26-09-2025 12:00:00 AM
ఎల్బీనగర్, సెప్టెంబర్ 25 : ఎల్బీనగర్ నియోజకవర్గంలో వరద కాల్వలు, నాలాలు పూర్తిగా కబ్జాలకు గురవుతున్నాయి. ఒకప్పుడు చెరువులకు వరద నీటిని తీసుకొని వచ్చే కాల్వలు నేడు పూర్తిగా కబ్జాలకు గురికావడంతో కనుమరుగయ్యే స్థితికి వచ్చాయి. ఎల్బీనగర్ నియోజకవర్గంలో వర్షాలు కురిసిన ప్రతిసారి లోతట్టు ప్రాంతాలు, ముంపు ప్రాంతాల ప్రజలు భయం గుప్పిట్లో ఉంటున్నారు.
ముఖ్యమైన రాచకాల్వ నేడు కనిపించని పరిస్థితికి చేరింది. రాచకాల్వ ద్వారా వచ్చే వరద నీరు తుర్కయంజాల్, ఇంజాపూర్, సాహెబ్ నగర్ కలాన్, హయత్ నగర్ గ్రామాల్లోని చెరువులను నింపుతూ దిగువ ఉన్న పెద్ద అంబర్ పేట చెరువులోకి వెళ్తుంది.
అయితే, రాచకాల్వ బీఎన్ రెడ్డి నగర్, హయత్ నగర్ డివిజన్లలోని పలుచోట్ల కబ్జాకు గురవుతుంది. కొన్నిచోట్ల రియల్ ఎస్టేట్ వెంచర్లు సైతం రాచకాల్వను కబ్జా చేశారు. దీంతో చెరువుల్లోకి చేరాల్సిన వరద కాలనీలను ముంచెత్తుతుంది. భారీ వర్షాలు కురిసినప్పుడు లోతట్టు, ముంపు ప్రాంతాలను వరదనీరు దిగ్బంధం చేస్తుంది.
భారీ వర్షాలకు వణుకుతున్న లోతట్టు ప్రాంతాలు
ఇటీవల కురిస్తున్న వర్షాలకు లోతట్టు ప్రాంతాలు నీట మునుగుతున్నాయి. పలు కాలనీలు, బస్తీలు జలదిగ్బంధంలో చిక్కుకోవడంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. హయత్ నగర్, బీఎన్ రెడ్డి నగర్ డివిజన్లలో ఆదివారం, సోమవారం కురిసిన భారీ వర్షాలకు లోతట్టు ప్రాంతాలను వరద ముంచెత్తింది.
ముఖ్యంగా హయత్ నగర్ డివిజన్ లోని బంజారా కాలనీ, రంగనాయకులగుట్ట, అంబేద్కర్ కాలనీ, సత్తిరెడ్డి కాలనీలను వరద ముంచెత్తడంతో ఇండ్లలోకి నీరు చేరింది. వీధుల్లో నడుం లోతు నీరు నిలిచింది. ఇండ్ల మధ్యన నీరు చేరడంతో ఇండ్లలో ఉన్నవారు బయటకు రాలేక పోతున్నారు. ప్రజల ఇబ్బంది గమనించిన హయత్ నగర్ పోలీసులు భోజన వసతి కల్పించారు.
దీనికి కారకులు ఎవరు..?
జల వనరులను కాపాడాల్సిన అధికారులు, ప్రజాప్రతినిధులు అక్రమార్కులతో కుమ్మకై ప్రకృతి సంపదను ధ్వంసం చేస్తున్నారు. ఎల్బీనగర్ నియోజకవర్గంలో అనేక చెరువులు, కుంటలు ఉన్నాయి. వీటితోపాటు వరద కాల్వలు, ప్రసిద్ధి చెందిన రాచకాల్వ సైతం ఎల్బీనగర్ నియోజకవర్గంలో ఉన్నది. రాచకాల్వ నుంచే ఎగువ ప్రాంతాల నుంచి వచ్చే వరదను ఇక్కడి చెరువుల్లోకి చేర్చుతుంది.
