26-09-2025 12:00:00 AM
హైదరాబాద్ సిటీ బ్యూరో, సెప్టెంబర్ 25 (విజయక్రాంతి): పేరుకు తగ్గట్టే బతుకమ్మ కుంట తన వైభవాన్ని తిరిగి చాటుకోనుంది. దశాబ్దాలుగా కబ్జాదారుల చెరలో, ముళ్ల పొదల్లో చిక్కుకున్న ఈ చెరువు, ఇప్పుడు జలకళతో నిండుగా మారి, అందరినీ ఆకట్టుకుంటోంది. ఒకప్పుడు చూడాలంటే భయపడే ప్రదేశం.. నేడు ఆహ్లాదకరమైన పిక్నిక్ స్పాట్‌గా రూపుదిద్దుకుంది.
రాష్ర్ట ప్రభుత్వ దృఢ సంకల్పం, హైడ్రా చొరవతోనే ఇది సాధ్యమైందని స్థానికులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. పూర్తిస్థాయిలో సుందరీకరించబడిన బతుకమ్మ కుంటను శుక్రవారం సీఎం రేవంత్‌రెడ్డి ప్రారంభించనున్నారు. ఈ సందర్భంగా సీఎంకు బతుకమ్మలతో ఘన స్వాగతం పలికేందుకు నివాసితులు సిద్ధమవుతున్నారు. జూలై 19, 2024న ప్రారంభ మైన హైడ్రాకు బతుకమ్మ కుంట పునరుద్ధరణ ప్రాజెక్ట్ ఒక ప్రేరణగా నిలిచిందని హైడ్రా కమిషనర్ ఏవీ రంగనాథ్ తెలిపారు.
కేవలం ఐదు నెలల్లోనే ఈ ప్రాజెక్ట్‌ను పూర్తి చేయడం హైడ్రా పనితీరుకు నిదర్శనమన్నారు. బతుకమ్మ కుంట పునరుద్ధరణకు అనేక న్యాయపరమైన అడ్డంకులు ఎదురయ్యా యి. భూ కబ్జాదారులైన సయ్యద్ ఆజం, సయ్యద్ జహాంగీర్, ఎ సుధాకర్‌రెడ్డి వంటి వారు వేసిన పిటిషన్లపై కోర్టులు ఇది చెరువు భూమియేనని స్పష్టం చేశాయి.
1962-63 నాటి లెక్కల ప్రకారం అంబర్‌పేట మండలం బాగ్ అంబర్‌పేటలోని సర్వే నంబర్ 563లో ఈ చెరువు మొత్తం 14.06 ఎకరాల విస్తీర్ణంలో ఉంది. బఫర్ జోన్‌తో కలిపి మొత్తం 16.13 ఎకరాలు. కానీ, తాజా సర్వేలో కేవలం 5.15 ఎకరాల విస్తీర్ణం మాత్రమే మిగిలి ఉందని తేలింది. ప్రస్తుతం ఈ మిగిలిన భూమిలోనే బతుకమ్మ కుంటను పునరుద్ధరించారు. పునరుద్ధరించిన బతుకమ్మ కుంట వద్ద ప్లే ఏరియా, విశ్రాంతి తీసుకునే గుమ్మటాలు, నడక దారి ఏర్పాటు చేశారు.