15-12-2025 01:01:18 AM
* జ్వాలాముఖి క్లిష్టమైన భావజాలాన్ని సైతం ప్రజలకు సులభంగా అర్థమయ్యే రీతిలో పౌరాణిక ప్రతీకలతో, ఉపమానాలతో చెప్పేవారు. అధ్యాపకుడిగా పాఠాలు చెప్పినా, జీవిత పాఠాలు చెప్పడమే ఆయన ప్రవృత్తిగా స్వీకరించారు. ఉద్యమాలతోనే జీవన యానం సాగించిన ఆయన, శ్రీశ్రీతో కలిసి పౌరహక్కుల కోసం రాష్ట్రమంతా పర్యటించారు. పీడీ చట్టం కింద అరెస్టై జైలు జీవితాన్ని గడిపారు.
పగులుతున్న జాతిదర్పణంలో
మహాత్ముల త్యాగఫలం
నిష్ఫలమై స్రవిస్తున్నది
వైపరీత్యం కొలకుల్లో
మొలిచిన పరితాప కుసుమాలు
ఆరాటం ఆల్చిప్పల్లోకి
జాలిగా నవ్వి జారిపోతున్నాయి.. ’
... అంటూ తెలుగు సాహిత్యంలో విప్లవ స్వరాన్ని, అక్షరాల్లో అగ్నిజ్వాలను మండించిన అక్షరయోధుడు జ్వాలాముఖి. ఆయన ఉపన్యాసం బద్ధలయ్యే అగ్నిపర్వతంలా, జీవితం నిత్యం ప్రజలకోసం జ్వలించే అగ్నిశిఖలా ఉంటుంది. ఫక్తు సంప్రదాయ కుటుంబం నుంచి వచ్చినప్పటికీ, ఆయన పయనం విప్లవం వైపు సాగింది. ఈయన దిగంబర కవుల్లో ఒకరు. మిగతా వారు నగ్నముని, మహాస్వప్న, నిఖిలేశ్వర్, భైరవయ్య, చెరబండరాజు.
జ్వాలాముఖి అసలు పేరు వీరవెల్లి రాఘవాచార్య 1938 ఏప్రిల్ 12న జన్మించారు. ఆయన స్వస్థలం మెదక్ జిల్లాలోని ఆకారం గ్రామం. ఆయన కుటుంబం తర్వాత హైదరాబాద్‌కు వలసొచ్చింది. వారి కుటుంబం సీతారాంబాగ్‌లో నివసించేది. బాల్యంలోనే జ్వాలాముఖి తాము నివసించే దేవాలయ ప్రాంగణంలోని పేద అర్చకుల స్థలాల సమస్యపై పోరాటం చేసి, బాల్యంలోనే ఆయన ప్రజల ప్రేమను చూరగొన్నారు.
మొదట న్యాయశాస్త్రం అభ్యసించినప్పటికీ, తన జీవితాన్ని పూర్తిస్థాయిలో సాహిత్యానికే అంకితం చేశారు. సుదీర్ఘ కాలం పాటు అధ్యాపకుడిగా కొనసాగారు. ఆయన సాహిత్య జీవితం 1958లో ‘మనిషి’ అనే దీర్ఘ కవితతో ప్రారంభమైంది. స్వీయాత్మక సంస్కరణ వాదంతో మొదలైన ఈ రచన పెద్దల ప్రశంసలను అందుకుంది.
అప్పట్లో ఆయన ‘వీరా’ అనే కలం పేరుతో కొన్ని పాటలు కూడా రాశారు. సమాజంలోని కుళ్లును చూసి, సంకుచితత్వాన్ని నిరసించి, ఆయన క్రమంగా దిగంబర కవిత్వం వైపు మళ్లారు. కళాశాల అధ్యాపకుడిగా పనిచేస్తూ, తన జీవితాన్ని మాత్రం సాహిత్యానికే, సామాజిక పోరాటాలకే అంకితం చేశారు. తొలుత నాస్తికవాదాన్ని స్వీకరించి, క్రమంగా మార్క్సిజం, మానవతావాదం వంటి విప్లవ భావజాలాల వైపు పయనించారు.
ఆరుగురు దిగంబర కవుల్లో ఒకరు..
జ్వాలాముఖి మరో ఐదుగురు కవులు కలిసి 1965లో ఆయన దిగంబర కవిగా రూపాంతరం చెం దారు. ఆయన దిగంబర కవిత్వం ‘సూర్యస్నానం’ తో మొదలైంది. ఈ కవిత్వంలోనే ఆయన విశ్వమానవతావాద పతాకాన్ని ఎగురవేశారు. ‘కిందపడ్డ నగ్న కళేబరాన్ని ఐరాసకు ఎంబ్లమ్’గా చేయాలనుందని తన కవితలో వ్యక్తం చేశారు. అనంతరం ఆయన నక్సల్బరీ ఉద్యమ ప్రభావంతో విప్లవ కవిగా మారారు. దోపిడీ వ్యవస్థే ప్రజల కడగండ్లకు మూలకారణమని గ్రహించారు. ఆయన విప్లవ కవిత్వాన్ని ‘ఓటమి తిరుగుబాటు’ కవితా సంపుటిలో పొందుపరిచారు. విప్లవ రచయితల సంఘం (విరసం) ఆవిర్భావంలో జ్వాలాముఖి చోదకశక్తిగా పనిచేశారు. విరసంతో విభేదించి, తర్వాత ఆయన జనసాహితిని స్థాపించారు.