రాచకాల్వ నుంచే మసాబ్ చెరువు, నూర్ఖాన్ చెరువు తోపాటు హయత్ నగర్ లోని బాతుల చెరువు, పెద్ద అంబర్ పేట లోని చెరువులకు వరద నీరు చేరుతుంది. ఇంతటి ముఖ్యమైన రాచకాల్వ కబ్జా కోరల్లో చిక్కుకుని ఇప్పుడు కనుమరుగయ్యే పరిస్థితికి వచ్చింది.
హయత్ నగర్ డివిజన్ కు శాపంగా మారిన కబ్జాలు
భారీ వర్షాలు కురిసినప్పుడు హయత్ డివిజన్ లోని బస్తీ ప్రాంతాలు వణికిపోతున్నాయి. ఇంజాపూర్ చెరువు నిండితే హయత్ నగర్ డివిజన్ బస్తీ ప్రాంతాలు భయాందోళనకు గురవుతున్నారు. ఇంజాపూర్ చెరువు నిండింది. ఇంజాపూర్ చెరువు వరద నీరు రాచకాల్వ, జాలు కాలువ ద్వారా హయత్ నగర్ బాతుల చెరువులోకి వెళ్లాలి. కానీ రాచకాల్వ, జాలు కాల్వను కబ్జాకోరులు, అక్రమార్కులు ఇష్టం వచ్చినట్లు ఆక్రమించడంతో వరద కాలనీలను ముంచెత్తుతుంది.
రాచకాల్వ, జాలు కాలువ కబ్జా కావడంతో ప్రవాహంలో వచ్చిన వరద వేళ్లే కాలువలు పూర్తిగా మూసుకుపోవడంతో హయత్ నగర్ లోని బంజారా కాలనీ, సత్తిరెడ్డి కాలనీ, అంబేద్కర్ కాలనీ, రంగనాయకుల గుట్ట కాలనీలను ముంచెత్తుతున్నాయి.
రాచకాల్వ, జాలు కాల్వ కబ్జాలకు గురికావడంతో బాతులు చెరువు, కుమ్మరి కుంటకు చేరాల్సిన వరద కాలనీలను ముంచెత్తుతుంది. దీనికి కారకులు ముమ్మాటికి రాజకీయ నాయకులు, అధికారులే..? ఇప్పటికైనా రాచకాల్వ, జాలు కాలువ కబ్జాలను అరికట్టి వరద నీరు సాఫీగా వెళ్లేందుకు చర్యలు చేపట్టాలని హయత్ నగర్ డివిజన్ బస్తీ ప్రాంతాల ప్రజలు కోరుతున్నారు.
ప్రతి వానాకాలం మా కాలనీ మునుగుతుంది
హయత్ నగర్ డివిజన్ లోని రంగనాయకుల గుట్టతోపాటు బంజారా కాలనీ ప్రతి వానాకాలం నీట మునిగుతుంది. ఎగువ ప్రాంతాల నుంచి వచ్చే వరద మా కాలనీ పక్కనే ఉన్న నాలా ద్వారా పెద్ద అంబర్ పేట మున్సిపాలిటీ లోని వరద కాల్వలకు చేరుతుంది.
అయితే, మునుగనూర్ కల్వర్టు వద్ద చేపట్టిన నాలా పనులు పూర్తి కాకపోవడంతో వరద రంగనాయకుల గుట్ట, బంజారా కాలనీకి చేరుతుంది. బాతుల చెరువు అలుగు కాల్వ, జాలు కాల్వను కబ్జా చేయడంతో దీంతో ప్రతి వానాకాలంలో రెండు కాలనీలు కాలనీ పది, పదిహేను రోజుల పాటు నీళ్లలోనే ఉంటాయి.
-చౌహాన్ భీంరామ్, రంగనాయకులగుట్ట