calender_icon.png 4 November, 2025 | 2:16 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

పోలీసులు, మీడియా సమాజ సేవలో భాగస్వాములు..

03-11-2025 07:01:27 PM

జిల్లా కలెక్టర్ బి.ఎం.సంతోష్..

గద్వాల: జోగులాంబ గద్వాల జిల్లాలోని పోలీస్ పరేడ్ మైదానంలో ఈరోజు జిల్లా పోలీస్, ప్రెస్ వర్గాల మధ్య నిర్వహించిన ఫ్రెండ్లీ క్రికెట్ మ్యాచ్ ఉత్సాహభరితంగా సాగింది. ఈ మ్యాచ్‌కు ప్రధాన అతిథులుగా జిల్లా కలెక్టర్ బి. ఎం. సంతోష్, ఐ.ఏ.ఎస్, జిల్లా పోలీసు అధికారి టి. శ్రీనివాసరావు, ఐ.పి.ఎస్ హాజరై మ్యాచ్‌ను ప్రారంభించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ శ్రీ బి. ఎం. సంతోష్  మాట్లాడుతూ పోలీసు శాఖ, మీడియా సమాజ అభివృద్ధిలో ముఖ్యమైన భాగస్వాములని అన్నారు. ప్రజల సమస్యలను పరిష్కరించడంలో, అవగాహన పెంపొందించడంలో ఇరువురూ కీలక పాత్ర పోషిస్తారని అన్నారు. ఫ్రెండ్లీ క్రికెట్ మ్యాచ్ వంటి కార్యక్రమాలు పరస్పర సంబంధాలను బలోపేతం చేయడంతో పాటు ఆరోగ్యవంతమైన వాతావరణాన్ని కల్పిస్తాయని తెలిపారు.

క్రీడల ద్వారా శారీరక–మానసిక ఉల్లాసం పెంపొందుతుందని, టీమ్ స్పిరిట్ పెరుగుతుందని పేర్కొన్నారు. ఈ సందర్భంగా జిల్లా ఎస్పీ శ్రీనివాసరావు, ఐపిఎస్ మాట్లాడుతూ... పోలీసులు, మీడియా సమాజ నిర్మాణంలో కీలకమైన వర్గాలని, ప్రజల సేవలో ఇరువురు ఒకే ధ్యేయంతో కృషి చేస్తున్నారని తెలిపారు. క్రీడలు మానసిక ఉల్లాసాన్ని,టీమ్ స్పిరిట్‌ను పెంపొందిస్తాయని తెలిపారు. ఇలాంటి ఫ్రెండ్లీ మ్యాచ్‌లు పరస్పర అవగాహన, స్నేహభావాన్ని మరింత బలపరుస్తాయని పేర్కొన్నారు.

మ్యాచ్‌లో టాస్ గెలిచిన ప్రెస్ జట్టు మొదటగా బ్యాటింగ్ చేయగా,12 ఓవర్లలో 63 పరుగులు సాధించింది. అనంతరం బ్యాటింగ్ చేసిన జిల్లా పోలీస్ జట్టు 8.5 ఓవర్లలో లక్ష్యాన్ని చేరుకుని విజేతగా నిలిచింది. తరువాత జరిగిన బహుమతి ప్రదాన కార్యక్రమంలో విజేత, రన్నర్ జట్లకు ట్రోఫీలు,జట్టు సభ్యులకు మెమెంటోలు, అలాగే “బెస్ట్ బ్యాట్స్‌మన్”, “బెస్ట్ బౌలర్”, “మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్” అవార్డులను జిల్లా ఎస్పీ  అందజేశారు. ఈ కార్యక్రమంలో జిల్లా అదనపు ఎస్పీ శ్రీ కె. శంకర్,ఎస్బీ ఇన్స్పెక్టర్ రవి, గద్వాల్ సి.ఐ శ్రీను, అలంపూర్ సి.ఐ రవి బాబు, పి.సి.ఆర్ ఇన్స్పెక్టర్ సంపత్, ఆర్.ఐ వెంకట్, హరీఫ్, వివిధ పోలీస్ స్టేషన్ల ఎస్సైలు, పాత్రికేయులు మరియు పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు.