calender_icon.png 29 October, 2025 | 3:05 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

డీజీపీ ఎదుట మావోయిస్టు నేతలు చంద్రన్న, ప్రకాశ్ లొంగుబాటు

29-10-2025 12:50:17 AM

తెలంగాణలో ఇంకా 64 మంది అజ్ఞాతంలో ఉన్నారు.. 

వారు కూడా లొంగిపోవాలి : డీజీపీ శివధర్‌రెడ్డి పిలుపు

హైదరాబాద్, సిటీ బ్యూరో అక్టోబర్ 28 (విజయక్రాంతి): తెలంగాణలో మావోయిస్టు ఉద్యమానికి భారీ ఎదురుదెబ్బ తగిలింది. పార్టీ కేంద్ర కమిటీ సభ్యు డు పుల్లూరి ప్రసాదరావు అలియాస్ చంద్రన్న, రాష్ట్ర కమిటీ సభ్యుడు బండ ప్రకాశ్ అలియాస్ ప్రభాత్ మంగళవారం డీజీపీ శివధర్‌రెడ్డి ఎదుట లొంగిపోయారు. హైదరాబాద్‌లోని పోలీస్ హెడ్ క్వార్టర్స్‌లో డీజీపీ ఆ వివరాలు వెల్లడించారు.

ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి పిలుపుతో బండ ప్రకాశ్, చంద్రన్న జనజీవన స్రవంతిలో కలిసేందుకు ముందుకొచ్చినట్లు తెలిపారు. పోలీసుల ఎదుట లొంగిపోయిన మావో యిస్టు నేతలపై చర్యలు తీసుకోవాలనే డిమాండ్ సరికాదని, వారిపై ఎలాంటి చర్యలు ఉండవని తేల్చిచెప్పారు. అవసరమైతే వారికి పూర్తి రక్షణ కల్పిస్తామని హామీ ఇచ్చారు.

చంద్రన్న తలపై రూ.25 లక్షలు, బండ ప్రకాశ్‌పై రూ.20 లక్షల రివార్డు ఉందని, ఆ మొత్తాన్ని వారికి అందేలా చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు. ఈ ఏడా ది తెలంగాణలో 427 మంది మావోయిస్టులు లొంగిపోయారని, ఇంకా 64 మంది మాత్రమే అజ్ఞాతంలో ఉన్నారని, వారు కూడా లొంగిపోవాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో ఎస్‌ఐబీ చీఫ్ సుమతిరెడ్డి కూడా పాల్గొన్నారు

చంద్రన్న నేపథ్యం..

పుల్లూరి ప్రసాదరావు అలియాస్ చంద్రన్న 1980లో మల్లోజుల కోటేశ్వరరావు అలియాస్ కిషన్‌జీ అనుచరుడిగా పీపుల్స్‌వార్‌లో చేరాడు. 1983లో పార్టీ కమాండర్‌గా బాధ్యతలు నిర్వర్తించాడు. 1992లో పార్టీ ఆదిలాబాద్ జిల్లా కార్యద ర్శిగా పనిచేశాడు. 2008లో కేంద్ర కమిటీ సభ్యుడిగా ఎన్నికై, అప్పటినుంచి 17 ఏళ్ల పాటు ఆ హో దాలో కొనసాగాడు.

బండ ప్రకాశం నేపథ్యం..

బండ ప్రకాశ్ మావోయిస్టు పార్టీలో 45 ఏళ్లు వివిధ స్థాయిల్లో పనిచేశాడు. ఆయన స్వస్థలం మంచిర్యాల జిల్లా మందమర్రి. ప్రకాశ్ తండ్రి సింగరేణి కార్మికుడు. చదువుకుంటున్న రోజుల్లోనే ప్రకాశ్ రాడికల్ స్టూడెంట్స్ యూనియన్ (ఆర్‌ఎస్‌యూ) సభ్యుడిగా చేరాడు. 1982- 84 మధ్య గ్రామాలకు తరలి వెళ్లండి అనే పీపుల్స్‌వార్ పిలుపునకు ఆకర్షితుడయ్యాడు. 1988లో బెల్లంపల్లి లో సీపీఐ నేత అబ్రహం హత్య కేసులో ఆయన జైలుకు వెళ్లాడు.

ఆదిలాబాద్ సబ్ జైలులో శిక్ష అనుభవిస్తున్న సమయంలో నాటి పీపుల్స్‌వార్ ముఖ్య నేతలైన నల్లా ఆదిరెడ్డి, మహమ్మద్ హస్సే న్, ముంజ రత్నయ్య గౌడ్ తదితరులతో కలిసి సబ్ జైలు గోడలు బద్దలుకొట్టాడు. అంతేకాదు.. పోలీసుల తుపాకులతో సహా చాకచక్యంగా తప్పించుకున్నాడు.

తర్వాత 1991లో మళ్లీ అరెస్ట్ అయి 2004లో విడుదలయ్యాడు. తర్వాత అప్ప టి ప్రభుత్వం జరిపిన శాంతిచర్చల సమయంలో ఆయన జన జీవనస్రవంతిలోనే ఉన్నారు. ప్రభుత్వంతో మావోయిస్టు పార్టీ చర్చలు విఫలం కావ డంతో మళ్లీ అడవి బాట పట్టాడు. 2019లో పార్టీ రాష్ట్ర కమిటీ సభ్యుడయ్యాడు.

మా  సిద్ధాంతం  ఓడిపోలేదు:  చంద్రన్న

లొంగిపోయిన మావోయిస్టు పార్టీ కేంద్ర కమిటీ సభ్యుడు చంద్రన్న మాట్లాడుతూ.. ‘మా ఇద్దరిదీ లొంగుబాటు కాదు. రాష్ట్రాభివృద్ధిలో కలిసి పనిచేసేందుకే మేం జనజీవన స్రవంతిలో కలిశాం. మావోయిస్టు ఉద్యమంలో మేం పీడిత ప్రజల బాగు కోసమే పోరాడాం. భవిష్యత్తులో నూ మేం ప్రజల మధ్యే ఉంటాం. వారి కోసం పోరాడతాం. మా సిద్ధాంతం ఓడిపోలేదు. దాన్ని ఓడించడం ఎవరి తరం కాదు. మా ఆయుధాల ను పార్టీకే అప్పగించాం.

ఆ తర్వాతే ప్రజల మధ్య కు వస్తున్నాం. మా భావాజాలంతో భవిష్యత్తులో మరింత మంది ముందుకు వచ్చే అవకాశం ఉంది. ప్రజల మధ్య ఉండి నేను సేవ చేయాలనుకున్నాం. ఆపరేషన్ కగార్ కారణంగా చాలామంది మావోయిస్టులు చనిపోయారు. ఈ క్రమంలో మా పార్టీలో అంతర్గత చీలికలు జరిగాయి. దీంతో ఎవరి మార్గం వాళ్లు ఎంచుకున్నారు. దీనిలో భాగంగానే మేం లొంగిపోవాలనుకున్నాం.’ అని స్పష్టం చేశారు.