27-12-2025 12:00:00 AM
శేరిలింగంపల్లి, డిసెంబర్ 26(విజయక్రాంతి): సంక్రాంతి పర్వదినాన్ని పురస్కరించుకుని మహిళల సృజనాత్మకతకు వేదికగా ఫ్రెండ్స్ వెల్ఫేర్ అసోసియేషన్, కొమిరిశెట్టి ఫౌండేషన్ సంయుక్త ఆధ్వర్యంలో శేరిలింగంపల్లి జంట సర్కిళ్ల పరిధిలోని 35 కాలనీల్లో ముత్యాల ముగ్గుల పోటీలు నిర్వహిస్తున్నారు.ప్రతి కాలనీలో విడివిడిగా నిర్వహించే ఈ పోటీల్లో ప్రతిభ కనబరిచిన మహిళలకు ప్రథమ,ద్వితీయ,తృతీయ బహుమతులతో పాటు ఐదు ప్రోత్సాహక బహుమతులు అందజేయనున్నారు.
ఇందులో భాగంగా హఫీజ్పేట గ్రామంలో మహిళలకు ముగ్గుల పోటీలు నిర్వహించగా మంచి స్పందన లభించింది. పోటీల అనంతరం విజేతలకు బహుమతులు అందజేశారు. ఈ సందర్భంగా కొమిరిశెట్టి ఫౌండేషన్ అధ్యక్షుడు కొమిరిశెట్టి సాయిబాబా, ఫ్రెండ్స్ వెల్ఫేర్ అసోసియేషన్ కన్వీనర్ తాడిబోయిన రామస్వామి యాదవ్ మాట్లాడుతూ పరిశుభ్రత, ఆరోగ్యం, సాంస్కృతిక అలంకరణల సమ్మేళనమే ముగ్గులని పేర్కొన్నారు.
ఈ పోటీల ద్వారా మహిళల్లో దాగి ఉన్న సృజనాత్మక ప్రతిభ వెలుగులోకి వస్తుందని, పట్టణీకరణతో మారుతున్న జీవనశైలిలో భారతీయ సంస్కృతి, సంప్రదాయాలను నేటి తరం కూడా కొనసాగించాలనే ఉద్దేశంతో ఈ కార్యక్రమాలు చేపడుతున్నామని తెలిపారు. గోమయంతో కళ్లాపి జల్లి బియ్యపుపిండితో ముగ్గులు వేయడం వల్ల పరిసరాలు పరిశుభ్రంగా ఉండటంతో పాటు క్రిమికీటకాలు నివారించబడతాయని,
ఈ ప్రక్రియ శరీరానికి సహజ వ్యాయామంగా మారి మహిళల ఆరోగ్యానికి కూడా మేలు చేస్తుందని వైద్యుల అభిప్రాయాన్ని గుర్తు చేశారు. ఈ పోటీల్లో విజయలక్ష్మి, రమ్య విజేతలను ఎంపిక చేయగా మొత్తం 25 మంది మహిళలు పాల్గొన్నారు. కార్యక్రమంలో స్థానిక మహిళా నాయకులు ఆషా, రాధతో పాటు ఫ్రెండ్స్ వెల్ఫేర్ అసోసియేషన్ సభ్యుడు అమ్మయ్య చౌదరి తదితరులు పాల్గొన్నారు.