18-11-2025 12:00:00 AM
జిల్లా న్యాయ సేవ అధికార సంస్థ జిల్లా ప్రధాన కార్యదర్శి జయరాజు
యాదాద్రి భువనగిరి, నవంబర్ 17 ( విజయక్రాంతి ): జిల్లా న్యాయ సేవ అధికార సంస్థ యాదాద్రి భువనగిరి అధ్యక్షులు మరియు జిల్లా ప్రధాన న్యాయమూర్తి ఎ జయరాజు వారి సూచనల మేరకు సంస్థ కార్యదర్శి వి మాధవి లత సహృదయ వయోవృద్ధుల ఆశ్రమంలో తల్లితండ్రుల, వయోవృద్ధుల నిర్వహణ మరియు సంక్షేమ చట్టంపై అవగాహన కార్యక్రమం నిర్వహించారు.
ఈ కార్యక్రమములో న్యాయమూర్తి మాట్లాడుతూ వయోవృద్ధులు ఒంటరివారు కారని, చట్టంలో వారి సంక్షేమానికి అన్ని హక్కులు చేర్చబడ్డాయని తెలిపి, వయో వృద్ధులకు కేవలం ప్రభుత్వమే కాకుండా వారికై సేవలు అందిస్తున్న సంక్షేమ సంఘాలు, పౌరులు బాధ్యత తీసుకొని వారి హక్కులను కాపాడాలని తెలిపి, భువనగిరి , చౌటుప్పల్ రెవిన్యూ డివిజన్ అధికారులు వయోవృద్ధుల సంక్షేమ మరియు తల్లి తండ్రుల పోషణ వివాదాలను పరిష్కరించటానికి ప్రత్యేక ట్రిబ్యునల్ మరియు అప్పీల్ చేసుకోవటానికి జిల్లా కలెక్టర్ ట్రిబ్యునల్ కూడా ఏర్పాటు చేయబడి సేవలు అందిస్తున్నట్లు తెలిపి,
ప్రతీ కార్యాలయం, ఆసుపత్రి, బ్యాంకులు, దేవాలయాలలో వయో వృద్ధులకు ప్రత్యేక వసతులు కల్పించి త్వరితగతిన సేవలు అందించాలని తెలిపి, ఆశ్రమములో ఉంటున్న వయోవృద్ధులకు జిల్లా సంక్షేమ శాఖ అధికారి నరసింహ రావు, భువనగిరి రెవిన్యూ డివిజన్ అధికారి కృష్ణారెడ్డి గారు ప్రత్యేక శాఖా పరమైన కృషితో ఆధార్ కార్డులు లేనివారికి ఇప్పించారని , వీరికి అర్హతలను అనుసరించి ప్రభుత్వ పథకాలు కూడా అందచేస్తామని తెలిపారని తెలియచేశారు. న్యాయ సేవలకు సలహాలకు 15100 ద్వారా సంప్రదించవచ్చని తెలిపారు.
భువనగిరి రెవిన్యూ డివిజన్ అధికారి కృష్ణారెడ్డి మాట్లాడుతూ వయోవృద్ధులకు సంబంధించిన వివాదాలను సభ్యుల అవిశ్రాంత సేవలతో ట్రిబ్యునల్ ద్వారా త్వరితగతిన పరిష్కరిస్తున్నట్లు , వయో వృద్ధులకు చట్టపరమైన సేవలు అందించటానికి జిల్లా వ్యాప్తంగా విస్తృత సేవలు అందించనున్నట్లు, ఆశ్రమములో ఆధార్ కార్డులు లేనివారికి జిల్లా పరిపాలన విభాగంతో సమన్వయం చేసుకొని అందించామని తెలిపారు. జిల్లా సంక్షేమ శాఖ అధికారి నరసింహ రావు మాట్లాడుతూ తమ శాఖ వయో వృద్ధుల సంక్షేమానికి ప్రత్యేక దృష్టి పెట్టి సేవలు అందిస్తున్నట్లు తెలిపారు.
జిల్లా మానసిక, ఆరోగ్య వైద్య అధికారి డా. ప్రీతి స్వరూప్ మాట్లాడుతూ ఆశ్రమంలో మానసిక అనారోగ్యంతో ఉన్నవారికి వైద్యులు సూచించిన ప్రకారం వైద్యం అందచేయాలని, జిల్లా వైద్య శాఖ నుండి వీరికి మెడికల్ క్యాంపుల ద్వారా ఉచిత సేవలు అందిస్తున్నామని తెలిపారు. యాదాద్రి భువనగిరి జిల్లా వయో వృద్ధుల సంక్షేమ సంఘం అధ్యక్షుడు వెంకటేశం, సభ్యులు బాలేశ్వర్, అంజయ్య, చంద్రశేఖర్ పాల్గొని , వయో వృద్ధులకు తమ పూర్తి సేవలు అందిస్తున్నట్లు, భవిష్యత్తులో ప్రత్యేక ప్రణాళికతో సేవలు అందిస్తామని తెలిపారు. కార్యక్రమములో ఆశ్రమంలో ఉన్నవారికి పండ్లు పంపిణీ చేశారు.