాత్ర పోషించారు.
ఇటీవల గవర్నర్ సూర్యాపేటలో పర్యటించిన సందర్భంగా అవిలేనును ప్రత్యేకంగా తన వద్దకు ఆహ్వానించారు. అవిలేనుతో కాసేపు ముచ్చటించి పుస్తక సేకరణపై ఆరా తీశారు. అవిలేనుకు ఢిల్లీకి చెందిన ‘ఆదిలీల’ ఫౌండేషన్ వంటి సంస్థల నుంచి ఆహ్వానం వచ్చింది. ఆ పరిచయాలను కూడా ఆయన తన గ్రంథాలయ అభివృద్ధి కోసమే వినియోగించుకున్నారు.
ఉపాధ్యాయ శిక్షణ కార్యక్రమాల్లో అవిలేను విషయ నిపుణుడిగా సేవలందిస్తున్నారు. రాష్ట్ర విద్యా పరిశోధన శిక్షణ మండలి తరఫున అనేక అకాడమిక్ కార్యక్రమాలకు ప్రాతినిథ్యం వహిస్తున్నారు. సాయంత్రం పాఠశాల విధులు ముగియగానే గ్రంథాలయమే లోకంగా అవిలేను జీవిస్తున్నారు. ఎప్పుడు చూసినా తన గ్రంథాలయంలో పుస్తకాలు సర్దుతూనో, చదువుతూనో కాలం గడుపుతుంటారు.
సూర్యాపేట అనగానే ఒకప్పుడు సాయుధ పోరాటం, పిల్లలమర్రి ఆలయం గుర్తొచ్చేవి. కానీ, భవిష్యత్తులో అవిలేను స్థాపించిన గ్రంథాలయం కూడా చిరస్థాయిగా నిలిచిపోతుందనడంలో సందేహం లేదు. కవి సమ్మేళనాలు, పుస్తక పరిచయ కార్యక్రమాలు, అవధానాలు మొదలైన సాహిత్య కార్యక్రమాలకూ అవిలేను చేయూతని స్తున్నారు. గ్రంథాలయోద్యమకారుడిగానే కాక ఉపాధ్యాయుడిగా ఆదర్శప్రాయంగా నిలుస్తున్నారు.