03-11-2025 12:00:00 AM
శిక్షణ కలెక్టర్ సలోని చాబ్రా
ఆదిలాబాద్, నవంబర్ 2 (విజయక్రాంతి) : వయోవృద్ధులు ప్రస్తుత వాతా వరణ పరిస్థితుల్లో ఆరోగ్య జాగ్రత్తలు తప్పనిసరిగా పాటించాలని ట్రైనీ కలెక్టర్ సలోని చాబ్రా అన్నారు. ఆదివారం స్థానిక జిల్లా వయోవృద్ధుల సమాఖ్య కార్యాలయంలో ఉచిత ఆరోగ్య శిబిరం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ట్రైనీ కలెక్టర్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. శ్రీకృష్ణ హాస్పిటల్ వైద్యులు డాక్టర్ క్రాంతి కుమార్, డాక్టర్ రజిత ఆధ్వర్యంలో ఉచిత ఆరోగ్య శిబిరంను నిర్వహిం చారు. వయోవృద్ధులకు షుగర్, బ్లడ్ ప్రెషర్ తదితర ఆరోగ్య పరీక్షలు చేసి, ఉచితంగా మందులు పంపిణీ చేశారు.
ఈ సందర్భంగా ట్రైనీ కలెక్టర్ మాట్లాడుతూ... ఇంటి పెద్దలను భారంగా కాకుండా, బాధ్యతగా చూసు కోవాలని ఇది ప్రతి ఒక్కరి ఇంటి సభ్యుల బాధ్యత అని అన్నారు. పెద్దవాళ్లు ప్రతి ఇంటికి ధైర్యం, ఆధారం అన్నారు. పిల్లలు తమ తల్లిదండ్రుల పట్ల ప్రేమ, పర్యవేక్షణతో ఉండి వారికి ఎల్లప్పుడూ అండగా నిలవాలని సూచించారు.
ఈ కార్యక్రమంలో వయోవృద్దుల సమాఖ్య అధ్యక్షులు డా. దేవదాసు దేశ్పాండే, పెన్షనర్స్ అసోసియేషన్ అధ్యక్షుడు లక్ష్మారెడ్డి, సీనియర్ సిటిజన్ల సమాఖ్య సభ్యులు ఎం. గంగాధర్, రామ్ కులకర్ణి, పళ్ళ సత్యనారాయణ, కే. శివన్న, నీలా కిషన్, భాస్కర్, జగదీశ్వర్ తదితరులు పాల్గొన్నారు.