calender_icon.png 25 August, 2025 | 2:28 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

అడ్డదిడ్డంగా కొట్టిన.. అడిగేది ఎప్పుడో?

25-08-2025 12:44:46 AM

- ఎమ్మెల్యే సొంత మండలంలో చెట్ల నరికివేత 

- అధికార పార్టీలో ఉంటే అన్ని సత్ఫలితాలేనా..

- లక్షలు ఖర్చుపెట్టి పెంచింది నరికివేత కోసమేనా 

- జరిమన విధించామంటూ.. కాలయాపన చేస్తున్న అటవీశాఖ 

- పట్టించుకోని సిసి కుంట ఫారెస్ట్ సెక్షన్ ఆఫీసర్ శ్రీనివాసులు

చిన్న చింతకుంట ఆగస్టు 24 (విజయ క్రాంతి) : నిబంధనలు గట్టిగా ఉంటాయి... ఆ నిబంధనలను అమలు చేయడంలో మాత్రం ఆచితూచి చేస్తారు అధికారులు.. ఒక చెట్టు మన ఇంటి ఆవరణలో పెరిగిన అది కొట్టేందుకు ప్రభుత్వ అనుమతి తీసుకోవాల్సిన అవసరం ఉందని చట్టం చెబుతుంది. అధికారం తమ వైపు ఉంటే ఎన్ని చెట్లయినా నరికేందుకు వీలుంటుంది అంటూ అధికార పార్టీ నాయకులు చెబుతున్నారు. అధికార పార్టీలో ఉంటే అక్రమంగా చెట్లు నరికి వేసిన... ఎవరు అడగకూడదా ? అంటే ఇది నిజమే అనిపిస్తుంది.

మహబూబ్ నగర్ జిల్లా దేవరకద్ర నియోజకవర్గం లోని చిన్న చింతకుంట మండల పరిధిలో అమ్మపూర్ నుంచి అల్లిపూర్ గ్రామానికి వెళ్లే రోడ్డు పక్కన దాదాపు కిలోమీటర్ పొడవున చెట్లను నరికివేసి వ్యాపార సముదాయ ఏర్పాటు నిమిత్తం విద్యుత్ సరఫరా తీసుకుపోయిన అధికార పార్టీకి చెందిన ఒక పెద్ద మనిషి కి నరికి వేసిన చెట్ల విలువను అంచనా వేసి ఫైన్ విధిస్తామని సంబంధిత ఫారెస్ట్ అధికారి శ్రీనివాసులు చెప్పిన ఆ జరిమానా అమలు మాత్రం జరగడం లేదని ఆరోపణలు వస్తున్నాయి.

ఈ అంశంపై విజయ్ క్రాంతి దినపత్రిక జులై 22వ తేదీన ’ కిలోమీటర్ పొడవున నరికి వేశారు’ అనే కథనం ప్రచురించింది. సంబంధిత అధికారిని పలుమార్లు ఫైన్ విధించిన చెప్పడంతో ఆ పత్రాన్ని ఇవ్వాలని కోరిన ప్రతి మారు రేపు సమర్పిస్తాం అంటూ కాలయాపన చేస్తూ ప్రభుత్వ నిధులతో పెంచిన చెట్లను నరికిన అధికార యంత్రాంగం అలసత్వం ప్రదర్శిస్తూనే వస్తుంది. 

అటవీ శాఖ ఉన్నది ఎందుకు..?

అటవీ ప్రాంతంలో ఎక్కడో ఒక మూలన ఒక చెట్టు నరికిన పట్టుకొని వారిపై జరిమానా విధించేందుకు అటవీశాఖ అధికారులు నిరంతరం పర్యవేక్షణ చేస్తుంటారు. చిన్న చింతకుంట మండలంలో ఇక్కడ ప్రధాన రోడ్డు పక్కన దాదాపు కిలోమీటర్ పొడవున చెట్లను నరికిన అటవీ శాఖ అధికారులు పట్టించుకోవడం లేదంటే ఈ అంశంపై వెనుక ఉన్న అంతర్వేమిటో అంతుపట్టని పరిస్థితులు నెలకొన్నాయి. సామాన్యులకు ఒక న్యాయం..? బడా నాయకులకు అధికార పార్టీ అండదండలు ఉంటే వారికి మరో న్యాయమా ? ఇది ఎంతవరకు సమంజసం అంటూ ప్రజలు అసంతృప్తి వ్యక్తం చేస్తుండ్రు. నియంత్రించాల్సిన అధికారులు అస్సలు పట్టించుకోకపోవడంతోనే చెట్ల నరికివేత దర్జాగా జరుగుతుందని తెలుస్తుంది. 

