calender_icon.png 20 December, 2025 | 2:46 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

స్క్రబ్ టైఫస్‌తో జాగ్రత్త!

16-12-2025 12:00:00 AM

దేశ వ్యాప్తంగా వివిధ రాష్ట్రాల్లో ప్రస్తుతం ‘స్క్రబ్ టైఫస్‌” వ్యాధి ప్రమాదకరంగా మారింది. ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాల్లో దీని దుష్ర్పభావం అధికంగా కనిపిస్తున్నది. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, తమిళనాడు, రాజస్థాన్, ఉత్తర్ ప్రదేశ్, హిమాచల్ ప్రదేశ్, అస్సాం, కర్నాటక, మిజోరాం, మహారాష్ర్ట, హర్యానా, జమ్మూకశ్మీర్, మధ్యప్రదేశ్ లాంటి రాష్ట్రాల్లో ‘స్క్రబ్ టైఫస్’ కేసులు రోజు రోజుకు పెరిగిపోతున్నాయి. తగిన చికిత్స అందకపో తే ప్రాణాంతకంగా మారే అవకాశముందని వైద్యులు హెచ్చరిస్తున్నారు.

‘ఓరియంటియా సుట్సుగముషి’ అనే బ్యాక్టీరియా వల్ల స్క్రబ్ టైఫస్ వ్యాధి వస్తుంది. ‘లెప్టోట్రోంబిడియం డెలియెన్స్’అనే మైట్ లార్వా (సుబ్స్ కీట కం) కుట్టడం ద్వారా ఈ వ్యాధి సంక్రమిస్తున్నది. పశువులు, పొదలు, గడ్డి, తేమ ఉన్న నేలలు, అడవి అంచు ప్రాంతాల్లో అధికంగా కనిపించే ‘చిగ్గర్ మైట్’ కీటకాలు పొలం పనులు, గడ్డి కోసే రైతులు, పశువుల కాపరులు, అడవుల్లో పని చేసే శ్రామికులు, బయట ఆడుకునే పిల్లలకు ఈ కీటకం ప్రమాదకారి కావచ్చు.

ఈ కీటకం మనిషిని కుడితే శరీరంపై నల్లని మచ్చ, దద్దుర్లు ఏర్పడుతాయి. వారం, పది రోజుల తర్వాత జ్వరం, వణుకు, తలనొప్పి, కండరాల నొప్పులు, జీర్ణ సమస్యల రూపంలో ఇన్‌ఫెక్షన్ బయ టపడుతుంది. అయితే ఇది అంటువ్యాధి కాకపోవడం కాస్త ఉపశమనం అని చెప్పొచ్చు.

సకాలంలో గుర్తించి చికిత్స చేయించకపోతే తీవ్ర శ్వాస సంబంధిత సమస్యలు (ఏఆర్‌డీఎస్), మెదడు, వెన్నెముక ఇన్‌ఫెక్షన్లు (మెనింజైటిస్), మూత్రపిండాల వైఫల్యానికి దారి తీస్తుంది. పేడ పురుగుల నుంచి కూడా ఈ బ్యాక్టీరియా ఉద్భవిస్తుందని గమనించారు. వ్యాధి లక్షణాల్లో ముఖ్యంగా వాంతులు, శరీరంపై నల్లని మచ్చలు, బలహీనత, జ్వరం, ఒళ్లు నొప్పులు, తలనొప్పి, గొంతులో ఇబ్బంది లాంటివి కనిపిస్తాయి. 

ఈ వ్యాధి ఎక్కువగా అక్టోబర్ నుంచి డిసెంబర్ నెలల్లో ఎక్కువగా కనిపిస్తుంది. ప్రస్తుతం స్క్రబ్ టైఫస్‌కు ఎలాంటి టీకా అందుబాటులో లేదు. ఈ వ్యాధికి సంబంధించిన టీకాను అభివృద్ధి చేయలేదు. అయితే ‘డాక్సిసైక్లిన్’ అనే యాంటీ బయాటిక్‌ను ప్రత్యామ్నాయంగా చికిత్సకు ఉపయో గిస్తున్నారు. కేవలం 2025 ఏడాదిలో ఆంధ్రప్రదేశ్ రాష్ర్ట శ్రీకాకుళం జిల్లాలో 34 కేసుల నమోదు కేసులు బయట పడడమే కాకుండా రాష్ర్టవ్యాప్తంగా 1,566 మందికి పాజిటివ్ రావడంతో ప్రజలు గజగజ వణుకు తున్నారు.

ఇటు తెలంగాణలోనూ స్క్రబ్ టైఫస్ కేసుల సంఖ్య పెరుగుతుండడం ఆందోళన కలిగిస్తున్నది. ఈ క్రమంలో సమయానికి పరీక్షలు చేయిం చుకోవడంతో పాటు తగు జాగ్రత్తలు తీసుకోవడం అనివార్యమని వైద్యు లు సూచిస్తున్నారు. స్క్రబ్ టైఫస్ వ్యాధి ప్రమాదకరం కాకపోయినా, సాధారణ జ్వరం వచ్చిన సందర్భంలో వెంటనే వైద్య పరీక్షలు చేయించుకొని తగిన చికిత్సలు పొందాలని వైద్య నిపుణులు సూచిస్తున్నారు.

ఏమీ కాదని అలసత్వం చేసిన సందర్భాల్లో ప్రాణాలు పోయే అవకాశముందని, కాబట్టి వ్యాధి పట్ల జాగ్రత్తగా ఉండడం అవసరమని ప్రజలకు హెచ్చరికలు జారీ చేస్తున్నారు. ఈ వ్యాధి పిల్లలపై ఎక్కువ ప్రభావం చూపే ప్రమాదం ఉన్నందున కాళ్లు, చేతులు కప్పి ఉంచేలా దుస్తులు వేసి తగిన జాగ్రత్తలు తీసుకోవాలి.

 బుర్ర మధుసూదన్ రెడి, 9949700037