17-10-2025 12:11:50 AM
జిల్లా కలెక్టర్ జితేష్ వి. పాటిల్
భద్రాద్రి కొత్తగూడెం, అక్టోబర్ 16 (విజయక్రాంతి) : జిల్లాలో గిరిజన విద్యార్థుల సమగ్ర అభివృద్ధి, విద్యా ప్రమాణాల పెంపు, మౌలిక వసతుల అభివృద్ధి ప్రధాన లక్ష్యమని జిల్లా కలెక్టర్ జితేష్ వి. పాటిల్ తెలిపారు. గురువారం పాల్వంచలోని కిన్నెరసాని గిరిజన గురుకుల పాఠశాల (బాలుర) ను సందర్శించిన ఆయన, పాఠశాల విద్యా కార్యక్రమాలు, వసతుల పరిస్థితి, విద్యార్థుల సౌకర్యాలను ప్రత్యక్షంగా పరిశీలించారు.
ఈ సందర్భంగా పాఠశాల ప్రిన్సిపాల్ శ్యామ్కుమార్ నుండి విద్యార్థుల హాజరు, వసతి గృహాలు, భోజనశాల, క్రీడా వసతులు అవసరమైన మౌలిక సదుపాయాలపై సమగ్ర వివరాలు తెలుసుకున్నారు. ఈ సందర్శన సందర్భంగా జిల్లా క్రీడా ప్రాధికార సంస్థ తరఫున విద్యార్థులకు టేబుల్ టెన్నిస్ టేబుల్, ఆట సామాగ్రి, క్రీడా పరికరాలను అందజేశారు. అనంతరం కలెక్టర్ స్వయంగా టేబుల్ టెన్నిస్ ఆడి విద్యార్థులను ఉత్సాహపరిచారు. ఖమ్మంభద్రాద్రి రీజినల్ కోఆర్డినేటర్ అరుణ కుమారి, జిల్లా క్రీడా శాఖ అధికారి పరంధామ రెడ్డి, ఉపాధ్యాయులు, ఉపాధ్యాయేతర సిబ్బంది, విద్యార్థులు, సంబంధిత శాఖల అధికారులు తదితరులు పాల్గొన్నారు.