వాగ్ధాటి అమోఘం
జ్వాలాముఖి ఉపన్యాసం, వాగ్ధాటి ఆయనకు జీవలక్షణం. ఆయన మాటల జలపాతం శ్రోతలను మంత్రముగ్ధులను చేసేది. ఎలాంటి భేషజాలు లేకుండా, నిర్భయంగా మాట్లాడేవారు. క్లిష్టమైన భావజాలాన్ని సైతం ప్రజలకు సులభంగా అర్థమయ్యే రీతిలో పౌరాణిక ప్రతీకలతో, ఉపమానాలతో చెప్పేవారు. అధ్యాపకుడిగా పాఠాలు చెప్పినా, జీవిత పాఠాలు చెప్పడమే ఆయన ప్రవృత్తిగా స్వీకరించారు. ఉద్యమాలతోనే జీవన యానం సాగించిన ఆయన, శ్రీశ్రీతో కలిసి పౌరహక్కుల కోసం రాష్ట్రమంతా పర్యటించారు. పీడీ చట్టం కింద అరెస్టై జైలు జీవితాన్ని గడిపారు.
తాను ఎల్లప్పుడూ మనుషుల పట్ల అచెంచల ప్రేమను కలిగి ఉండేవారు. తన భావజాలంతో విభేదించేవారితో కూడా ఆత్మీయంగా వ్యవహరించేవారు. ఒక్క కవిగానే కాకుండా ఆయన నవలాకారుడిగా, అనువాదకుడిగాను గొప్ప సేవ చేశారు. ఉరిశిక్షపై వచ్చిన తొలి నవల ‘వేలాడిన మందారం’ అప్పట్లో ఒక సంచలనం. కథకుడిగా ఆయన రాణించారు. ‘పంజరం ఎగిరిపోయింది’ కథ స్వాతి పత్రిక మొదటి బహుమతిని గెలుచుకుంది. కేంద్ర సాహిత్య అకాడమీ కోసం శరత్ చంద్ర ఛటర్జీ జీవిత చరిత్రను ‘దేశదిమ్మరి ప్రవక్త’ పేరుతో అనువదించారు.
సమసమాజం కోసం తపన
‘హత్యలు, ఆత్మహత్యలు వర్గసమాజం దినచర్యలు‘ అని ఆయన నిరసించారు. వర్గాలు లేని మానవ స్వర్గాలను కలలు కన్నారు. 2002లో గుజరాత్ మత కల్లోలాల సందర్భంగా అక్కడి బాధితులను స్వయంగా ఓదార్చారు. ఆ దారుణ సంఘటనలను చూసి చలించిపోయి, ‘భస్మ సింహాసనం’ అనే సుదీర్ఘ కావ్యాన్ని రాశారు. ఈ రచనలో ఆయన ధర్మాగ్రహాన్ని తీవ్రంగా ‘నమస్తే సదా హత్యలే మాతృభూమి / నిస్సిగ్గు దగ్ధభూమి/ తెగిపడిన ఆర్తనాదాలు దయలేని వందేమాతరాలు’ అంటూ వ్యక్తం చేశారు.
జ్వాలాముఖి భారత్-చైనా మిత్రమండలి జాతీయ ఉపాధ్యక్షుడిగా కూడా రెండు దేశాల మైత్రి కోసం అవిశ్రాంతంగా శ్రమించారు. ఆయన బాల్యానికి రక్షణ, యవ్వనానికి క్రమశిక్షణ, వార్ధక్యానికి పరిరక్షణ కల్పించగల వ్యవస్థే సోషలిస్టు సమాజం అని ప్రబోధించారు. చివరి క్షణం వరకు పాలకవర్గాలపై నిప్పులు కురిపిస్తూ ప్రజలకోసం తన శక్తిసామర్థ్యాలను ధారపోసిన జ్వాలాముఖి 2008 డిసెంబర్ 14న శాశ్వత నిద్రలోకి జారుకకున్నారు. ఆయన భౌతికంగా మన మధ్య లేకపోయినా, ఆయన ఆలోచనలు, రచనలు, ఆయన ఆశించిన సమసమాజ స్థాపన కోసం మార్గదర్శకంగా, నిత్యం జ్వలించే అగ్ని శిఖలా తెలుగు సాహితీ చరిత్రలో చిరస్మరణీయంగా నిలిచిపోయాయి.
చివరి వరకు పాలకవర్గాలపై నిప్పులు కురిపిస్తూ, ప్రజలకోసం నిద్రలేని రాత్రులు గడిపిన విప్లవ స్వాప్నికుడు జ్వాలా ముఖి. కవిత్వం, సాహిత్యం ప్రజల కోసమే, సమ సమాజ స్థాపన కోసమే అని నమ్మిన వ్యక్తి ఆయన. తాను ఆశించిన సోషలిస్టు సమాజం ‘బాల్యానికి రక్షణ, యవ్వనానికి క్రమశిక్షణ, వార్ధక్యానికి పరిరక్షణ‘ కల్పించగలదని బలంగా నమ్మేవారు. జ్వాలాముఖి భౌతికంగా లేకపోయినా, ఆయన ఆలోచనలు, రచనలు, ముఖ్యంగా పీడిత జన పక్షాన చిరస్థాయిగా నిలుస్తాయి.
రతన్ రుద్ర
7842195755