31-12-2025 01:03:55 AM
కార్మిక సంక్షేమం పట్టని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు
హైదరాబాద్, డిసెంబర్ 30 (విజయక్రాంతి) : రాష్ట్రంలో చిరుద్యోగులు, కార్మికు ల సంక్షేమ, వైద్య సేవలను అందించాల్సిన ఈఎస్‌ఐ రోజురోజుకూ కునారిల్లుతోంది. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల మధ్య ఈఎస్‌ఐ ఊగిసలాడుతోంది. లబ్ధిదారుల నుంచి సేకరించిన వాటా మొత్తంకూడా అటు కేంద్రం, ఇటు రాష్ట్రం ఖర్చు చేయడం లేదు. దీంతో ఈఎస్‌ఐలో సేవలు అంతకంతకూ కనుమరుగవుతున్నాయి.
సంక్షేమం దృష్టితో చూడాల్సిన కార్మిక, చిరుద్యోగుల ను కేంద్ర ప్రభుత్వం ఆదాయ వనరుగా చూస్తుందా అనే అనుమానం రాకమానదు. రాష్ట్రంలో కోటి మందికిపైగా వైద్య సేవలు అందించాల్సిన ఈఎస్‌ఐ నిర్వహణ తలకుమించిన భారం అవుతున్నదనే అభిప్రాయాలు బలపడుతున్నాయి.
20 లక్షల మంది లబ్ధిదారులు..
కేంద్ర కార్మిక శాఖ నిబంధనల ప్రకారం రూ. 21 వేలలోపు జీత భత్యాలు అందుకు నే వారందరూ ఈఎస్‌ఐ పరిధిలోకి వస్తా రు. చిన్న చిన్న వ్యాపార సంస్థలు, కంపెనీలు, దుకాణాలు, షాపులు, షోరూంలు, ఫ్యాక్టరీలు, కర్మాగారాలు.. ఇలా వేలాది సంస్థలు ఈఎస్‌ఐ పరిధిలోకి వస్తాయి. రాష్ట్రంలో మొత్తం 20 లక్షల మంది వరకు ఈఎస్‌ఐకి లబ్ధిదారులుగా ఉన్నారు. తాజాగా కేంద్రం ఆదాయ పరిమితిని రూ. 25 వేల వరకు పెంచినట్టు సమాచారం.
ఇప్పుడు పెరిగిన జీతాల పరిమితితో మరో రెండు లక్షల మంది వరకు ఈఎస్‌ఐ లబ్ధిదారులు పెరిగే అవకాశం ఉన్నట్టు అంచనా. ప్రస్తుతానికి ఉన్న 20 లక్షల మంది లబ్ధిదారులను పరిగణలోకి తీసుకుంటే.. వారి కుటుంబసభ్యులతో కలిపి.. మొత్తం సుమారు కోటి మందికిపైగా ఈఎస్‌ఐ పరిధిలోకి వచ్చే అవకాశం ఉంది. అంటే.. రాష్ట్రంలోని మొత్తం జనాభాలో దాదాపు 25 శాతం మంది వరకు ఈఎస్‌ఐ పరిధిలోకే వస్తారన్నమాట.
ఏటా రూ. 1,500 కోట్ల చందా..
ఈఎస్‌ఐ పరిధిలోకి వచ్చే ప్రతి లబ్ధిదారుని నుంచి.. ప్రతి నెలా ఈఎస్‌ఐ చందాను వసూలు చేస్తారు. అలాగే సదరు లబ్ధిదారుడు పనిచేసే సంస్థ నుంచికూడా చందాను కేంద్ర కార్మిక శాఖ ఆధ్వర్యంలోని ఈఎస్‌ఐకి జమ చేస్తారు. ఒక ఈఎస్‌ఐ చందాదారుడుకి వచ్చే జీతంలోని ప్రతి రూ. 100లకు రూ. 1.75 పైసల చొప్పున ఈఎస్‌ఐ చందాగా వసూలు చేస్తారు. అలాగే సదరు చందాదారునికి జీతం చెల్లించే సంస్థ నుంచి ప్రతి రూ. 100లకు రూ. 3.50 పైసల చొప్పున చందాకు జమచేస్తారు.
