calender_icon.png 28 September, 2025 | 2:50 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

చదువుతోపాటు నైపుణ్యాలుంటేనే భవిష్యత్

28-09-2025 01:29:31 AM

  1. సాఫ్ట్‌వేర్ కోర్సులతోనే ఉద్యోగాలు వస్తాయనుకోవడం అపోహే
  2. విదేశీ ఉద్యోగాలకు ప్రత్యేక విభాగం 
  3. యువతకు రూ.రెండువేల స్టయిఫండ్
  4. డ్రగ్స్‌కు బానిస కావొద్దు
  5. ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి
  6. మల్లేపల్లి నుంచి 65 ఏటీసీలను వర్చువల్‌గా ప్రారంభించిన సీఎం

హైదరాబాద్ సిటీ బ్యూరో, సెప్టెంబర్ 2౭ (విజయక్రాంతి ): తెలంగాణ యువత భవిష్యత్‌కు బంగారు బాటలు వేసే దిశగా రాష్ర్ట ప్రభుత్వం చారిత్రక అడుగు వేసింది. సంప్రదాయ ఐటీఐలను, ఆధునిక పరిశ్రమల అవసరాలకు దీటుగా తీర్చిదిద్దిన అడ్వాన్స్‌డ్ టెక్నాలజీ సెంటర్లను ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి శనివారం లాంఛనంగా ప్రారంభించా రు. మల్లేపల్లి ఐటీఐలో జరిగిన ప్రధాన కార్యక్రమం నుంచి రాష్ర్టవ్యాప్తంగా ఉన్న 65 ఏటీసీలను వర్చువల్‌గా ప్రారంభించారు.

ఈ సందర్భంగా యువతకు పలు వరాలు సీఎం ప్రకటించారు. ఏటీసీల్లో చదివే ప్రతి విద్యార్థికి నెలకు రూ.2000 చొప్పున స్టుఫైండ్ అందిస్తామని, నైపుణ్యం సాధించిన వారికి విదేశీ ఉద్యోగావకాశాలు కల్పించేందుకు ప్రభుత్వంలో ప్రత్యేక విభాగాన్ని ఏర్పాటు చేస్తామని ముఖ్యమంత్రి హామీ ఇచ్చారు.

మంత్రులు దుద్దిళ్ల శ్రీధర్ బాబు, పొన్నం ప్రభాకర్, పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, ఇతర ప్రజాప్రతినిధులతో కలిసి మల్లేపల్లి ఏటీసీని పరిశీలించిన అనంతరం జరిగిన సభలో ఈ సందర్భంగా సీఎం రేవంత్‌రెడ్డి మాట్లాడుతూ చదువుతో పాటు నైపుణ్యం ఉంటేనే యువతకు ఉజ్వల భవిష్యత్ ఉంటుందని, సాంకేతిక నైపుణ్యమే మన తలరాతను మారుస్తుంది.

కేవలం సాఫ్ట్‌వేర్ కోర్సులతోనే విదేశీ ఉద్యోగాలు వస్తాయనుకోవడం అపోహేనని, అడ్వాన్స్‌డ్ టెక్నాలజీ సెంటర్ల ఏటీసీలో శిక్షణ పొందితే జర్మనీ వంటి దేశాల్లో నెలకు రూ.3.50 లక్షల జీతంతో ఉద్యోగాలు సాధించవచ్చని ఆయన అన్నారు. ఆటోమొబైల్ పరిశ్రమలో విస్తృతంగా ఉద్యోగావకాశాలు ఉన్నా, అందుకు అవసరమైన నైపుణ్యం ఉన్న యువత రాష్ర్టంలో దొరకడం లేదని పారిశ్రామికవేత్తలు చెప్పారు.

ఈ గ్యాప్‌ను పూడ్చడానికే టాటా టెక్నాలజీస్ సహకారంతో రూ.2400 కోట్ల వ్యయంతో 65 ఐటీఐలను ఏటీసీలుగా మార్చాం. వీటిలో శిక్షణ పొందుతున్న వారందరికీ ఉద్యోగాలు వస్తున్నాయి. ఇదే స్ఫూర్తితో రాష్ర్టంలో మరో 51 ఏటీసీలను మంజూరు చేస్తున్నాం. అంతేకాదు, ఈ కేంద్రాలలో శిక్షణ పొందే విద్యార్థులకు ప్రతి నెలా రూ.2,000 స్టుఫైండ్ ఇచ్చే ఆలోచన చేస్తున్నాం. నిరుద్యోగుల పోరాటంతో ఏర్పడిన తెలంగాణలో, పదేళ్లు గడిచినా యువత ఆకాంక్షలు నెరవేరలేదు.

మా ప్రభుత్వం ఆ లోటును భర్తీ చేస్తుంది. సాంకేతిక నైపుణ్యం లేకపోతే ఈ రోజుల్లో దేనికీ కొరగాని పరిస్థితి ఏర్పడుతుంది. చదువుకున్న యువత సరైన మార్గంలో పయనించాలి. గంజాయి కేసుల్లో ఎక్కువగా ఇంజనీరింగ్ విద్యార్థులే పట్టుబడటం అత్యంత దురదృష్టకరం. గంజాయి వంటి మత్తు పదార్థాలకు బానిసలై, కన్నవారికి కడుపుకోత మిగల్చవద్దు అని ముఖ్యమంత్రి యువతకు హితవు పలికారు.

ఈ కార్యక్రమంలో ఎంపీలు అనిల్ కుమార్ యాదవ్, మల్లు రవి, నగర మేయర్ గద్వాల విజయలక్ష్మి, ఉన్నతాధికారులు, టాటా టెక్నాలజీస్ ప్రతినిధులు పాల్గొన్నారు. విదేశీ పర్యటనలో ఉన్న మంత్రి గడ్డం వివేక్ వెంకటస్వామి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా తన సందేశాన్ని వినిపించారు.