05-05-2025 04:37:26 PM
రాజకీయలకు అతీతంగా సీఎం సహాయ నిధి చెక్కుల పంపిణీ..
స్టేషన్ ఘనపూర్ ఎమ్మెల్యే కడియం శ్రీహరి..
హనుమకొండ (విజయక్రాంతి): స్టేషన్ ఘనపూర్ నియోజకవర్గ కేంద్రంలోని ఎమ్మెల్యే కార్యాలయంలో ఏర్పాటు చేసిన ముఖ్యమంత్రి సహాయ నిధి చెక్కుల పంపిణీ కార్యక్రమంలో ఎమ్మెల్యే కడియం శ్రీహరి(MLA Kadiyam Srihari) పాల్గొన్నారు. ఈ సందర్బంగా నియోజకవర్గ పరిధిలోని 7 మండలాలకు సంబందించిన 111 మంది లబ్ధిదారులకు 38 లక్షల 22 వేల 500 రూపాయల విలువగల చెక్కులను లబ్ధిదారులకు పంపిణీ చేశారు. అనంతరం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఎమ్మెల్యే మాట్లాడుతూ... ముఖ్యమంత్రి సహాయనిధి ద్వారా లబ్ది పొందాలి అనుకునే వారు నేరుగా తనను కానీ, తన కార్యాలయంలో గాని సంప్రదించాలని నియోజకవర్గ ప్రజలకు సూచించారు.
ఇందులో ఎలాంటి రాజకీయాలకు, అవినీతికి ఆస్కారం లేకుండా అత్యంత పారదర్శకంగా లబ్ధిదారులకు చెక్కులు అందిస్తున్నట్లు వెల్లడించారు. స్టేషన్ ఘనపూర్ నియోజకవర్గంలో సంక్షేమ ఫలాలను ప్రజలకు అందించడానికి, అభివృద్ధి పనులను పూర్తి చేయడానికి శక్తి వంచన లేకుండా పని చేస్తున్నాని తెలిపారు. నియోజకవర్గానికి 3 వేల 500 ఇందిరమ్మ ఇల్లు మంజూరు అయ్యాయని వాటికీ సంబందించిన లబ్ధిదారుల ఎంపిక ప్రక్రియ తుది దశకు చేరుకుందని అన్నారు. మన నియోజకవర్గానికి అదనంగా మరో 1500 ఇల్లు ఇవ్వాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారిని కోరడంతో అందుకు సీఎం స్పష్టమైన హామీ ఇచ్చారని మొత్తం 5 వేల ఇందిరమ్మ ఇల్లు స్టేషన్ ఘనపూర్ నియోజకవర్గంలో నిర్మించనున్నట్లు వెల్లడించారు.
ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారులు ఇంటి నిర్మాణాన్ని 600 అడుగులకు మించకుండా కట్టుకోవాలని విజ్ఞప్తి చేశారు. 10 ఏళ్ల బిఆర్ఎస్ పాలనలో డబుల్ బెడ్ రూమ్ ల పేరుతో ప్రచారం చేసుకొని లక్ష ఇల్లు కూడా కట్టలేదని కానీ నేడు కాంగ్రెస్ ప్రభుత్వం ఒక్క ఏడాదిలోనే 4 లక్షల 50 వేల ఇళ్ల నిర్మాణం చేపట్టిందని అన్నారు. స్టేషన్ ఘనపూర్ నియోజకవర్గంలో విద్యుత్ సమస్యలు లేకుండా పెద్ద ఎత్తున సబ్ స్టేషన్ల నిర్మాణం చేపట్టినట్లు తెలిపారు. వేలేరు మండలం పిచరలో 132/33 కేవి సబ్ స్టేషన్ ను 24కోట్లతో నిర్మాణం అవుతుందని మరో మూడు నెలలో అందుబాటులోకి వస్తుందని తెలిపారు. దీంతో పాటు ధర్మసాగర్ మండలం రాయగూడెం, రఘునాథపల్లి మండలం కుర్చపల్లి, జఫర్ గడ్ మండలం సాగరం, చిల్పూర్ మండలం కొండాపూర్, చిల్పూర్ మండలం లింగంపల్లి 33/11 కేవి సబ్ స్టేషన్లను నిర్మిస్తున్నట్లు మొత్తం దాదాపు 35 కోట్లతో నియోజకవర్గంలో ఎక్కడా విద్యుత్ సమస్యలు రాకుండా పనులు చేపట్టినట్లు వివరించారు.
అలాగే సీఆర్ఆర్ గ్రాంట్ కింద 14కోట్లతో నియోజకవర్గంలో సిసి రోడ్లు, డ్రైనేజిల నిర్మాణం చేపట్టినట్లు ఇవి జూన్ లోపు పూర్తి చేయనున్నట్లు పేర్కొన్నారు. ప్రతీ గ్రామంలో ధాన్యం కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేసి ధాన్యం కొనుగోలు చేస్తున్నట్లు తెలిపారు. ధాన్యం సేకరణలో సన్నాలకు 500 బోనస్ అందిస్తున్నామని గుర్తు చేశారు. రాష్ట్రంలో అన్ని వర్గాల మన్ననలు పొందుతున్న పథకం సన్న బియ్యం పంపిణీ పథకమని కొనియాడారు. పేద ప్రజల కడుపు నింపుతూ, సంతృప్తి నిచ్చే పథకాన్ని ప్రవేశపెట్టిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. ఎన్ని రకాల ఆర్థిక ఇబ్బందులు ఎదురైనా పేద ప్రజల సంక్షేమంలో వెనక్కి తగ్గకుండా ప్రభుత్వం ముందుకు వెళ్తున్నట్లు తెలిపారు.
కేంద్ర ప్రభుత్వం ఆపరేషన్ కగార్ ను వెంటనే నిలిపివేయాలని, మావోయిస్టులతో శాంతి చర్చలు జరపాలని డిమాండ్ చేశారు. ప్రభుత్వానికి పట్టువిడుపులు ఉండాలని సూచించారు. కేవలం ఎన్ కౌంటర్లతోనే సమస్యలు పరిష్కారం కావని అన్నారు. బీజేపీ ప్రభుత్వం శత్రు దేశంతో కాకుండా స్వంత ప్రజలపైనే దాడులు చేయడం హేయమైనగా అభివర్ణించారు. ప్రపంచ సుందరి పోటీల ద్వారా హైదరాబాద్ బ్రాండ్ ఇమేజ్ పెరుగుతుందని అన్నారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రపంచ సుందరి పోటీలకు అవసరమైన వసతులు మాత్రమే కల్పిస్తుందని అన్నారు. ఈ కార్యక్రమంలో నియోజకవర్గ ప్రజా ప్రతినిధులు, నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.