29-10-2025 12:57:57 AM
రాష్ట్ర వ్యవసాయ మార్కెటింగ్ శాఖలో అవినీతి రాజ్యం
* ఒక్కో మార్కెట్ కమిటీ రూ. 30 వేలవరకు ఆమ్యామ్యాలు ఇవ్వాలి. అంతేకాదు.. ఇటీవల సస్పెండ్ అయిన కొందరు అధికారుల నుంచి ‘మీ సస్పెండ్‌ను, విజిలెన్స్ నివేదికలను ఆపుతా’నంటూ సదరు ‘కమీషన్ కింగ్’ రూ.77 లక్షల వరకు వసూలు చేసినట్లుగా ఆరోపణలున్నాయి.
* వ్యవసాయ మార్కెటింగ్ శాఖలో అవినీతి రాజ్యమేలుతున్నది. సంబంధిత శాఖ మంత్రి పేరు చెప్పి.. మార్కెట్ కమిటీ కార్యదర్శులకు టార్గెట్ పెడుతున్నారు. ‘కప్పం కట్టకుంటే వేటే’ అన్నట్లుగా కిందిస్థాయి అధికారులకు మార్కెటింగ్ శాఖ ఉన్నతాధికారులు హుకుం జారీచేస్తున్నారు. వరంగల్ రీజియన్‌కు చెందిన ఒక ఉన్నతాధికారి తీరు మాత్రం అందరికంటే భిన్నంగా ఉన్నట్లుగా చర్చ జరుగుతోంది.
ఆయన కిందిస్థాయి అధికారులపై బెదిరింపులకు పాల్పడుతున్నట్లుగా తెలుస్తోంది. ఆ ఉన్నతాధికారి జిల్లాల పర్యటనకు వెళ్లాడంటే.. అధికారి వాడే వాహనానికి డీజిల్‌తో పాటు సకల సపర్యలు చేయాల్సిందే. అంతేకాకుండా ఆయా మార్కెట్‌లో జరిగే క్రయ, విక్రయాల ఆధారంగా కమీషన్లు అప్పచెప్పాల్సిందేనని, లేదంటే మార్కెట్ కమిటీ కార్యదర్శులు, ఇతర అధికారులు, సిబ్బంది వేధింపులు ఎదుర్కోవాల్సివస్తున్నదని సిబ్బంది ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
ఇదిలాఉంటే, గత సీజన్‌లో పత్తి కొనుగోలుకు విషయంలోనూ కమీషన్ రూపంలో రూ. కోట్లలో వసూలు చేసినట్లుగా వినిపిస్తోంది. వీటన్నింటికి సంబంధిత శాఖ మంత్రి పేరును వాడుకోవడం, పై స్థాయి వరకు ఖర్చుల కోసం పంపించాల్సి ఉంటుందని సదరు అధికారి సమర్థించుకుంటున్నారనేది మార్కెటింగ్ శాఖలో చర్చగా మారింది. అయితే వీటన్నింటిని భరించలేక ఆధారాలతో సహా ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేసేందుకు వ్యవసాయ మార్కెటింగ్ శాఖలోని బాధితులు సిద్ధ్దమవుతున్నట్లుగా విశ్వసనీయ సమాచారం.
సదరు ఉన్నతాధికారి రూ. వందల కోట్ల వరకు అక్రమంగా సంపాదించుకుని విల్లాలు, ప్లాట్లు కొనుగోలు చేశారనే ఆరోపణలు కూడా ఉన్నాయి. సదరు అధికారి ఎవరికి ఫోన్ చేసినా వాట్సాప్ కాల్ మాత్రమే మాట్లాడుతారు. సదరు అధికారితో పాటు మరో అధికారిణి కూడా అంతేస్థాయిలో వసూళ్లకు పాల్పడుతున్నారని ఆరోపణలున్నాయి.
హైదరాబాద్, అక్టోబర్ 28 (విజయక్రాంతి) : రాష్ట్రంలో 198 వ్యవసాయ మార్కెట్ కమిటీలు ఉన్నాయి. వీటిలో హైదరాబాద్ రీజియన్‌లో హైదరాబాద్, రంగారెడ్డి, మెదక్, మహబూబ్‌నగర్, నిజమాబాద్ జిల్లాల్లో 59 మార్కెట్ కమిటీలు ఉండగా, వరంగల్ రీజియన్‌లో వరంగల్, నల్లగొండ, ఖమ్మం, కరీంగనర్, అదిలాబాద్ జిల్లాల్లో 139 వ్యవ సాయ మార్కెట్ కమిటీలు ఉన్నాయి. హైదరాబాద్ పరిధిలోని మార్కెట్ యార్డుల్లో వరి, మొక్కజొన్నతో పాటు పత్తి కూడా ప్రభుత్వం కొనుగోలు చేస్తున్నది.
వరంగల్ పరిధిలోని మార్కెట్ యార్డుల్లో పత్తి, వరి, మొక్కజొన్నతో పాటు మిగతా పంట దిగుబడులను లక్షల క్వింటాళ్లలో కొనుగోళ్లు జరుగుతుంటాయి. అయితే వరంగల్ రీజియన్ పరిధిలోని ఒక ఉన్న తాధికారి వ్యవహారం మాత్రం అడిందే ఆట, పాడిందే పాటగా మారిందని, తనకు ఎదురే లేదన్నట్లుగానే వ్యహారం ఉందనే చర్చ జరుగుతోంది. సదరు అధికారి జిల్లా పర్యటనకు వెళ్లాడంటే ఆయా జిల్లాల పరిధిలోని వ్యవసాయ మార్కెట్ శాఖ కార్యదర్శుల, ఇతర సిబ్బంది పెద్దఎత్తున స్వాగతం పలకడమే కాకుండా.. ఆయనకు ఆయా మార్కెట్‌లోని కోనుగోళ్ల పరిస్థితిని బట్టి కప్పం కట్టాల్సి ఉంటుందని చెబుతున్నారు.
