calender_icon.png 29 October, 2025 | 4:40 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

హామీలు అమలు చేయడంలేదు

29-10-2025 01:08:17 AM

  1. ఉద్యోగుల సమస్యలను వెంటనే పరిష్కరించాలి
  2. టీఎన్జీవో నేతలు మారం జగదీశ్వర్, ముజీబ్ ఆగ్రహం

హైదరాబాద్, అక్టోబర్ 28 (విజయక్రాంతి): రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగ, ఉపాధ్యాయుల సమస్యలను వెంటనే పరిష్కరించాలని టీఎన్జీవో అధ్యక్ష, ప్రధానకార్యదర్శులు మారం జగదీశ్వర్, ఎస్‌ఎం హుస్సేనీ ముజీబ్ డిమాండ్ చేశారు. మంగళవారం హైదరాబాద్ నాంపల్లిలోని టీఎన్జీవో భవన్‌లో రాష్ట్ర కార్యవర్గ సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. ప్రభుత్వ ఉద్యోగులు, ఉపాధ్యాయులు, పెన్షనర్ల సమస్యల పరిష్కారం కోసం గత 22 నెలలుగా ఎదురుచూస్తూ పలుమార్లు ముఖ్యమంత్రి, మంత్రివర్గ ఉపసంఘం, అధికారుల కమిటీతో చర్చలు జరిపినప్పటికీ పరిష్కారం కాలేదని ఆవేదన వ్యక్తంచేశారు.

సీఎం, మంత్రులు స్పష్టమైన హామీలు ఇచ్చినప్పటికీ ఉద్యోగుల సమస్యలు ఇంకా పెండింగ్‌లో ఉంచటం శోచనీయమని అసహనం వ్యక్తంచేశారు. సీఎం ఆదేశాల మేరకు పెండింగ్ బిల్లులు నెలకు రూ.700 కోట్లు చెల్లిస్తామని చెప్పినప్పటికీ బకాయిలు ఇప్పటివరకు చెల్లించకుండా  తాత్సార్యం చేయడాన్ని తీవ్రంగా ఖండించారు. ఉద్యోగుల ఈహెచ్‌ఎస్ ఆరోగ్య కార్డును మంజూరు చేస్తామని చెప్పి గత ప్రభుత్వంలో ఏర్పాటు చేసిన కమిటీతోనే పథకాన్ని ప్రారంభిస్తామని ప్రభుత్వం ఇచ్చిన హామీ ఇంకా అమలు కాలేదని ఆగ్రహం వ్యక్తంచేశారు.

ఐదు డీఏలు అడిగితే కేవలం ఒక్క డీఏ మాత్రమే ఇచ్చి చేతులు దులుపుకోవడం, 1 జూలై 2023 నుంచి అమలు చేయాల్సిన నూతన వేతన సవరణపై మాట ఎత్తకపోవడం శోచనీయమన్నారు. సీఎం, మంత్రుల ఆదేశాలను అమలు చేయాల్సిన అధికారులు ఉద్యోగులకు వ్యతిరేకంగా పనిచేస్తు న్నారా అనే అనుమానం తమకు కలుగుతోందని తెలిపారు. సమావేశంలో సంఘం అసోసియేట్ అధ్యక్షుడు కస్తూరి వెంకట్, కోశాధికారి ముత్యాల సత్యనారాయణగౌడ్, అన్ని జిల్లాల అధ్యక్ష కార్యదర్శులు, కేంద్ర సంఘ కార్యవర్గ సభ్యులు పాల్గొన్నారు.