13-01-2026 02:45:00 AM
అలంపూర్, జనవరి 12: జూనియర్ డాక్టర్ లావణ్య మృతికి కారణమైన డాక్టర్ ప్రణయ్ తేజ్‌ను డాక్టర్ వృత్తి నుంచి శాశ్వతంగా తొలగించి కఠినంగా శిక్షించాలని సిపిఎం జిల్లా కార్యదర్శి వెంకటస్వామి, కెవిపిఎస్ జిల్లా అధ్యక్షులు పరంజ్యోతి ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఈ మేరకు సోమవారం జల్లాపురం గ్రామంలో లావణ్య కుటుంబాన్ని వారు పరామర్శించారు. డాక్టర్ లావణ్య చిత్రపటానికి పూలమాలలు వేసి సంతాపం తెలిపారు.
అనంతరం మీడియా సమావేశంలో మాట్లాడుతూ.. పవిత్రమైన డాక్టర్ వృత్తిలో ఉన్న ప్రణయ్ తేజ సహచర జూనియర్ డాక్టర్ లావణ్య ను ప్రేమ పేరుతో మోసం చేయడమే కాకుండా కులం తక్కువ దానివని మానసికంగా వేధించి ఆత్మహత్య చేసుకునేలా ప్రేరేపించిన అతనిపై శాశ్వత డాక్టర్ పట్టను రద్దుచేసి ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసును నమోదు చేయాలని డిమాండ్ చేశారు. సంఘటన జరిగి పది రోజులవుతున్న స్థానిక ఎమ్మెల్సీ గాని ఎమ్మెల్యే గాని కుటుంబాన్ని పరామర్శించకపోవడం దారుణం అన్నారు. వెంటనే రాష్ట్ర ప్రభుత్వ మృతురాలి కుటుంబానికి ఐదు ఎకరాల భూమి, 50 లక్షల ఎక్స్గ్రేషియా, కుటుంబంలో ఒకరికి ఉద్యోగం కల్పించాలని డిమాండ్ చేశారు.ఈ కార్యక్రమంలో కేవీపీఎస్ నాయకులు జిల్లా ఉపాధ్యక్షులు రమేష్, విజయ్ కుమార్ ,మండల కార్యదర్శి కే మధు, కార్మిక సంఘం జిల్లా కార్యదర్శి దేవదాసు, మురళీధర్ రెడ్డి, మద్దిలేటి తదితరులు పాల్గొన్నారు.