ఒక్కో మార్కెట్ కమిటీ కనీసం రూ. 10 వేల నుంచి రూ. 30 వేల వరకు సర్దాల్సి ఉంటుందని, ఒక వేళ ఎవరైనా డబ్బులు సర్దకపోతే ఆ మార్కెట్‌లో అక్రమాలు, భారీగా అవినీతి జరుగుతున్నదని, వేధింపులకు గురిచేయడం పరిపాటిగా మారిందని సిబ్బంది ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అంతేకాకుండా ఇటీవలనే సస్పెండ్ అయిన కొందరు అధికారుల నుంచి కూడా.. మీ సస్పెండ్‌ను, విజిలెన్స్ నివేదికలను ఆపుతానంటూ రూ. 77 లక్షల వరకు వసూలు చేసినట్లుగా ఆరోపణలు వినిపిస్తున్నాయి.
పత్తి కొనుగోళ్లలోనూ రూ. కోట్లలో చేతి వాటం..
గతేడాది పత్తి కొనుగోలులోనూ రూ.10 కోట్లకు పైగానే కమీషన్ల పేరుతో సంపాదించాడని సంబంధిత శాఖకు చెందినవారే చర్చించుకుంటున్నారు. వరంగల్ రీజియన్ పరిధిలోని ఐదు ఉమ్మడి జిల్లాలు ఆదిలాబాద్, కరీంనగర్, వరంగల్, ఖమ్మం, నల్లగొండ జిల్లాల్లోని 109 మార్కెట్ యార్డుల నుంచి సీసీఐ ఆధ్యర్యంలో కోటి 43 లక్షల 66 వేల 974 క్వింటాళ్ల పత్తిని కొనుగోలు చేశారు. గత 20 ఏళ్లతో పోలిస్తే 2024-25 సంవత్సరంలోనే అత్యధికంగా పత్తిని కొనుగోళ్లు జరిగాయి.
అయితే పత్తి కొనుగోలుపై క్వింటాకు రూ. 3 చొప్పున మొత్తం రూ. 4.31 కోట్లు అక్రమంగా వసూలు చేశారనే మార్కెట్ వర్గాలు చెబుతున్నాయి. ఇక కొన్ని మార్కెట్లలోనూ చైర్మన్ హోదాలో పర్సన్ ఇన్‌చార్జ్‌గా ఉండి, కూడా అదనంగా 80.20 లక్షల క్వింటాళ్ల పత్తికి గాను క్వింటాకు రూ. 2.50 పైసల చొప్పున రూ. 2 కోట్ల వరకు కమీషన్ల పేరుతో వసూలు చేశారని చెబుతున్నారు. ఇక జిన్నింగ్ మిల్లుల యజమానుల నుంచి కూడా ఒక్కో మిల్లుకు రూ. 25 వేల చొప్పున 220 మిల్లులకు గాను రూ. 55 లక్షల వరకు వసూళ్లు జరిగాయనే ఆరోపణలు ఉన్నాయి.
అంతేకాకుండా కొన్ని మిల్లులు నిబంధనలకు విరుద్ధంగా పత్తిని కొనుగోలు చేసినట్లుగా విచారణ చేసి.. ఆ మిల్లులను సీజ్ చేస్తానని బెదరించి 38 మిల్లుల నుంచి మిల్లుకు లక్ష చొప్పున మొత్తం రూ.38 లక్షలు వసూలు చేశారని సమాచారం. ఇక టెంపరరీ రిజిస్ట్రేషన్ (టీఆర్) విధానం ద్వారా కూడా రూ. 70 లక్షల వరకు వసూళ్లకు పాల్పడ్డారని చర్చించుకుంటున్నారు. ఎన్ని ఎకరాల్లో పత్తి వేసారనే విషయాన్ని రైతు వ్యవసాయ శాఖ అధికారి వద్ద నమోదు చేసుకోవాల్సి ఉంటుంది.
అయితే కొందరు రైతులు పేర్లను నమోదు చేసుకోరు. వీరికి టెంపరరీ రిజిస్ట్రేషన్ కింద పేర్లు నమోదు చేసుకునే వెసులుబాటును కల్పించి, టీఆర్ నెంబర్ ఇచ్చిన మార్కెట్ యార్డుల్లో పత్తిని కొనుగోలు చేస్తారు. దీన్ని ప్రయివేట్ వ్యాపారులు ఆసరగా చేసుకుని, ఇతరుల టీఆర్ నెంబర్ ద్వారా రైతుల నుంచి తక్కువకు కొనుగోలు చేసి.. ఎక్కువ ధరకు సీసీఐకి అమ్ముతారు. ఈ సమయంలో టీఆర్ నెంబర్లు ఎన్ని వచ్చాయో తెలుసుకుని ఒక్కో మార్కెట్ నుంచి రూ.2 లక్షల నుంచి రూ.3.50 లక్షల చొప్పున మొత్తం కోటి 20 లక్షల వరకు వసూలు జరిగినట్లుగా సంబంధిత శాఖ అధికారులు చెబుతున్నారు.