27-12-2025 12:00:00 AM
రాజేంద్రనగర్, డిసెంబర్ 26 ( విజయక్రాంతి): రాజేంద్రనగర్ నియోజకవర్గం ఎమ్మెల్యే ప్రకాష్ గౌడ్ గత కొంత కాలంగా చేస్తున్న కృషి ఫలించింది. నియోజకవర్గ ప్రజల సౌకర్యార్థం, పరిపాలనా వికేంద్రీకరణ లక్ష్యంగా ఆయన ప్రతిపాదించిన రాజేంద్రనగర్, శంషాబాద్ కొత్త జోన్ల ఏర్పాటు కావడం పట్ల ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రత్యేక ధన్యవాదాలు... రాజేంద్ర నగర్, శంషాబాద్ ప్రాంతాలను ప్రత్యేక జోన్లుగా చేయడం పట్ల రాజేంద్ర నగర్ నియోజకవర్గం ఎమ్మెల్యే టి. ప్రకాష్ గౌడ్ హర్షం వ్యక్తం చేశారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే ప్రకాష్ గౌడ్ మాట్లాడుతూ ప్రజల చెంతకు పాలనను చేర్చాలనే లక్ష్యంతో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సూచన మేరకు జిహెచ్‌ఎంసి విస్తరణ చేపట్టడం జరిగిందని తెలిపారు. ఇందులో భాగంగానే రాజేంద్రనగర్, శంషాబాద్ ప్రాంతాలను ప్రత్యేక జోన్లుగా ప్రకటించడం పట్ల రాష్ట్ర ముఖ్యమంత్రి హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుతున్నానన్నారు.
గత కొంతకాలంగా ఈ జోన్ల ఏర్పాటు కోసం ప్రభుత్వంతో నిరంతరం సంప్రదింపులు జరపడం వల్లనే సాధ్యమైందన్నారు. కొత్త జోన్ల ఏర్పాటుతో పౌర సేవలు మరింత వేగంగా, పారదర్శకంగా ప్రజలకు అందుతాయని ఆయన ధీమా వ్యక్తం చేశారు. శంషాబాద్, రాజేంద్రనగర్ ప్రాంతాలు శరవేగంగా అభివృద్ధి చెందుతున్న తరుణంలో, ఈ కొత్త జోన్లు మౌలిక సదుపాయాల మెరుగుదలకు ఎంతగానో దోహదపడతాయని పేర్కొన్నారు. అనుకున్నది సాధించి, నియోజకవర్గ అభివృద్ధికి అహర్నిశలు శ్రమిస్తున్న ఎమ్మెల్యే ప్రకాష్ గౌడ్ ను ఈ సందర్భంగా స్థానిక నాయకులు, కార్యకర్తలు, ప్రజలు అభినందించారు.