అంటే రాష్ట్రంలో ఉన్న 20 లక్షల మంది చందాదారులను పరిగణనలోకి తీసుకుంటే.. సగటున ఒక్కొక్కరి జీతం రూ. 12,500 అనుకుందాం. ఈ లెక్కన ఒక్కొక్క చందాదారుని నుంచి ప్రతి నెలా రూ. 218.75 పైసలు వసూలు చేయడంతోపాటు.. కార్మికుడు, చిరుద్యోగులు పనిచేసే సంస్థ, ఫ్యాక్టరీ నుంచి సగటున రూ. 437.50 పైసల వరకు వసులుచేసి ఈఎస్‌ఐకి జమ చేస్తారన్నమాట.
అంటే ఒక్కో చందాదారుడి తరఫున ప్రతి నెల సుమారు రూ. 656.25 పైసల చొప్పున కేంద్రానికి వెళుతుంది. రాష్ట్రంలోని మొత్తం 20 లక్షల మంది లబ్ధిదారుల నుంచి, వారి కంపెనీల నుంచి వసూలు చేసే మొత్తం నెలకు సుమారు రూ. 130 కోట్ల వరకు ఉంటుందన్నమాట. అంటే సంవత్సరానికి ఎంత లేదన్నా రూ.1,500 కోట్లకు పైగా కేంద్రం ఆధ్వర్యంలోని కార్మిక శాఖ పరిధిలోని ఈఎస్‌ఐ విభాగానికి వెళుతుంది.
రాష్ట్రానికి ఏటా రూ. 250 కోట్లతో సరి..
మన రాష్ట్రంలోని 20 లక్షల మంది లబ్ధిదారులు, వాటి కంపెనీల వాటాగా ఏటా రూ.1,500 కోట్లు కేంద్రానికి వెళుతుంటే.. కేంద్రం మాత్రం రాష్ట్రానికి ఏటా రూ. 250 కోట్ల వరకు మాత్రమే నిధులు ఇస్తోంది. రాష్ట్రంలో ఉన్న సుమారు 70 వరకు డిస్పెన్సరీలు, హైదరాబాద్, వరంగల్‌లలోని జేడీ కార్యాలయాలు, గాంధీ ఆసుపత్రి ఎదుట ఉన్న డైరెక్టరేట్ కార్యాలయం, నాచారం, ఆర్‌సీ పురం లలో ఉన్న ఆసుపత్రుల నిర్వహణ, రాష్ట్ర ఈఎస్‌ఐ పరిధిలో ఉన్న ఉద్యోగుల జీతభత్యాలు, ఉద్యోగుల భర్తీ, వారి పింఛన్లు అన్నీ రాష్ట్ర ప్రభుత్వమే చూసుకోవాల్సి వస్తోంది. కేంద్రం నుంచి వచ్చే రూ.250 కోట్లతో ఈఎస్‌ఐ ఆసుపత్రులు, డిస్పెన్సరీలకు కావాల్సిన మందులు, వాటి నిర్వహణ, కాంట్రాక్టు ఉ ద్యోగులకు జీతభత్యాలకు ఖర్చు పెడుతున్నారు.
రెంటికీ చెడ్డ రేవడిలా.. ఈఎస్‌ఐ..
రాష్ట్రం నుంచి లబ్ధిదారులు, వారి కంపెనీల నుంచి ఏటా చందాల రూపంలో వెళ్ళే రూ. 1,500 కోట్ల నుంచి కేవలం రూ. 250 కోట్లు మాత్రమే రాష్ట్రానికి తిరిగి వస్తుండటంతో.. రాష్ట్ర ప్రభుత్వానికి ఈఎస్‌ఐ ఆసుప త్రులు, డిస్పెన్సరీలను నిర్వహించడం కష్టం గా మారింది. ఉద్యోగులను తామే భర్తీచేసి, జీతభత్యాలు తామే చెల్లించాల్సి రావడంతో.. ఈఎస్‌ఐ నిర్వహణపై రాష్ట్ర ప్రభుత్వానికి నానాటికీ ఆసక్తి సన్నగిల్లుతోంది. అదే సమయంలో ఏటా రూ.1,500 కోట్లను తీసుకుం టున్న కేంద్రం ఆధ్వర్యంలోని కార్మిక సంక్షేమ శాఖ..
