calender_icon.png 20 December, 2025 | 5:56 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ఉప్పరుల అస్తిత్వం ‘మెట్న’

15-12-2025 12:57:51 AM

సుతారి పని సున్నితమైన పని. అతడి చేతి మెట్న దిక్కులను సరిజేసే ఆయుధం. ఇల్లు కట్టడానికి కంకర బెందడేసి ఇటుకపై ఇటుకతో అంతస్థుల మేడలను కట్టిన ఉప్పరులు సగరులు..ఆధునిక ఇంజినీర్లు.. కట్టడాలకు కార్యసిద్ధులు.  మట్టితో గూడు నిర్మించి ప్రకృతి నుంచి క్రూరజంతువుల నుంచి మనల్ని రక్షించిన సగరులెంతో ప్రశంసనీయులు. వారికి నమస్కారం. మనకు ముల్లు గుచ్చుకుంటే ‘అబ్బా..’ అని ఏడుస్తాం. మన గాయానికి ఎదుటివారు ఎలా బాధపడతారు.

అందుకే ఎవరి బాధలు వారు చెప్పుకోవాలి. ఎవరి గాయాలు వాళ్లు రాయాలి. ఇతరుల బాధలు కూడా పంచుకోవాలి. అప్పుడే ఒక కవి ప్రజాకవి అవుతాడు. సరిగ్గా అలాంటి కవి ఉప్పరి తిరుమలేష్. ‘మెట్న’ పేరుతో తాను సగరుల జీవితాన్ని వస్తువుగా స్వీకరించి శ్రామిక సౌందర్యాన్ని కవితామయం చేశాడు. అతడి నాయన కులవృత్తి మేస్త్రీ సుతారి పని. నాన్న చేస్తున్న పనిని తిరమలేష్ కళ్లారా చూశాడు.

ఆ అనుభవాలనే కవి ‘ఇంట్లో అందరి ఆయువు /నాలుగు కాలాలు ఉండాలంటే ఇల్లు ఆయం ఖాయంగా ఉండాలి.. సాయం  చేయడం గొప్ప కళ/ ఇంటికి ఆయనే అంతరాత్మ/ఉప్పరు గీతలే/ఇంటి నుదుటిరాతలు..’ అంటూ కవి శ్రమైక జీవన సౌందర్యాన్ని వర్ణిస్తాడు. అంతస్తులు మేడలు ఎన్నెన్నో అపురూపాలన్నీ సగరులు కట్టినవే. ప్రగతివాదంతో సామాజిక ప్రయోజనం నెరవేర్చేటందుకు కవి సహజంగా ఉప్పరుల జీవితాన్ని, వారు వలసపోయిన దుఃఖాన్ని ఆవిష్కరించాడు.

ఉప్పరుల బతుకు పోరులో ‘సైకిల్ తీరం చేర్చే నావ’ అని, సైకిలే తమ బతుకు రథమని పేర్కొంటాడు. తమ పనిలో భాగమైన వాహనం సైకిల్ అని కొనియాడుతాడు. ‘సమ న్యాయం మా అంతరాత్మ/ భగీరథుడు మా పరమాత్ముడు/’ అంటూ కులదైవాన్ని తలచుకుంటాడు. ఉప్పరుల చేతిలోని సంజీవిని సలికెపార/ జాతీయ రహదారులు మా జాతి శ్రమ ప్రతిరూపాలు/ ఆధునిక గిజిగాళ్లు ఉప్పరులు/ నవభారత ఇంజినీర్లు ఉప్పరులు’ అంటూ సుతారుల పని నైపుణ్యాన్ని అక్షరబద్ధం చేశాడు.

చదువు లేకుండానే వాస్తు నిర్మాణాన్ని ఇంటి నిర్మాణాన్ని తూర్పు పడమర, వాయువ్వ, నైరుతీ దిక్కులను తేలుస్తారంటూ ఉప్పరులను వర్ణించాడు. నాగరికత అభివృద్ధిలో లేనప్పుడే కరెంట్ మోటర్లు కళ్లు తెరవకముందే.. ఉప్పరులు ఊరబాయికి మోటలు కట్టిన విషయాన్ని గుర్తుచేశాడు. వారి జీవితాల్లోని ఉషోదయాన్ని అక్షరమక్షరం చరిత్రకెక్కించాడు. వారు కట్టిన కట్టడాలు ప్రపంచ ప్రసిద్ధిగాంచినవి కానీ, ఇవాళ ఉప్పర్లకు నిలువ నీడ లేదు.

నిత్యం ఏదో ఒక చోట ఉప్పరులు పని ప్రదేశాల్లో ప్రమాదాల బారిన పడుతున్నారు. వారికి జీవిత బీమాలేక వారి కుటుంబాలు రోడ్డున పడుతున్నాయి. వారి జీవితమంతా అడా మీద కూలీలుగానే బతుకుతున్నారు. అర్ధాకలితో అలమటిస్తున్నారు. ప్రపంచీకరణ ప్రపంచంలో అణచివేతను చవి చూస్తూ కాలమెల్లదిస్తున్నారు. ఆ సంగతులన్నింటినీ కవి బాధతో మేస్త్రీ లకు మేలు చేసే నాయకులెవరని నిలదీశాడు. ఉప్పరి తిరుమలేష్‌ది వనపర్తి జిల్లా.

వృత్తిరీత్యా ఆయన ప్రైవేట్ గా తెలుగు అధ్యాపకుడు. ఉన్నత చదువులు చదివి కూడా పాఠాలు చెప్తూ బతుకు వెల్లదీస్తున్నాడు. అయినా నిరాశ పడలేదు.. కవిగా ఆయన కవిత్వం రాస్తున్నాడు. సామాజిక కార్యక్రమాలను నిర్వహిస్తున్నాడు. ఒక కవి బాధ ఇతరులకు రుచించకపోవచ్చు. అర్థమైనా అర్థం కానట్లు నటించవచ్చు. ఇప్పుడు ఈ కవిత అవసరమా అనిపించవచ్చు కానీ గతం లేకుండా వర్తమానం లేదు అలా అని గతాన్ని విధ్వంసం చేయలేం. గతం బాగు కోసం వర్తమానంలో కూడా ప్రభుత్వాలు చేయూతల్ని అందించాలి. 

వనపట్ల సుబ్బయ్య

9492765358