ఇటీవల జూలపల్లి అడవిలో గిట్లనే...

గత కొన్ని నెలల క్రితం మహమ్మదాబాద్ మండలం జూలపల్లి అటవీ ప్రాంతంలో ఎకరాల పరిధిలో చెట్లను నరికివేసి అమ్ముకున్న ఫారెస్ట్ ఆఫీసర్ ను ఉన్నత అధికారులు విచారణ చేసి సస్పెండ్ చేశారు. అటవీ ప్రాంతాలకు కాపల పెట్టిన అధికారుల అండదండలతోనే చెట్ల నరికివేత యధాతధంగా నడుస్తుంటే.. ఇక ఆపేదెవరో.. అడ్డుకున్నది ఎవరో అర్థం కాని పరిస్థితి జిల్లా వ్యాప్తంగా నెలకొంటుంది. సీసీ కుంట మండల పరిధిలో అటవీ శాఖ అధికారులు పర్యవేక్షణ లేనట్లే తెలుస్తుంది. ప్రధాన రోడ్లపైనే చెట్లు నరికిన చూడకుంటే అటవీ ప్రాంతాల్లో ఎట్లా పర్యవేక్షణ చేస్తున్నారు ఆ పర్యవేక్షణ ఏమాత్రం జరుగుతుందో అధికారులే సమాధానం చెప్పాలి. 

ఉన్నత అధికారుల పర్యవేక్షణ అవసరం..

చెట్లను నరుకుతున్నారు మహాప్రభువు అంటూ పత్రికలు కథనాలు రాస్తున్నప్పటికీ... అవి నిర్ధారణ అయినప్పటికీ చర్యలు తీసుకోవడంలో మాత్రం ఉన్నత అధికారులు అలసత్వం ప్రదర్శిస్తున్నారు. మొక్కలను వృక్షాలను చేసి వృక్షాలతో మంచి వాతావరణాన్ని ప్రజలకు అందించాలని సంకల్పముతో ప్రభుత్వాలు లక్షల రూపాయలు ఖర్చుపెట్టి ఒక ప్రత్యేక శాఖ ద్వారా పర్యవేక్షణ చేపిస్తున్నప్పటికీ ఆ శాఖ నిర్లక్ష్యం కారణంగా ప్రభుత్వం ఆశించిన ఆశయం మాత్రం మరింత దూరంగా ఉంటుంది. ఇప్పటికైనా సంబంధిత అధికార యంత్రం ఎక్కడ ఎలాంటి తప్పిదాలు జరుగుతున్నాయో పూర్తిస్థాయిలో పర్యవేక్షణ చేస్తూ నిబంధనలు అతిక్రమించిన వారిపై చర్యలు తీసుకుంటూ ముందుకు సాగవలసిన అవసరం ఎంతైనా ఉంది. 

జరిమాన పత్రం రేపు ఇస్తాను.. 

చెట్లను నరికి వేశారు కాబట్టి వారికి జరిమానా విధించడం జరుగుతుంది. ఈ పత్రం రేపు ఇస్తాను.. ఇలా నెలకు పైగా గడిచినప్పటికీ కూడా అడిగిన ప్రతిసారి జరిమానా పత్రం రేపు ఇస్తాను . బయట ఉన్నాను.. అంటూ సీసీ కుంట మండల అటవీశాఖ సెక్షన్ ఆఫీసర్ శ్రీనివాసులు కాలయాపన చేస్తూ వస్తున్నారు. సమాచారం అందించిన చర్యలు తీసుకోవడంలో ఎందుకు నిర్లక్ష్యం వహించవలసి వస్తుందో సమంత అధికారులే చెప్పాల్సి ఉంది.

 శ్రీనివాసులు ఫారెస్ట్ సెక్షన్ ఆఫీసర్