కేవలం రాష్ట్రం మొత్తంపై ఎర్రగడ్డలోని ఈఎస్‌ఐసీ ఆసుపత్రిని, మెడికల్ కళాశాలను మాత్రం నిర్వహిస్తూ చేతులు దులుపుకుంటోంది. దీనితో నిధులు వెళ్ళేది కేంద్రానికి.. మొత్తం డిస్పెన్సరీలు, ఆసుపత్రులను చూసుకోవాల్సిన బాధ్యత మాదా అనే ఆలోచన తో ఈఎస్‌ఐ నిర్వహణ నుంచి రాష్ట్ర ప్రభు త్వం తప్పుకోవాలని చూస్తుందనే ఆరోపణలొస్తున్నాయి. కేంద్రం ఇచ్చే రూ.250 కోట్లతో మందులను అందిస్తూ.. డిస్పెన్సరీలు, ఆసుపత్రులను తూతూ మంత్రంగా నిర్వహిస్తోంది. దీనితో ఈఎస్‌ఐ పరిస్థితి రెంటికీ చెడ్డ రేవడిలా తయారయ్యింది.
సంక్షేమం చాటున.. ఆదాయ వనరుగా..
రాష్ట్రంలోని ఈఎస్‌ఐ లబ్ధిదారులు, వారు పనిచేసే కంపెనీలు, ఫ్యాక్టరీల నుంచి ప్రతియేటా వచ్చే సుమారు రూ. 1,500 కోట్లను పూర్తిగా రాష్ట్రంలోని చిరుద్యోగులు, కార్మిక వర్గాలకు ఖర్చుచేస్తే.. ప్రతి జిల్లాలోనూ సూపర్ స్పెషాలిటీ సేవలను అందించవచ్చనే అంచనాలు ఉన్నాయి. కానీ కార్మికులు, చిరుద్యోగుల సంక్షేమాన్ని ఆలోచించాల్సిన కేంద్ర ప్రభుత్వం.. ఎందుకనో.. ఈఎస్‌ఐ అంటేనే చిన్నచూపు చూస్తుందని, పైగా సంక్షేమంచాటున ఆదాయ వనరుగా చూస్తుందనే ఆరోపణలు ఉన్నాయి.
నామమాత్రంగా ఎర్రగడ్డలో ఈఎస్‌ఐసీని నిర్వహిస్తూ.. దానికే ఎంతో చేస్తున్నాం అన్నట్టుగా కేంద్రం వ్యవహరిస్తోంది. ఇదే సందర్భంలో రాష్ట్ర పురోభివృద్ధికి కీలకంగా సేవలు అందిస్తున్న చిరుద్యోగులు, కార్మిక వర్గం సంక్షేమానికి పాటుపడాల్సిన రాష్ట్ర ప్రభుత్వంకూడా.. తమకేమీ సంబంధం లేదన్నట్టుగా వ్యవహరించడంపై తీవ్ర ఆగ్రహంకూడా వెల్లడవుతోంది. రాష్ట్ర ప్రభుత్వం అసలు పట్టించుకోవడం లేదని, ఈఎస్‌ఐ ఆసుపత్రులు, డిస్పెన్సరీలను నిర్వీర్యం చేసేలా వ్యవహరిస్తుందని కార్మిక వర్గం అంటోంది. రెండేండ్లలో ఫార్మాసిస్ట్‌లు అందరూ రిటైర్ అయ్యే అవకాశం ఉంది. అయినా భర్తీ చేయడం లేదు. అవసరమైన మందులు అందుబాటులో లేవు.