13-01-2026 02:43:42 AM
గాంధీ ఆసుపత్రి వైద్యాధికారులతో మందకృష్ణ మాదిగ భేటీ
సికింద్రాబాద్. జనవరి 12 (విజయక్రాం తి): కోదాడకు చెందిన కర్ల రాజేష్ కస్టోడియల్ డెత్ కేసుకు సంబంధించిన వివరాలను తెలుసుకునేందుకు పద్మశ్రీ మంద కృష్ణ మాదిగ గాంధీ హాస్పిటల్ను సందర్శించారు. ఈ సందర్భంగా హాస్పిటల్ సూపరిండెంట్ డాక్టర్ ఎన్.వాణి, డిప్యూటీ సూపరింటెండెంట్ డాక్టర్ సునీల్, తదితర వైద్య అధికారులతో చికిత్స, కేస్ షీట్, పోస్టుమార్టం వివరాలపై చర్చించారు.నవంబర్ 16న జైలు ఎస్కార్ట్ తో గాంధీ హాస్పిటల్కు తీసుకొచ్చిన రాజేష్కు సరైన వైద్యం అందలేదని ఆరోపించారు. పోలీసులే అతనికి లేని డయాబెటిస్, స్మోకింగ్, డ్రింకింగ్ అలవాట్లు ఉన్నట్లు తప్పుడు సమాచారం డాక్టర్లకు ఇచ్చారని తెలిపారు.
రాజేష్ ఆరోగ్యంపై జడ్జి ముందు ఇచ్చిన వాంగ్మూలానికి ఇది విరుద్ధమని స్పష్టం చేశారు.పోస్టుమార్టం సమయంలో చట్టపరమైన మార్గదర్శకాలు పాటిం చలేదని, ముగ్గురు వైద్యులను నియమించడంలోనూ, వీడియో రికార్డింగ్ నిర్వహణలోనూ నిర్లక్ష్యం జరిగిందని విమర్శించారు. ఎగ్జిక్యూటివ్ మెజిస్ట్రేట్ పాత్ర కూడా మొక్కుబడిగా ఉందన్నారు.ఈ కేసులో ప్రధాన నిందితుడు చిలుకూరు ఎస్త్స్ర సురేష్ రెడ్డి అని ఆరోపిస్తూ, అతన్ని కాపాడేందుకు రాజకీయంగా ప్రయత్నాలు జరుగుతున్నాయని మంద కృష్ణ మాదిగ ఆరోపించారు. సూర్యాపేట ఎస్పీపై కూడా చట్టపరమైన చర్యలు తీసుకోవాలని, ఎస్త్స్ర సురేష్ రెడ్డిని తక్షణమే సస్పెండ్ చేయాలని డిమాండ్ చేశారు.ఈ కార్యక్రమంలో ఎమ్మార్పీఎస్,ఎంఎస్పి నేతలు పాల్గొన్నారు.