24-11-2025 01:40:48 AM
నాటకం అనేది కేవలం వినోదాత్మక కళ మాత్రమే కాదు. అది ఒక శ్రవణ దృశ్య రూపక ప్రక్రియ. సంగీతం, నృత్యం, గానం, వేషధారణ కలగలిపి, సామాజిక సాంస్కృతిక జీవనాన్ని ప్రతిబింబించే గొప్ప కళారూపం. తెలుగు సాహిత్యంలో అంతటి గొప్ప ప్రక్రియకు ఆద్యుడు తూము రామదాసు.
ఆయన ఓరుగల్లు సమీపంలో బాలనగరంలో 1856 ఆగస్టు 1 జన్మించాడు. తల్లిదండ్రులు తూము సర్వేశం, కనకమ్మ. రామదాసుకు చిన్ననాటి నుంచే కీర్తనలు, జానపద గేయాలపై ఆసక్తి ఉండేది. అప్పటి గ్రామీణ వాతావరణం, బాహుళ్యంలోని మౌఖిక కథలు ఆయనపై అమితమైన ప్రభావం చూపాయి.
ఆయన అభిరుచి ఆసక్తులకు ఆజ్యం పోశాడు తన గురువు కందాళ సింగరాచార్యులు. విద్యాభ్యాసం పూర్తయ్యాక రామదాసు నిజాం ప్రభుత్వంలో అటవీశాఖ ఉద్యోగిగా పనిచేశాడు. వృత్తిపరమైన పర్యటనలు ఆయన్ను గ్రామీణ జీవన శైలి, వృక్షజాలం, వన్యప్రాణుల గురించి విస్తృతంగా అధ్యయనం చేసే విధంగా పురిగొల్పాయి.
అలా తన 21 ఏళ్ల వయస్సులో రామదాసు ‘రుక్మిణీకల్యాణము’ గేయ కావ్యం రాశాడు. తర్వాత గోపికా విలాసము, మిత్రవిందోద్వాహము అనే ప్రబంధాలు రాశారు. సురభి నాటక సమాజం కోసం రామదాసు రాసిన తొలి నాటకం ‘కాళిదాసు’. ఈ రచన ఆయన 1897లో రాశాడు. నాటకంలో ఆయన కాళిదాసు జీవితకథను ఆధారంగా తీసుకున్నాడు. ఈ నాటకం ఆధునిక నాటక రచనకు ప్రామాణికమని సాక్షాత్తు తెలంగాణ వైతాళికుడు సురవరం ప్రతాపరెడ్డి ప్రకటించారంటే రచన స్థాయి ఏంటో అర్థం చేసుకోవచ్చు. రామదాసుకు సురభి నాటక సమాజంతో మంచి సంబంధాలు ఉండేవి.
వరంగల్ ప్రాంతంలో ఆ బృందం ప్రదర్శనలు ఇస్తున్నప్పుడు రామదాసు వారికోసం ‘కాళిదాసు’ నాటకం రాసిఇచ్చాడు. ఈ నాటకాన్ని వనారస గోవిందరావు దర్శకత్వం వహించి ప్రదర్శించాడు. 1899లో నాటకం పుస్తకరూపంలో ప్రచురితమైంది. 19వ శతాబ్దం చివరి దశలో ఈ నాటకం దేశవ్యాప్తంగా ప్రాచుర్యం పొందింది. కిర్లోస్కర్ నాట్య మండలి, కేశవరావు ఒడోడెకర్ నాట్యమండలి, సాంగ్లీకార్ నాటక మండలి, పూర్ణ చంద్రోదయ నాట్యమండలి వంటి బృందాలు దేశమంతటా వేలాది ప్రదర్శనలిచ్చాయి.
రామదాసు తర్వాతి రచనలు ‘భీమసేన విలాసము’, ‘తారా శశాంకం’. రామదాసు తెలుగు సాహిత్య చరిత్రలో నిఘంటువు రచనకూ పాదులు వేశాడు. 1901లో ఆయన ‘ఆంధ్ర పద నిధానం’ పేరిట పదకోశాన్ని ముద్రించడం విశేషం. ఈ పద కోశ రచనలో పద్య రూపం వినియోగించడం మరో అరుదైన అంశం. సురవరం ప్రతాపరెడ్డి తన ‘గోల్కొండ కవులు’ గ్రంథంలో తూము రామదాసును ప్రస్తావించాడు.
ఈ గ్రంథంలో ఆయన తెలంగాణ ప్రాంతంలో పుట్టి పెరిగిన ప్రముఖ కవులు, రచయితలు, నాటకకర్తల గురించి వివరంగా రాశాడు. అందులో రామదాసు పేరును ప్రత్యేకంగా కొనియాడారు. రామదాసు కేవలం నాటక రచయితగానే కాక గేయకావ్యం, ప్రబంధం, శతకం, యక్షగానం వంటి విభిన్న సాహిత్య రూపాల్లో తన ప్రతిభను కనబరిచాడు.
ఆయన రచనలు కాలక్రమానుసారంగా పరిశీలిస్తే, ఆయన సాహిత్య పరిణామం, అభిరుచులు, ఆధ్యాత్మికత, సమాజ దర్శనం స్పష్టమవుతాయి. 1904 నవంబర్ 29న రామదాసు పరమపదించాడు. కొన్ని రచనలు ఆయన మరణానంతరమూ వెలువడ్డాయి. ఆయన సాహిత్య కీర్తి మరణానంతరం కూడా కొనసాగడం విశేషం.