calender_icon.png 25 August, 2025 | 5:02 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

గ్రామీణ ప్రాంతాల అభివృద్ధే ప్రజా ప్రభుత్వ లక్ష్యం

25-08-2025 12:46:13 AM

- రూ. 3.90 కోట్లతో నిర్మించనున్న బీటీ రహదారికి శంకుస్థాపన 

- రూ. 20 లక్షలతో నూతనంగా నిర్మించిన ఆరోగ్య ఉపకేంద్రం భవనం ప్రారంభం

- అబ్కారి, పర్యాటక, సాంస్కృతిక మంత్రి జూపల్లి కృష్ణారావు

 వనపర్తి, ఆగస్టు 24 ( విజయక్రాంతి ) : గ్రామీణ ప్రాంతాల అభివృద్దే ప్రజా ప్రభుత్వ లక్ష్యమని, ఇందుకోసం ప్రజలకు ఎల్లప్పుడూ తన సహకారం ఉంటుందని రాష్ట్ర అబ్కారి, పర్యాటక సాంస్కృతిక శాఖ మాత్యులు జూపల్లి కృష్ణారావు అన్నారు. ఆదివారం వీపనగండ్ల మండల కేంద్రంలో పర్యటించిన మంత్రి జూపల్లి కృష్ణారావు వివిధ కార్యక్రమాల్లో పాల్గొన్నారు. అదనపు కలెక్టర్ రెవెన్యూ ఖీమ్యా నాయక్, జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ గోవర్ధన్ సాగర్ తో కలిసి వీపనగండ్ల మండల కేంద్రం నుంచి బెక్కం గ్రామానికి రూ. 3.90 కోట్లతో నిర్మించనున్న బీటీ రహదారికి మంత్రి శంకుస్థాపన, బొల్లారం గ్రామంలో రూ. 20 లక్షల వ్యయంతో నిర్మించిన పల్లె దవాఖాన భవనాన్ని మంత్రి జూపల్లి కృష్ణారావు రిబ్బన్ కట్ చేసి ప్రారంభించారు.

శంకుస్థాపన అనంతరం మంత్రి మాట్లాడుతూ వీపనగండ్ల మండల కేంద్రం నుంచి బెక్కెం వరకు నిర్మించనున్న బీటీ రహదారిని నాణ్యతతో పూర్తి చేయాలని సంబంధిత అధికారులను ఆదేశించారు. నియోజకవర్గాన్ని అభివృద్ధిలో ముందంజలో నిలపడమే లక్ష్యమని తెలిపారు. గతంలో తాను పంచాయతీరాజ్ శాఖ మంత్రిగా ఉన్నప్పుడు నియోజిక వర్గం లో రూ. 300 కోట్లతో సిసి రహదారులు, రూ. 600 కోట్లతో బీటీ రహదారులు నిర్మించే అభివృద్ధి చేసినట్లు గుర్తు చేశారు. ప్రజలకు ఏ కష్టం వచ్చినా తన సహకారం ఉంటుందని చెప్పారు. మండల పరిధిలో నాలుగు ఎకరాల భూమిలో స్పోరట్స్ కోసం స్టేడియాన్ని ఏర్పాటు చేయించేందుకు అన్ని రకాలుగా కృషి చేస్తున్నట్లు తెలిపారు.

అనంతరం ఇందిరా మహిళా శక్తి పథకం కింద మైనారిటీ శాఖ ఆధ్వర్యంలో మంజూరైన కుట్టు మిషన్లను 19 మంది మైనారిటీ నిరుపేద మహిళా లబ్ధిదారులకు మంత్రి అందజేశారు. ప్రభుత్వం నుంచి విడతల వారీగా రూ. 5 లక్షలు ఇందిరమ్మ ఇండ్లకు మంజూరు చేస్తుందని, ఇందుకోసం ఎవరికీ ఒక రూపాయి కూడా చెల్లించవలసిన అవసరం లేదని మంత్రి లబ్ధిదారులకు సూచించారు. ఇల్లు లేని అత్యంత నిరుపేదలకే ఇందిరమ్మ ఇంటి లబ్ధి చేకూరాలని, అనర్హులకు ఇందిరమ్మ ఇంటి లబ్ధి చేయవద్దని అధికారులకు సూచించారు. ఆర్డీవో సుబ్రహ్మణ్యం, పంచాయతీరాజ్ కార్యనిర్వాహక ఇంజనీర్ మల్లయ్య, జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి శ్రీనివాసులు, ఇంజనీరింగ్ అధికారులు, మండల తహసిల్దార్, ఎంపీడీవో, ఇతర మండల నాయకులు, తదితరులుపాల్గొన్నారు.