29-10-2025 01:39:55 AM
-బంగారు తెలంగాణ పేరుతో కేసీఆర్ కుటుంబాన్ని బంగారం చేసుకున్నాడు
-జూబ్లీహిల్స్ ప్రచారంలో కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి
హైదరాబాద్ సిటీ బ్యూరో, అక్టోబర్ 28 (విజయక్రాంతి): కాంగ్రెస్, బీఆర్‌ఎస్ రెండూ మోసకారి పార్టీలే అని, బంగారు తెలంగాణ పేరుతో కేసీఆర్ కుటుంబాన్ని బంగారం చేసుకున్నాడు, ఎంఐఎంతో కలిసి హైదరాబాద్‌ను కబ్జా చేసే ఆలోచనలో కాంగ్రెస్ ఉన్నదంటూ కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి విమర్శించారు. జూబ్లీహిల్స్ అసెంబ్లీ ఉప ఎన్నిక లో మంగళవారం ఎల్లారెడ్డిగూడలో నిర్వహించిన ప్రచార సభలో ఆయన అధికార కాంగ్రెస్, బీఆర్‌ఎస్‌లపై తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు.
“గతంలో ఇక్కడ గెలిచిన బీఆర్‌ఎస్ పార్టీ తెలంగాణను నట్టేట ముంచింది. బంగారు తెలంగాణ అని చెప్పి, కేసీఆర్ తన కుటుంబాన్ని బంగారం చేసుకున్నారు. ఆయ న ఇంట్లో అందరికీ ఉద్యోగాలు వచ్చాయి, కానీ తెలంగాణ యువకులకు ఒక్క ఉద్యోగం కూడా రాలేదు. డబుల్ బెడ్రూం ఇళ్లు, హైదరాబాద్‌ను సింగపూర్ చేస్తామన్న హామీలన్నీ నీటిమూటలయ్యా యి” విమర్శించారు. “ఇప్పుడు కాంగ్రెస్ అధికారంలోకి వచ్చి రెండేళ్లు కావస్తున్నా, జూబ్లీహిల్స్‌లో అభివృద్ధి శూన్యం. పేరుకే ఇది ధనవంతుల నియోజకవర్గం.
కానీ ఇక్కడి ప్రజలు కనీస వసతుల్లేక నరకం చూస్తున్నారు” అని ఆవేదన వ్యక్తం చేశారు. జూబ్లీహిల్స్ కాంగ్రెస్ అభ్యర్థిని ఎంపిక చేసింది ఎంఐఎం అధినేతలని విమర్శించారు. గతంలో కేసీఆర్ ఎంఐఎంను భు జాలపై మోస్తే, ఇప్పుడు కాంగ్రెస్ అదే పనిచేస్తోందని మండిపడ్డారు. కాంగ్రెస్, బీఆర్‌ఎస్, ఎంఐఎం ఈ మూడు పార్టీలూ ఒక్కటేనన్నారు. పాతబస్తీలో మం త్రులు పర్యటించా లంటే దారుస్సలాం అనుమతి తీసుకోవాలని, కాంగ్రెస్ గెలిస్తే జూబ్లీహిల్స్‌లోనూ అదే పరిస్థితి వస్తుందని హెచ్చరించారు. “మోదీ పాలనలో ఒక్క రూపాయి అవినీతి లేదు.
అయోధ్యలో రామ మందిర నిర్మాణం, ఆర్టికల్ 370 రద్దు చేసి కశ్మీర్‌లో అంబేద్కర్ రాజ్యాంగాన్ని అమలు చేసింది మోదీ ప్రభుత్వమే. సికింద్రాబాద్, చర్లపల్లి, బేగంపేట్ రైల్వే స్టేషన్ల అభివృద్ధి, బస్తీ దవాఖానాలు, మధ్యాహ్న భోజన పథకాలకు నిధులు ఇస్తున్నది కేంద్ర ప్రభుత్వమే” అని ఆయన గుర్తుచేశారు. “సానుభూతితో ఓట్లు వేస్తే, మన భవిష్యత్తు ఇతరుల సానుభూతిపైనే ఆధారపడిపోతుంది. జూబ్లీహిల్స్ నియోజకవర్గం నిజమైన అభివృద్ధి పథంలో పయనించాలంటే బీజేపీని గెలిపించండి” అని కిషన్‌రెడ్డి ప్రజలకు విజ్ఞప్తి చేశారు.