calender_icon.png 18 August, 2025 | 12:58 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

రాబోయే తరానికి వల్లాల చరిత్ర తెలియాలి

17-08-2025 12:58:58 AM

- స్థూపాన్ని ఆవిష్కరించనున్న సీఎం రేవంత్‌రెడ్డి

- కాంగ్రెస్ సీనియర్ నేత వీ హనుమంతరావు 

శాలిగౌరారం, ఆగస్టు 16 (విజయక్రాం తి): నైజాం రజాకార్ల చేతిలో ప్రాణాలొదిలిన నల్లగొండ జిల్లా శాలిగౌరారం మండలం వల్లాల గ్రామ అమరవీరుల చరిత్ర రాబోయే భవిష్యత్ తరాలకు తెలియాలని పీసీసీ మాజీ అధ్యక్షులు వీ హనుమంతరావు అన్నారు. నైజా కాలంలో వల్లాల గ్రామంలో 9, 10 వ తరగతి చదువుతున్న విద్యార్థులు పాఠశాల మైదానంలో 15 ఆగస్టు 1948 త్రివర్ణ పతాకాన్ని ఎగురవేశారని తెలిపారు.

అయితే జాతీయ జెండాను ఎగరవేసినందుకు నైజాం ప్రభుత్వంలోని రాజకార్ల సైన్యం విద్యార్థులను విచక్షణారహితంగా కాల్చి చంపిందని పేర్కొన్నారు. ఇలాంటి సంఘటనలు తెలంగాణలో అనేకం జరిగాయన్నారు. నైజాం ప్రభుత్వ నిరంకుశ పాలనను గద్దెదించేందుకు భారత సైన్యం సైనిక చర్యను చేపట్టిందని తెలిపారు. దీంతో నిజాం భారతదేశ ప్రభుత్వానికి లొంగిపోవడంతో 1948 సెప్టెంబర్ 17న  భారతదేశంలో హైదరాబాద్ విలీనం అయిందన్నారు. 

స్మారక స్థూపం ఏర్పాటు

విద్యార్థులు చనిపోయిన విషయాన్ని తెలుసుకున్న వి.హనుమంతరావు గత రెండు మూడు సంవత్సరాలుగా గ్రామానికి వచ్చి అమరవీరులైన విద్యార్థులకు నివాళులు అర్పిస్తూ వస్తున్నారు. విద్యార్థులు అమరులైన ప్రాంతంలోనే స్మారకం స్థూపం ఏర్పాటు చేశారు. స్థూప నిర్మాణం పూర్తవ్వడంతో శనివారం స్థూప నిర్మాణాన్ని పరిశీలించారు. అమరవీరుల త్యాగాన్ని నేటి యువతరం అధ్యయనం చేయాల్సిన అవసరం ఉందని, నాడు విద్యార్థులు చేసిన పోరాటాన్ని తెలుసుకోవాల్సిన అవసరం ఉందన్నారు. ఈనెల 23 లోపే స్థూప ఆవిష్కరణ కార్యక్రమాన్ని చేపడతామని తెలిపారు. సీఎం రేవంత్ రెడ్డి, పీసీసీ అధ్యక్షుడు మహేశ్‌గౌడ్, మంత్రులు ఉత్తమ్ కుమార్‌రెడ్డి, కోమటిరెడ్డి వెంకటరెడ్డి, ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలతో కలిసి స్థూపాన్ని ఆవిష్కరిస్తారన్నారు.