calender_icon.png 6 November, 2025 | 9:11 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

భారీ వర్షాలకు నష్టపోయిన రైతులను ప్రభుత్వం ఆదుకోవాలి..

06-11-2025 07:02:25 PM

చొప్పదండి మాజీ శాసనసభ్యులు సుంకె రవిశంకర్..

కరీంనగర్ (విజయక్రాంతి): మొంథా తుఫాన్ ప్రభావంతో భారీ వర్షాల వల్ల నష్టపోయిన రైతులను ప్రభుత్వం  వెంటనే ఆదుకోవాలని చొప్పదండి మాజీ శాసన సభ్యులు సుంకె రవిశంకర్ కోరారు. ఈ మేరకు గురువారం చొప్పదండి నియోజకవర్గ బిఆర్ఎస్ నాయకులతో కలసి కరీంనగర్ కలెక్టర్ కు వినతి పత్రం అందజేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. గత వారం రోజుల క్రితం కురిసిన వర్షం కారణంగా చొప్పదండి నియోజకవర్గంలో వేల ఎకరాల్లో వరి పంట దెబ్బతిన్నదన్నారు. రైతులు ఇంత అరిగోస పడుతున్న జిల్లా ఇన్చార్జ్ మంత్రి ఉత్తంకుమార్ రెడ్డి స్వయంగా ఆయనే సివిల్ సప్లై మంత్రిగా ఉండి కూడా, కనీసం ఒక్క రివ్యూ కూడా పెట్టిన దాఖలాలు లేవన్నారు.

గత బిఆర్ఎస్ ప్రభుత్వంలో నాయకులు ప్రజలతో, రైతులతో మమేకమై స్థానిక సమస్యల పట్ల పూర్తిగా అవగాహనతో ఉండి ఎప్పటికప్పుడు పర్యవేక్షించేవారన్నారు. చొప్పదండి నియోజకవర్గంలో 300 పైచిలుకు కొనుగోలు సెంటర్లు ఉంటే, ఇప్పటివరకు పది నుండి పదిహేను శాతం వరకే సెంటర్లు ప్రారంభోత్సవం జరిగాయని అన్నారు. ఇప్పటికైనా జిల్లా అధికారులు క్షేత్రస్థాయి పరిశీలన చేసి పంట నష్టం అంచనా వేసి, పంట నష్టపోయిన రైతులకు ఎకరానికి రూ.25 వేల చొప్పున నష్ట పరిహారం చెల్లించాలన్నారు. తడిసిన వరి ధాన్యాన్ని కటింగ్ లేకుండా కొనుగోలు చేయాలని డిమాండ్ చేశారు. వడ్లకు నల్లగింజ, తేమ ఉన్నా, రైస్ మిల్లర్లు వెనక్కి పంపకుండా కొనుగోలు చేయాలని, పత్తి రంగు మారినా, మ్యాచర్ తో సంబంధం లేకుండా సీసీఐ ద్వారా కొనుగోలు చేయాలని ఆయన డిమాండ్ చేశారు.