03-11-2025 01:30:53 AM
బీఆర్‌ఎస్‌కు లాభం తెచ్చేలా అధికారుల చర్యలు
కాంగ్రెస్ అభ్యర్థిని ఓడించేందుకు కుట్ర
పీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ జగ్గారెడ్డి
సంగారెడ్డి, నవంబర్ 2 (విజయక్రాంతి): కాంగ్రె స్ పార్టీకి, ప్రభుత్వానికి చెడ్డ పేరు తీసుకురావాలని కొంతమంది హైడ్రా అధికారులు పనిచేస్తున్నట్లు అనుమానం కలుగుతోందని, బీఆర్‌ఎస్‌కు లాభం చేసేలా కాంగ్రెస్ పార్టీకి, ప్రభుత్వానికి నష్టం చేసేలా కొంతమంది అధికారులు అత్యుత్సాహం చూపిస్తున్నారని టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ జగ్గారెడ్డి అనుమానం వ్యక్తం చేశారు. ఇలాంటి అధికారులపై హైడ్రా చీఫ్ రంగనాథ్ దృష్టి పెట్టాలన్నారు. అధికారులు అత్యుత్సాహం వల్ల కాంగ్రెస్ పార్టీకి, కాంగ్రెస్ ప్రభుత్వానికి వస్తున్న చెడ్డ పేరుని ప్రతిపక్షాలు ఎక్కువగా జనంలోకి తీసుకెళ్తున్నాయని అన్నారు.
ఈ విషయాన్నిముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి దృష్టికి, పిసిసి అధ్యక్షుడు మహేశ్‌గౌడ్ దృష్టికి తీసుకెళ్లనున్నట్టు తెలిపారు. అటువంటి అధికారుల కుట్రలకు అడ్డుకట్ట వేయాలని, ఆ అధికారులపై చర్యలు తీసుకోవడమే కాకుండా దీనిపైన విచారణ కూడా జరగాలని తెలిపారు. జూబ్లీహిల్స్ కాంగ్రెస్ అభ్యర్థి నవీన్ యాదవ్‌ను ఓడించేందుకు హైడ్రాపే అడ్డుపెట్టుకుని కొంతమంది బీఆర్‌ఎస్ అనుకూల అధికారుల సహకారంతో ఆ పార్టీ ప్రయత్నం చేస్తున్నట్లు కనబడుతోందని ఆరోపించారు. ఈ హైడ్రా దాడులను బీఆర్‌ఎస్ పార్టీ సోషల్ మీడియాలో ఎక్కువగా ప్రచారం చేస్తోందని, ఇప్పటిదాకా హైడ్రా దాడులు గురించి మాట్లాడని కేటీఆర్ ఎన్నికలను దృష్టిలో పెట్టుకొని రోజు హైడ్రా జపం చేస్తున్నారని విమర్శించారు.